ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వింటే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరగకుండా ఉండవు. తన దేశంపై రష్యా దాడి ఎంతగా ఆవేదన కలిగిస్తున్నదో ఉక్రెయిన్ అధ్యక్షుడి మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు.
బహుశా తనను ప్రాణాలతో చూడడం ఇదే చివరిది కావచ్చని జెలెన్‌స్కీ గద్గద స్వరంతో చెప్పడం యావత్ ప్రపంచాన్ని వేదనకు గురి చేసింది. అమెరికా చట్ట సభ్యులతో జెలెన్‌స్కీ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలని అమెరికా చట్టసభ్యులను ఆయన వేడుకున్నారు. అలాగే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయన కోరారు. రాజధాని కీవ్‌లోనే తాను ఉన్నట్టు జెలెన్‌స్కీ తెలిపారు.
తమ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని మరోసారి ఆయన నాటోను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని అమెరికా చట్టసభ్యులతో అన్నారు. అలాగే ఇవే తన చివరిమాటలు కావచ్చని ఆయన తీవ్ర భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను వదులుకునేందుకు ఉక్రెయిన్లు సిద్ధంగా లేరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ దేశంలోని ప్రతి అంగుళం స్థలాన్ని కాపాడుకుంటామని ఆయన ధైర్యంగా చెప్పడం గమనార్హం.