అంతా కలసి ఏయూ వీసీ మీద పడ్డారు. పీవీజీడీ ప్రసాదరెడ్డి మీద విశాఖలోని విపక్షాల మద్దతుతో ప్రజా సంఘాలు ఇప్పటికే చలో ఏయూ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇదే సమయంలో సడెన్ గా టీడీపీ యువ నేత నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు.
ఏయూ వీసీ ప్రసాదరెడ్డిని అర్జంటుగా రీకాల్ చేయాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కి లోకేష్ లేఖ రాశారు. ప్రసాదరెడ్డి 2020లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏయూ ప్రతిష్ట మంటగలిసింది అని ఆయన ఆరోపించారు.
ఏయూలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అడ్డతోవన నియామకాలు సాగుతున్నాయని, ఏయూలో ప్రింటింగ్ ప్రెస్ ని మూసేశారని, యూజీసీ నిధులను సైతం పక్క తోవ పట్టించారని లోకేష్ చాలా ఆరోపణలే చేశారు. ఏయూ కులాల వేదికగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని కూడా మరో ఆరోపణ చేశారు.
మొత్తానికి ఏయూ మీద చాన్నాళ్ళుగా విశాఖ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇపుడు అది కాస్తా లోకేష్ జోక్యంతో స్టేట్ ఇష్యూగా మారిపోయింది. ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి ఉండకూడదు అని టీడీపీ చాలా గట్టిగానే పట్టుపడుతోంది.
మరో వైపు చూస్తే ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి వచ్చాక అసాంఘిక కార్యకలాపాలకు చెక్ చెప్పారని, అలాంటి వారిని ఏరి పారేశారని, ఏయూ స్థలాలను పరిరక్షించారని, ఇవన్నీ కూడా కొంతమందికి అక్కసుగా మారిందని ఆయన అనుకూల వర్గాలు అంటున్నారు.
ఏది ఏలా చూసుకున్నా కాదేదీ రాజకీయాలకు అతీతం అన్నట్లుగా ఇపుడు ఏయూ టార్గెట్ అవుతోంది. దీని మీద గవర్నర్ దృష్టికి లోకేష్ తీసుకురావడం సంచలనంగా చూస్తున్నారు. మరి దీని మీద ఏ రకమైన మలుపులు ఉంటాయో చూడాలి.