వరసబెట్టి తీర్మానాలు అయితే చేస్తున్నారు. ఈ విషయంలో మాకు మేమే సాటి అని కూడా చెప్పుకుంటున్నారు. మా చిత్తశుద్ధి ఇదిగో చూస్కోండి అని కూడా అంటున్నారు. సరే తీర్మానాల వల్ల ఒక్క అడుగు అయినా ప్రైవేటీకరణ ఆగిందా అంటే లేదు అని ఎవరైనా చెప్పాల్సిందే.
దీని మీదనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ కారులు గుర్రుమంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైసీపీ తీర్మానాల మీద తీర్మానాలు చేస్తోంది. తొలుత అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ మీదట మహా విశాఖ నగర పాలక సంస్థ కూడా తీర్మానం చేసింది. ఇపుడు లేటెస్ట్ గా విశాఖ జిల్లా పరిషత్ కూడా తీర్మానం చేసింది.
ఇవన్నీ కూడా తమ చిత్తశుద్ధిని అని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పుకుంటున్నారు. అయితే దీని వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని ఇప్పటికే తేలిపోయింది. కేంద్రం మాత్రం ప్రైవేటీకరణకే జై అంటోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కూడా ఫుల్ క్లారిటీగా చెబుతోంది.
ఇంకో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక లోకం ఏడాది పై దాటి మరీ ఉద్యమాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. తీర్మానాల కంటే అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు. కేంద్రం ఎదుటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప తీర్మానాలు పెట్టేసి చేతులు దులుపుకుంటే లాభమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇంకో వైపు విశాఖ వస్తున్న బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనివార్యం అని అపశకునాలు పదే పదే పలుకుతున్నారు. మొత్తానికి ఈ తీర్మానాల పర్వం ఇక్కడితో ఆగుతుందా పంచాయతీ లెవెల్ దాకా అలా చేసుకుంటూ పోతారా అన్నది వైసీపీ నేతలే చెప్పాలని కార్మిక లోకం అంటోంది. మొత్తానికి తీర్మానాలు కాదు, తీర్పు కావాలన్నదే ఉద్యమకారుల మాట.