వెన్నుపోటు అనగానే గుర్తొచ్చే పేరు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తనలాంటి వెన్నుపోటుదారుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారా అని లెక్కలు వేస్తున్నారు. జగన్ కు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు ఎవరున్నారా అంటూ ఆరాలు తీస్తున్నారు. అన్ని అంతర్గత సమీక్ష సమావేశాల్లో పరోక్షంగా ఇదే చర్చ.
ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో.. వైసీపీలో వెన్నుపోటుదారులు కనిపించకపోతే, తనే తయారుచేసేలా చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నట్టున్నారు. రఘురామను రెచ్చగొట్టినట్టు, వైసీపీ ఎమ్మెల్యేలు కొందర్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు.
ఇటీవల నటుడు శివాజీ వైసీపిలో జంపింగ్ ఎమ్మెల్యేలు, జంపింగ్ ఎంపీలు ఉన్నారంటూ నెంబర్లతో సహా చెప్పారు. అదే నిజమైతే వారంతా వెన్నుపోటు బ్యాచ్ అన్నట్టే లెక్క. అలా జగన్ కి నమ్మకద్రోహం చేసి పక్క పార్టీలోకి వచ్చేవారు ఎవరున్నారా అని ఎదురు చూస్తున్నాయి వైరి పక్షాలు.
జగన్ ని ఎలా దెబ్బకొట్టాలి..?
నేరుగా జగన్ ని దెబ్బకొట్టడం చంద్రబాబుకి అసాధ్యం అని తేలిపోయింది. నవరత్నాలు, అభివృద్ధి పథకాలతో జగన్ జనాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన ఇమేజ్ ఎక్కడా తగ్గలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలలో జగన్ తీరుపై కాస్తో కూస్తో అనుమానం ఉందనే ప్రచారం మాత్రం ఉంది.
ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, ఆటో డ్రైవర్లకి, దర్జీలకు ఇలా అందరికీ డబ్బులు పంచిపెడుతున్నారనే బాధ ఇంకొందరిలో ఉందని, కోర్టుల్లో తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయని.. ఇలా రకరకాల కారణాలతో జగన్ ని ఎమ్మెల్యేల దృష్టిలో పలుచన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అభిమానాన్ని అనుమానంగా మార్చే ప్రయత్నం..
2024లో వైసీపీకి విజయం కష్టం అని ఎమ్మెల్యేలలో అనుమానం రగల్చడం ఒక ఎత్తయితే.. 2024లో తమకి టికెట్లు దక్కవు అని కొంతమందిలో అనుమానం రేకెత్తించి, వారిని తమవైపు తిప్పుకోవడం మరో ఎత్తు. జగన్ కి ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం కూడా అందులో భాగమే.
వైసీపీలో కొంతమందికి తిరిగి టికెట్ ఇవ్వడం కష్టం అంటూ పనిగట్టుకుని టీడీపీ అనుకూల మీడియా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని ప్రోత్సహిస్తోంది.
దీంతో సహజంగానే కొంతమంది ఎమ్మెల్యేలకు అనుమానం పట్టుకుంది. అలా బయటకు వచ్చినవారందర్నీ తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. మొత్తమ్మీద.. జగన్ కి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చేవారిపైనే బాబు ఆశలన్నీ. ఇప్పుడు టీడీపీలో ఉన్న నాసిరకం సరుకుపై ఆయనకి పెద్దగా ఆశల్లేవు, తన కొడుకు లోకేష్ తో సహా.