బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ''అంతులేని కథ'' (1976) కు యిన్‌స్పిరేషన్ ''మేఘే ఢాకా తారా'' (1960) అనే బెంగాలీ సినిమాలో కనబడుతుంది. ఆ సినిమా తీసినది ఆర్ట్ ఫిలింమేకర్‌గా పేరుబడిన ఋత్విక్ ఘటక్. కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకుని అన్యాయమై పోయిన ఓ ఆడపిల్ల కేంద్రంగా నడిచే ఆ కథను స్ఫూర్తి చెడకుండా ఓ చక్కటి కమ్మర్షియల్ సినిమాగా మలచడంలోనే వుంది బాలచందర్ ప్రతిభ. బెంగాలీ సినిమాలో కనబడే పాత్రలు సంక్లిష్టంగా వుంటాయి. అటు నలుపూ కాక, యిటు తెలుపూ కాక 'గ్రే' కలర్‌లో వుంటాయి. సామాన్య ప్రేక్షకుడు వాటితో ఐడెంటిఫై కావడానికి యిబ్బంది పడతాడు. తెలుగులోకి వచ్చేసరికి పాత్రలను స్పష్టంగా రూపుదిద్దేశారు. వీడు మంచి, వీడు కాదు అన్నట్టు. అంతేకాదు, కథలో మలుపులు పెంచారు. మెలోడ్రమటిక్ క్లయిమాక్స్ తెచ్చారు. దానితో బాటు త్యాగమయి ఐన హీరోయిన్‌కు కాంట్రాస్ట్‌గా కేర్‌ఫ్రీగా వుండే మరో స్త్రీ పాత్రను చూపించి, ఆ విధంగా వుంటే నష్టమేమిటో చూపారు.
‘మేఘే ఢాకా తారా' అంటే మేఘాలు కమ్మివేసిన నక్షత్రం. శక్తిపాద రాజగురు అనే ఆయన రాసిన కథ ఆధారంగా తీశారు. దాని యిన్‌స్పిరేషన్‌తో ఎం.ఎస్.పెరుమాళ్ రాసిన కథతో బాలచందర్ సుజాత హీరోయిన్‌గా 1974లో తీసిన తమిళ సినిమా 'అవళ్ ఒరు తొడర్ కదై' (ఆమె ఒక ధారావాహిక) దాన్ని బాలచందరే తెలుగులో 'అంతులేని కథ'గా జయప్రద హీరోయిన్‌గా రీమేక్ చేశారు. జయప్రద తొలిచిత్రాలలో యిది ఒకటి. మొదట బెంగాలీ సినిమాను పరికిద్దాం.
బెంగాలీ సినిమా హీరోయిన్ (పాత్రధారిణి సుప్రియా చౌధురి) ఓ పక్క ఎమ్మే చదువుతూ మరో పక్క ట్యూషన్లు చెప్పి తండ్రి సంపాదనకు సాయపడుతోంది. దేశవిభజన తర్వాత తూర్పు బెంగాల్‌నుండి కలకత్తా సమీపంలోని గ్రామానికి వచ్చిపడిన శరణార్థి కుటుంబం అది. హీరోయిన్ అన్నగారు శంకర్ (పాత్రధారి అనిల్ చటర్జీ)కి చదువు ఎక్కలేదు. సంగీతసాధన చేసి ఏనాటికో పెద్దవాడై పోవాలని ప్లాను. పైసా సంపాదించడు. సంపాదించాలని అనుకోడు. అతనంటె అందరికీ మంట. కానీ హీరోయిన్‌కు మాత్రం అతను ఓ నాటికి నిజంగా గొప్పవాడై పోతాడని పిచ్చి నమ్మకం. అన్నగార్ని మురిపెంగా చూసుకుంటుంది. తనకంటూ ఏమీ కావాలని కోరుకోని స్వభావం హీరోయిన్‌ది. తను అవస్థలు పడుతూనే కుటుంబసభ్యుల సరదాలు తీర్చాలని తాపత్రయ పడుతుంది.
వాళ్ల తండ్రి బాగా చదువుకున్న ప్రొఫెసర్. ఇప్పుడు శరణార్థులకోసం నడిపే స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆ వుద్యోగం కూడా వుంటుందో, వూడుతుందో తెలియదు. వాళ్ల తల్లి యీ సంసారాన్ని యీడ్చుకుని వచ్చే క్రమంలో ఓ గయ్యాళిగా, స్వార్థపరురాలిగా తయారైంది. హీరోయిన్ చెల్లెలికి చదువు అబ్బలేదు. మూడేళ్లగా ఒకటే క్లాసు. కానీ షోకులకు తక్కువ లేదు. తమ్ముడికి ఆటలమీద పిచ్చి. ప్రస్తుతం బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. ఉద్యోగం మాటెత్తితే కస్సుమంటాడు. సరదాలకు లోటు లేదు. హీరోయిన్ అన్నగారికి అడపాదడపా ఖర్చుకి డబ్బివ్వడమే కాదు, తమ్ముడు, చెల్లికి వాళ్లడిగినవి కొనిస్తూంటుంది. ‘ఇంటి ఖర్చు గడవాలి కదా, జీతం మొత్తం నా చేతికి యివ్వకుండా యివేం పనుల’ని తల్లికి కోపం. కూతుర్ని బాగా తిడుతూంటుంది.
సనత్ అనే అతను హీరోయిన్‌ను ప్రేమించాడు. ఆమె నాన్న దగ్గర ఒకప్పుడు స్టూడెంట్. తెలివైనవాడు. రిసెర్చి చేస్తున్నాడు. డబ్బు సరిపోవడం లేదు. స్కాలర్‌షిప్ రాలేదు. చదువు మానేద్దామనుకుంటున్నాడు. హీరోయిన్ ధైర్యం చెప్పింది. నేను డబ్బు యిస్తుంటాను, చదువుకో అని. అతనికి ధైర్యం చాలటం లేదు. పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. సంసారం విడిచి రాలేను కదా. ఒక్క రెండేళ్లు ఆగు. అంటుంది ఆమె. నువ్వు మేఘావృతమైన నక్షత్రానివి అంటాడతను. ఆ భాషలోనే ప్రేమలేఖలు రాస్తూంటాడు. ఉన్న కష్టాలు చాలవనట్లు మరో సంఘటన జరిగింది. ఓ రోజు వాళ్ల నాన్నకు తెలిసున్న ఓ వీధిగాయకుడు వచ్చాడు. భార్య వద్దంటున్నా వినకుండా అతనితో వెళ్లాడు. అతనితో బాటు గంజాయి సేవించి, తిరిగి వస్తూ, తల తిరిగి రైలు పట్టాలమీద పడ్డాడు. తలకు దెబ్బ తగిలింది. ఎముక విరిగింది. ఉద్యోగం వూడింది.
హీరోయిన్ ఎమ్మే చదువు పక్కన పెట్టేసింది. కలకత్తాలో వుద్యోగంలో చేరింది. రోజూ వూరినుండి అప్ అండ్ డౌన్ చేస్తోంది. హీరో మండిపడ్డాడు. నేను చదువు మానేసి వుద్యోగంలో చేరతాను. బాగానే జీతం వస్తుంది. పెళ్లి చేసేసుకుందాం. నువ్వు చదువుకుందువు గాని అన్నాడు. వద్దు, మొత్తం కుటుంబం నాపై ఆధారపడి వుంది. మా అన్నగారు ఎప్పటికైనా పెద్దవాడవుతాడు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. నువ్వు కష్టాలు ఓర్చుకో. రిసెర్చి మానకు అంది. ఈమె మీద జాలి పడడం అనవసరం అనిపించింది అతనికి. మీ అన్నలాటి దున్నపోతుకు సపోర్టెందుకు చేస్తావ్? అని అతను మండిపడ్డాడు. అన్నగారు కూడా గిల్టీగానే ఫీలవుతున్నాడు. 'నాన్న కొద్దిగా కోలుకుని ట్యూషన్లు చెపుతున్నాడు. తమ్ముడు చదువు మానేసి ఫ్యాక్టరీలో కూలీగా చేరాడు. అయినా నేను మాత్రం నీమీద పడి తింటున్నాను. మమ్మల్ని వదిలేసి నువ్వు పెళ్లి చేసుకో.' అన్నాడు. ‘నన్ను నిజంగా ప్రేమిస్తే అతను నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేయకపోతే పెళ్లే చేసుకోను' అందీమె ధీమాగా.
చెల్లి యీ మాటలు విని సంతోషించింది. అప్పటికే ఆమె సనత్‌పై కన్నేసింది. అందుకే యీసారి సనత్ తమ యింటికి వచ్చినపుడు, అక్క ట్యూషన్‌కి వెళ్లగా చూసి వగలు కురిపించింది. అతనికి టీ యివ్వనా? అతనితో షికారు వెళ్లనా? అని తల్లిని పర్మిషన్ అడిగితే ఆమె గుంభనగా నీ యిష్టం అనేసి వూరుకుంది. ఆమె స్వార్థం ఆమెది. ఉద్యోగస్తురాలైన పెద్ద కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, చదువూ, సంధ్యా లేని యీ మొద్దుని ఎవరు చేసుకుంటారు? ఎలాగోలా పెళ్లి కుదిరితే చాలు అన్న ఆలోచన గల తల్లి పాత్రను చాలా సహజంగా మలచారు ఘటక్. కష్టాలు ఆమెలో మానవత్వాన్ని హరింపజేశాయి. రెండో కొడుకు వుద్యోగస్తుడయ్యాక ‘జీతం మొత్తం యింట్లో యివ్వను, నా తిండికోసం దాచుకుంటా’నంటే సరేనంటుంది. అదే పెద్దకూతురు తన జీతంలోంచి చెల్లికి, తమ్ముడికి ఖర్చు పెట్టినా కస్సుమంటుంది.
ట్యూషన్‌నుండి తిరిగి వస్తూ హీరోయిన్ చెల్లి, సనత్ పాటలు పాడుకోవడం చూసింది. తన కోసం వెయిట్ చేయలేక సనత్ కూడా టెంప్ట్ అవుతున్నాడని గ్రహించింది. సనత్ రిసెర్చి మానేశాడని విని అతని గదికి వెళ్లింది. ‘అవును, కష్టాలతో వేగలేక 300 రూ.ల వుద్యోగంలో చేరాను’ అన్నాడతను. అతని గదిలో చెల్లెలు దాగివుండడం గమనించింది. నిన్నటిదాకా తన సహాయంతో చదువుకున్న అతను, తన సొంత చెల్లెలు యిలా ప్రవర్తించడం ఆమె తట్టుకోలేక పోయింది. కళ్లు తిరిగాయి. ఏడ్చింది. జీవితంపై విరక్తి కలిగింది.
అక్కగారి ప్రియుణ్ని కాజేసినందుకు చెల్లి ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా ఎవరూ ఎవరికోసం జీవితాంతం కాచుకుని వుండరని తత్త్వం చెప్పింది. చెల్లి పెళ్లికి సరేనంది హీరోయిన్. తల్లి వచ్చి అడిగితే తన చెవి రింగులు, గాజులు కూడా చెల్లికి యిచ్చేసింది. డబ్బివ్వాల్సి వస్తుందని తమ్ముడు పెళ్లికి హాజరవలేదు. ఇదంతా చూస్తున్న తండ్రి అపరాధభావనతో కృంగిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అన్నగారు కూడా బాధతో కుమిలిపోయాడు. 'నీ మంచితనం కింద నువ్వే అణిగిపోతున్నావు. చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని సహించలేను, భరించలేను. నిరసనగా నేను ఇల్లు వదిలేసి వెళ్లిపోతా.' అన్నాడు.
తెలుగులోకి వచ్చేసరికి కథ ఎలా మారిందో చూద్దాం. హీరోయిన్ జయప్రద పట్నవాసపు అమ్మాయి. అలంకరించుకుని వుద్యోగానికి వెళ్లవలసిన అమ్మాయి. ఈమె తండ్రి బోల్డుమంది పిల్లల్ని కనేసి యింట్లోంచి పారిపోయాడు. ఒరిజినల్‌లో లాగానే బాధ్యత మరచిన అన్నగారు కూడా వున్నాడు. ఇతను తాగుబోతు, పెళ్లి చేసుకుని యిద్దరు పిల్లల్ని కని వీళ్లమీద పడేసి పోయాడు. బెంగాలీలో లాగానే ఓ షోకులమారి చెల్లెలు కూడా వుంది. అయితే ఆమె యిందులో వితంతువు. వాళ్లే కాక యింట్లో యింకా పిల్లలున్నారు. వాళ్ల గురించి ఒకేసారి పరిచయం చేసేశారు. పాతికేళ్లకే యింత భారం మీద పడడంతో జయప్రదలో ధైర్యం, దానితో బాటు మాటలో కాఠిన్యం పెరిగాయి. తనకు ప్రేమలేఖ రాసిన మేనేజర్‌పై తన కంపెనీ మేనేజింగ్ డైరక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అతను యాక్షన్ తీసుకుంటానంటే పోన్లెండి అనేసింది.
ఒరిజినల్‌లో లాగానే జయప్రదకూ ఓ ప్రియుడున్నాడు. అతను డబ్బుకోసం యీమెపై ఆధారపడలేదు. డబ్బున్నవాడు. ఈమె ఆమోదం కోసం నాలుగేళ్లగా వేచి వున్నాడు. కుటుంబ బాధ్యతలు ఒక కొలిక్కి వచ్చి అన్నగారు బాధ్యత తీసుకుంటే పెళ్లి చేసుకుందామని యీమె ఆశ. కానీ యింట్లో వాళ్ల తీరు చూస్తే ఏమీ బాగాలేదు. అన్న (రజనీకాంత్) తాగి వస్తే యీమె యింట్లోకి రానివ్వనంటుంది. కానీ తల్లి చాటుగా అన్నం పెడుతుంది. భార్య కోరిక తీరుస్తుంది. అతను చెల్లెల్ని నువ్వు మనసులేని బండరాయివంటూ తిట్టేసిపోస్తాడు తప్ప బాధ్యత తీసుకోడు. ఇంట్లో అన్నం పెడుతున్నా తమ్ముళ్లు తమ సరదాల కోసం బయటకు వెళ్లి ముష్టెత్తుకుంటారు. వితంతు చెల్లెలు రాత్రింబగళ్లు కోరికలతో సతమతమవుతూ వుంటుంది. వాళ్లింటి మేడ పై గదిలో ఓ మిమిక్రీ ఆర్టిస్టు వుంటాడు. అతను ఈ వితంతువును మూగగా ప్రేమిస్తున్నాడు. ఈమెక్కూడా అతనిపై యిష్టం వుంది కానీ బయటపడదు.
ఓ రోజు తిలక్ తల్లి మా వాడు ఎంతకాలం యిలా ఆగాలని జయప్రదను అడిగేసింది. ఈమె చాలా కటువుగా మాట్లాడింది. తిలక్ నొచ్చుకున్నాడు. ఆమెతోనే కాదు, తల్లితో కూడా జయప్రద మాట్లాడే తీరు అంతే. పారిపోయిన తండ్రి గురించి డబ్బు ఖర్చు పెట్టి వెతికిద్దామంటే ఎందుకొచ్చిన ఖర్చు అంది. ఈమె డిసిప్లిన్ వలన కుటుంబంలో అందరూ పగబట్టారు. ఒకరోజు విరుచుకుపడ్డారు. జయప్రద, తను యింట్లో వాళ్ల భవిష్యత్తుకోసం ఎలా డబ్బు దాస్తోందో నిరూపించి అన్నగారితో ఛాలెంజ్ చేసింది. నువ్వు తాగుడు మానేసి రాత్రి రా. ఇంటి బాధ్యత తీసుకుని నన్ను తరిమేయ్ అని. కానీ అతనిలో మార్పేమీ రాలేదు. దాంతో యింట్లో వాళ్లందరూ ప్లేటు ఫిరాయించారు.
బెంగాలీ ఒరిజినల్‌లో స్వార్థపరత్వాన్ని యింత ప్రస్ఫుటంగా చూపించరు. అక్కడంతా సటిల్‌గా వుంటుంది. అక్కడ తండ్రికి యాక్సిడెంటు అయి నిరుపయోగం అయిపోతాడు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించడానికి ధైర్యం లేదని పిరికివాడిలా పారిపోయాడు. ఓ రోజు యింట్లోంచి పారిపోయిన తండ్రి నుంచి వుత్తరం వస్తుంది. భగవంతుడిచ్చిన సంపద తీసుకుని తిరిగి వస్తున్నానని! జయప్రద ఎంతో సంతోషించి, ఉద్యోగం మానేసి, తిలక్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ అతను తిరిగి వచ్చినది ఓ స్వామీజీగా! భగవంతుడిచ్చిన సంపద ఆధ్యాత్మిక సంపదట! ఈమె ఆశలన్నీ భగ్నమయ్యాయి.
దానికి తోడు పెళ్లి వాయిదా వేయడంతో మండిపడిన తిలక్ ఒరిజినల్‌లో లాగానే ఆమె చెల్లెలితో ప్రేమలో పడ్డాడు. పరిస్థితి గమనించి జయప్రద ఆమోదించింది. చెల్లెలికి తన ప్రియుణ్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి వేడుకల్లో మిమిక్రీ కుర్రాడు పాట పాడాడు. అతనూ భగ్నప్రేమికుడే, జయప్రదా భగ్నప్రేమికురాలే. కొన్ని రోజులు గడిచాయి. జయప్రద కష్టాలు మరింత ముదిరాయి. అన్నగారు వాళ్ల కంపెనీ ఎండీ వద్దకు వెళ్లి ఈమె పేరు చెప్పి డబ్బు అడిగాడు. ఈమెకు కోపం వచ్చి యిల్లు వదిలి పోతానంది. కావాలంటే నన్నూ, తక్కిన చెల్లెళ్లను తాకట్టు పెట్టి బతకరా అని అన్నగార్ని తిట్టింది. అతని వరసచూసి అతని కొడుక్కే అసహ్యం వేసింది. తండ్రి మొహం మీద ఉమ్మేశాడు. ఇది అతనిలో మార్పు తెచ్చింది.
బెంగాలీ ఒరిజినల్‌లో అన్నగారు యిల్లు వదలి పారిపోయాక హీరోయిన్ మరింత ఒంటరిదై పోయింది. ఇంతలో మరో అఘాతం. ఉద్యోగం రాగానే యింటి బాధ్యత వదిలేసి తన సుఖం చూసుకున్న తమ్ముడికి ఫ్యాక్టరీలో యాక్సిడెంటు అయింది. ఈమె నాకేం అని వూరుకోలేదు. ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ యీమెకు జ్వరం వుందని గమనించిన నర్సు ఎక్స్‌రే తీస్తానంది. వద్దంది హీరోయిన్. తమ్ముడి చికిత్సకు డబ్బు కావాలి కదా. మాజీ ప్రియుడు, ప్రస్తుతం మరిది అయిన సనత్ వద్దకు వెళ్లి డబ్బు అడిగింది. ఆమె డబ్బుతోనే చదువుకున్న సనత్ 150 రూ.లు యిచ్చి పంపేశాడు. వెంటనే ధూర్తురాలైన చెల్లికి అనుమానం కలిగింది, భర్తకు, అక్కకు మళ్లీ వ్యవహారం నడుస్తోందేమోనని. భర్త కోపగించుకున్నాడు.
హీరోయిన్‌కు దగ్గు, రక్తం పడడం మొదలైంది. క్షయ వ్యాధి ఆమెను ఆవహించింది. చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేదు. ఇంట్లో వాళ్లకు సోకకూడదని విడిగా వేరే గదిలో వుండసాగింది. తల్లికి అనుమానం వచ్చింది. సంగతేమిటంది. ‘ఇన్నాళ్లూ అడగలేదు, ఇప్పుడు అడిగే ప్రయోజనం లేదం’ది హీరోయిన్. ఆవిడ డిప్లోమేటిక్ సైలెన్స్ పాటించింది. సనత్ వచ్చి ఏమిటీ ఘోరం అన్నాడు. నా పై జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించకపోవడమే నేను చేసిన పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అంది హీరోయిన్. నేను ఉద్యోగం మానేసి, మళ్లీ చదువుతాను. నీలాగే కష్టపడతాను అన్నాడు. అదేమీ జరగలేదు కానీ చెల్లెలు గర్భవతి మాత్రం అయింది. హీరోయిన్‌కు రోగం బాగా ముదిరి చికిత్సకు లొంగని దశలో అన్నగారు తిరిగి వచ్చాడు. ఒక కచ్చేరీకి 1200 రూ.లు తీసుకునే స్థాయికి వచ్చి డబ్బు గడించి తిరిగి వచ్చాడు.
అన్నగారు రాగానే మేనల్లుడికి ఏం కొనిపెడతావని వెంటపడింది చెల్లి. ఈ యిల్లు పడగొట్టి రెండస్తుల మేడ కడదామని ప్లానేసింది తల్లి. ఇంతకీ పెద్ద చెల్లి ఎక్కడన్నాడు అతను. నోట్లోంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ గది బయటకు వచ్చి తనకు క్షయ అని ఎనౌన్సు చేసిందామె. తండ్రి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన ఆక్రోశాన్ని వెళ్లగొట్టాడు. ‘నీ అవసరం తీరిపోయింది తల్లీ, ఇక్కణ్నుంచి వెళ్లిపో. మమ్మల్ని మన్నించి వెళ్లిపో’ అన్నాడు. అన్నగారు హీరోయిన్ని షిల్లాంగ్ తీసుకెళ్లి శానిటోరియంలో చేర్పించాడు. అక్కడ ఆమె క్రమంగా కోలుకుంటోంది. కానీ బతికే ఆశ లేదు. అన్నగారు చూడడానికి వస్తున్నాడు. వచ్చినపుడు చెల్లెకి కొడుకు పుట్టాడని, యిల్లు కూల్చి రెండస్తుల మేడ కట్టామని యిలా వార్తలు చెపుతున్నాడు.
ఓసారి అవేళ అతను వెళ్లేసరికి ఆమె సనత్ తనకు గతంలో రాసిన వుత్తరం చదువుతోంది. మేఘాలు కప్పేసిన నక్షత్రం లాటిదానివి నువ్వు అని రాసిన ఉపమానాన్ని చదువుకుని ఎంతో ఏడ్చింది. అన్నగారు చెప్పిన వార్తలు వింటూంటే ఆమెలో మళ్లీ జీవితేచ్ఛ కలిగింది. అన్నా నాకు బతకాలని వుందన్నా అని ఒక్క పెట్టున రోదించింది. ఆమె సమయం ముగిసిపోయిందని తెలిసి విచారంతో తిరిగి వస్తున్న అన్నగారికి తన చెల్లెలు లాటి అమ్మాయే మరొకామె కనబడింది. ఇలాటి అభాగినులు ఎంతమందో అని మనమూ నిట్టూరుస్తూండగా సినిమా ముగుస్తుంది.
ఒరిజినల్‌లో లేదు కానీ తెలుగులో హీరోయిన్‌కు కాంట్రాస్ట్ గా జయలక్ష్మి పాత్రను పెట్టారు. ఆమె కేర్‌ఫ్రీ గర్ల్. లైఫ్‌ని అనుక్షణం ఎంజాయ్ చేద్దామనుకునే లక్షణం. బాయ్‌ఫ్రెండ్స్‌ను మారుస్తూ వుంటుంది. లోకాన్ని పట్టించుకోనక్కర లేదని ఆమె ఫిలాసఫీ, ఆమె తల్లి ఒక డబ్బున్న వితంతువు. ఒంటరితనంతో బాధపడుతూ పుస్తకాలు విపరీతంగా చదువుతూ వుంటుంది. జయప్రద ఆఫీసులో మేనేజరంటే జయలక్ష్మి మోజు పడుతుంది. అతను మంచివాడు కాడని యీమె హెచ్చరించినా వినదు. దురదృష్టవశాత్తూ ఆమె తల్లి కూడా అతని వలలో పడుతుంది. ఓ రోజు అనుకోకుండా జయలక్ష్మికి అనుమానం వచ్చింది. వెళ్లి పెళ్లి చేసుకోమని మేనేజర్ని అడిగింది. అతను పామ్మన్నాడు. మరో రోజు యింట్లోనే తల్లితో చూసిందతన్ని, తల్లీకూతుళ్ల మధ్య ఏ పోరు వచ్చినా సవతి పోరు మాత్రం రాకూడదంది జయలక్ష్మి. తల్లికి విషయం అర్థమై ఆత్మహత్య చేసుకుంది. ఈమె కూడా ఆత్మహత్య చేసుకోబోయింది.
కానీ జయప్రద, మిమిక్రీ కుర్రాడు ఆపారు. ఆమెలో క్రమంగా మార్పు వచ్చింది. జయప్రద అన్నగారిలో కూడా మార్పు వచ్చింది. అతను హోటల్లో బేరర్‌గా చేరాడు. అన్నగారు బాగుపడడంతో జయప్రద రాజీనామా చేస్తానంది. ఆ కంపెనీ ఎండీ ‘నీ బదులు మీ అన్నకు ఉద్యోగం యిస్తా’నన్నాడు. ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ఈమె కాస్త టైమివ్వండి అని కోరింది. జయలక్ష్మిలో మార్పు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోమని మిమిక్రీ కుర్రాణ్ని కోరింది. ‘మీరు మీ ఎండీని చేసుకుంటేనే..’ అని షరతు పెట్టాడతను. ఈమె సరేననక తప్పలేదు. అన్నగారు వెనకాల ఉండి కథ నడిపాడు. జయప్రద, జయలక్ష్మి యిద్దరి పెళ్లిళ్లూ సింహాచలంలో ఏర్పాటు చేశారు.
ఆఖరి నిమిషంలో దీపం కుందె గురించి గుర్తుకు వచ్చి అన్నగారు వైజాగ్ బయలుదేరాడు. పెళ్లికూతుర్లపై పగబట్టిన విలన్ పెళ్లి ఆపుదామని వస్తూ అనుకోకుండా అన్నకు లిఫ్ట్ యిచ్చాడు. పెళ్లి ఆపడంలో సాయపడమని అన్నకు ఆఫర్ యిచ్చాడు. పెళ్లి ఆపవద్దని బతిమాలి, ఆ తర్వాత ఘర్షణ పడ్డాడు అన్నగారు. ఆ క్రమంలో విలన్ అన్నగార్ని చంపేశాడు. కబురు తెలియగానే హీరోయిన్ త్వరగా నిర్ణయం తీసుకుంది. ఎండిని ఒప్పించి తన బదులు తన చెల్లితో పెళ్లి చేయించింది. పెళ్లయేవరకు అన్నగారి చావు కబురు బయటకు పొక్కనివ్వలేదు. హీరోయిన్ జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. తేడా అల్లా వితంతు చెల్లికి బదులు వితంతు వదినగారు కుట్టుమిషన్ ఎక్కింది. అవే బాధ్యతలు, అదే ఆఫీసు, అదే సిటీ బస్సు.. జయప్రద కథ కంచికి చేరలేదు. మళ్లీ మొదటి అధ్యాయానికే వచ్చి చేరింది.
ఈ విధంగా తెలుగు సినిమా ముగుస్తుంది. బెంగాలీ సినిమా, తెలుగు సినిమా రెండూ గుండెల్ని పిండేవే. అయితే తెలుగు సినిమాలో మెలోడ్రామా, సంభాషణలూ ఎక్కువ. ఒరిజినల్ సినిమా సహజత్వానికి దగ్గరగా వెళుతుంది. చెల్లెల్ని పెళ్లాడాక కథానాయిక ప్రియుడిలో అపరాధ భావనను, మానసిక సంఘర్షణను ఒరిజినల్‌లో చూపించారు. తెలుగులో అవి కానరావు. బెంగాలీలో తల్లి, తండ్రి పాత్రల్లో ఎక్కువ డైమన్షన్స్ వున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అంత మింగుడు పడదనుకున్నారు కాబోలు, ఏకపక్షంగా చూపించారు. తెలుగులో మిమిక్రీ కుర్రవాడి ద్వారా హాస్యం చూపించారు. జయలక్ష్మి చాప్టర్ అంతా తెలుగులో కల్పించినదే. ఇక విలన్ పాత్రను కూడా తెలుగులో సృష్టించి అతని ద్వారా డెలిబరేట్ ట్విస్టు కొని తెచ్చారు. అంతులేని కథ దాని తమిళ వెర్షన్ లాగానే బాగా ఆడింది. ఆర్ట్ ఫిల్మ్ వంటి బెంగాలీ సినిమాకు ప్రజామోదం కలిగేట్లా మలచిన బాలచందర్ అభినందనీయులు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)