“ప్రజల కోసం పవన్ తన జీవితాన్ని త్యాగం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ వ్యక్తిగతంగా చాలా నష్టపోయారు. ప్రజల కోసం పవన్ తన కంఫర్ట్స్ అన్నీ వదులుకున్నారు.” నాదెండ్ల మనోహర్ తో పాటు జనసైనికులంతా పవన్ పై చేసే వ్యాఖ్యలివి.
ఇక లోకేష్ విషయానికొస్తే, టీడీపీ నేతలంతా జయము..జయము లోకేష్ అంటూ కీర్తనలు అందుకుంటారు. భావి నాయకుడిగా ఆల్రెడీ ఇమేజ్ కూడా ఇచ్చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఇది కాదు. ఇలా జాకీలేస్తే సరిపోద్దా.. పవన్, లోకేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోద్దా? పవన్ లేదా లోకేష్ లో ఒకరు నేరుగా వెళ్లి సీఎం కుర్చీలో కూర్చుంటారా? ఈ జాకీల రాజకీయం ఇంకెన్నాళ్లు?
ట్విట్టర్ పులి లోకేష్…
ప్రజా క్షేత్రంలో లోకేష్ కి బలం లేదని గ్రహించే దొడ్డిదారిన మంత్రిని చేసి మండలిలో కూర్చోబెట్టారు చంద్రబాబు. అందరి అంచనాల్ని నిజం చేస్తూ, 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు చినబాబు. ఆ తర్వాత కూడా లోకేష్ జనంలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు. అందుకే లోకేష్ కి ఓ సెపరేట్ బ్యాచ్ అప్పగించారు చంద్రబాబు. ఆయన ఏది మాట్లాడినా చుట్టూ ఉండేవారు ఆహా ఓహో అనేవారు. దీంతో ఆయన రెచ్చిపోయేవారు. రా చూసుకుందాం, నీ ప్రతాపమో, నా ప్రతాపమో అంటూ వీరంగం వేసేవారు.
చుట్టుపక్కల జనం లేకపోతే లోకేష్ పిల్లి అనే విషయం అందరికీ తెలిసిందే. అదే బ్యాచ్ ట్విట్టర్ లో లోకేష్ తరపున ట్వీట్లు వేస్తుంటుంది. జాకీలేసి పైకి లేపాలని చూస్తుంది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాతో కూడా ఎంత చేయాలో అంతా చేయిస్తున్నారు చంద్రబాబు. వారసుడు ఏం మాట్లాడినా.. ఈనాడు, ఆంద్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ లో కనిపిస్తుంది.
ఇక చినబాబు గడ్డం పెంచినా, కాస్త బరువు తగ్గినా.. అబ్బ, అబ్బబ్బ అంటూ ఊదరగొడతారు. ఇలాంటి ఎలివేషన్లతోటే కాలం గడుపుతున్నారు కానీ అసలు లోకేష్ కి ఆదరణ ఏమాత్రం పెరిగిందనే లెక్క కూడా వారు ఎప్పుడూ వేసుకోలేదు. ఎందుకంటే, నిజాలు వీళ్లకు నచ్చవు.
పవన్ ది మరీ విడ్డూరం..
పవన్ కల్యాణ్ ఏదో దీనజనోద్ధరణ కోసం వచ్చిన పరమ పావన మూర్తిగా బిల్డప్ ఇస్తుంటారు జనసైనికులు, జనసేన నాయకులు. పవన్ డబ్బుల కోసం, కుటుంబం కోసం సినిమాలు చేసినా.. అదిగో ఆ సంపాదనంతా జనం కోసమే ఖర్చుపెడతారంటూ బిల్డప్ ఇస్తారు. జనం కోసం పవన్ వ్యక్తిగత జీవితం వదిలేసుకున్నారని, జనంలోకి వచ్చారని అంటారు.
రాజకీయలు పక్కనపెట్టి సినిమాలు చేసినా అదంతా మీ కోసమేనంటూ కలరింగ్ ఇస్తారు. పవన్ ఏది చేసినా జనం కోసమే అనేది జనసైనికులకు నరనరానా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లు కూడా పవన్ ని అభిమానిస్తాం, జగన్ కి ఓటేస్తాం అంటుండేసరికి ఆ జాకీలు కూడా సరిపోవడం లేదు.
ఇద్దరి టార్గెట్ ఒక్కటే..
పవన్, లోకేష్.. ఇద్దరి టార్గెట్ ఒక్కటే. సీఎం కుర్చీలో కూర్చోవడం. కానీ దాని కోసం వారు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనేది మాత్రం పట్టించుకోవట్లేదు. ఏపీలో గతంలో సీఎంలు అయిన ఎవరూ గాలివాటంగా వచ్చినవారు కాదు. కానీ ఒకరిద్దరు తప్ప. ఇక్కడ పవన్, లోకేష్ ఏమాత్రం ఒళ్లు కందకుండా సీఎం కుర్చీ కావాలనుకుంటున్నారు. కనీసం చంద్రబాబు నుంచి అధికారాన్ని లాగేసుకున్న జగన్ ఎంత కష్టపడ్డారో ఎప్పుడైనా ఆలోచించారా.
కష్టపడటం అంటే మెడలో ఎర్ర కండువా వేసుకుని, నల్ల చెప్పులు తొడుక్కుని, జుట్టు సరిచేసుకుంటూ రోడ్డుపై విలాసంగా నడవడం కాదు. ఒళ్లు తగ్గించి, తెల్లగడ్డం పెంచి.. మేధావిలాగా బిల్డప్ ఇవ్వడమూ కాదు. చుట్టూ చేరిన వందిమాగధుల చేత జేజేలు కొట్టించుకోవడం కాదు. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడే లోకేష్, పవన్ జనంలోకి వస్తారు. జనంలోనే ఉంటారు. అప్పుడిక ఈ జాకీల రాజకీయం అక్కర్లేదు.