2014లో ఏపీ, తెలంగాణ విడిపోయినా.. చివరిసారిగా ఉమ్మడిగానే ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఏపీలో ఐదేళ్లకు అంటే.. 2019లో ఎన్నికలు జరగ్గా.. తెలంగాణ ఓ ఏడాది ముందుకు దూకింది. కాదు కాదు.. కేసీఆర్ ఉరికించారని చెప్పాలి. అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికల అవసరం లేకున్నా కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రతిపక్షాలపై వంకపెట్టి మరీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇక అధికారికంగా 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే ఇప్పుడు కూడా అవకాశముంటే మరో ఏడాది ముందుగానే ముచ్చట మొదలవుతుందనేతి ప్రతిపక్షనేతల అంచనా. వాస్తవానికి ఇప్పుడు కూడా తెలంగాణలో ముందస్తుకి ఛాన్స్ లేదు. కానీ కేసీఆర్ తలచుకుంటే… “బీజేపీ వంచన చేస్తోంది, మరోసారి రాష్ట్రంలో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి” అనే స్లోగన్ తో బరిలోకి దిగినా దిగొచ్చు. అందుకే ఇప్పుడంతా తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు చేస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే..
కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. సింపుల్ గా తన సీఎం సీటు తీసి కొడుకు చేతిలో పెట్టొచ్చు. ఆ మేరకు టీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తే సరిపోతుంది.
కానీ అధికారం అప్పగించేముందు, కొడుక్కి పట్టాభిషేకం చేసే ముందు తెలంగాణలో ఎన్నికలు రావాలనుకుంటున్నారట కేసీఆర్. ఓ ఏడాది ముందుగా అంటే ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టి, ఘన విజయం సాధించి ఆ విజయం ఇచ్చిన కిక్కుతో తాను జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన.
కాంగ్రెస్ భవిష్యవాణి..
తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఇందులో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పారు. అంతే కాదు, కర్నాటక అసెంబ్లీకి కూడా ముందుగానే ఎన్నికలు జరుగుతాయని, అక్కడా ఇక్కడా ఒకేసారి ఎలక్షన్ పెడతారని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా.. ఆ తర్వాత రిజైన్ చేసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి కంటే ముందు పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం కారణంగా పార్టీ పదవికి రాజీనామా చేశారు.
ఉత్తమ్ కుమార్ చెప్పారంటే ఎంతో కొంత లాజిక్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు కాబట్టి, అందులోనూ కాంగ్రెస్ కి ఆయన దగ్గర జరుగుతున్నట్టు అర్థమవుతోంది కాబట్టి.. ఆయన గుట్టుమట్లు ఎంతో కొంత కాంగ్రెస్ నాయకులకు తెలిసే అవకాశముంది.
దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది. అటు బీజేపీ కూడా కేసీఆర్ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తోంది. తెలంగాణలో కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు ముందుకు జరుగతాయని బీజేపీ కూడా అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడా మాట తూలకపోయినా కేసీఆర్ ఎప్పుడు సై అంటే అప్పుడు నియోజకవర్గాల్లో వాలిపోయేందుకు, ప్రచార పర్వం మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నారు.