తమ ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ హైకోర్టులో వ్యతిరేక తీర్పులు, ఘాటు కామెంట్స్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి తాజా ప్రకటనను చూస్తే… తీర్పులపై ప్రభుత్వం భారీ స్కెచ్ వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా శాసన వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా వెలువడిన తాజా తీర్పుతో పాటు ప్రభుత్వం అభ్యంతరాలపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీ హైకోర్టుతో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభిప్రాయాల్ని చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించిన వివరాలు బలపరుస్తున్నాయి.
అసెంబ్లీ వేదికగా తీర్పులు, వాటి ఉద్దేశాలపై చర్చించినా కోర్టు ధిక్కరణ కిందికి రాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నామని చెప్పినా, ఏ మాత్రం పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఇవ్వడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. భారీ నష్టం కలిగించేలా తీర్పులున్నాయని, వాటిపై చర్చించకపోతే మరింత నష్టపోవాల్సి వుంటుందని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
“రాష్ట్ర రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదు. రాజధాని నగరాన్ని మార్చే, లేదా విభజించే, లేదా మూడు రాజధానులుగా ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదు. ఒకవేళ రాష్ట్రం రాజధానిని మార్చాలనుకుంటే కేంద్రానికి లేదా పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేసి, ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ కోరవచ్చు” అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ ఇప్పటికే సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ అధికారాలపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారన్నారు. దీనిపై బీఏసీలో స్పీకర్ అనుమతితో చర్చించాలని కోరతామన్నారు. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్లు చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించడం వెనుక ఉద్దేశం… హైకోర్టు తీర్పులపై రాష్ట్ర అత్యున్నత చట్టసభల వేదికగా చర్చించడమే అని చెబుతున్నారు.
ఇప్పటికే అసెంబ్లీ బయట వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని గమనించొచ్చు. ఏపీ హైకోర్టు తనకు కావాల్సిన కేసులను మాత్రమే విచారిస్తోందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. అలాగే కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మరింత డోస్ పెంచారు.
న్యాయ వ్యవస్థ తీరు చాలా అభ్యంతరకరమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు చట్టాలు చేసే హక్కు ఉందన్నారు. అలాంటి హక్కు లేదనుకుంటే న్యాయవ్యవస్థలే ఎన్నికల్లో పోటీ చేసి పాలన సాగించాలని వ్యంగ్యంగా అనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తీర్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ, శాసన మండలి వేదికలుగా తమదైన రీతిలో ఎదురు దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.