అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ఎల్లో బ్యాచ్ సంబరాలు చేసుకుంది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ ప్రాధాన్యం అంటూ మంత్రులు, అధికార పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో హైకోర్టు తీర్పు వారికి తాత్కాలిక ఆనందమే అని అర్థమైంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధానిపై ప్రభుత్వ విధానాన్ని తేల్చి చెప్పారు.
మూడు రాజధానుల ఏర్పాటుపై తగ్గేదే లేదు అన్నట్టుంది ఆయన వైఖరి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. వికేంద్రీకరణ కోసం ఏం చేయాలో అది చేస్తామని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. దీంతో అమరావతి రాజధాని రైతులు, టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రాజధాని మార్పుపై రాష్ట్ర శాసనసభకు హక్కే లేదని అంటున్న తరుణంలో, ప్రభుత్వ పెద్దల మనసులో ఏముందనే చర్చ జరుగుతోంది. వికేంద్రకరణ కోసం ఏం చేయాలో అది చేస్తామని మంత్రి మాటల వెనుక మర్మమేంటనే ప్రశ్నలు ఉదయిస్తు న్నాయి. ఒకవైపు అమరావతి రాజధానికి అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, మంత్రి బొత్స మాత్రం మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ప్రకటించడం గమనార్హం.
రాష్ట్రంలో 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమని మంత్రి అన్నారు. శివరామకృష్ణన్ కమిషన్ కూడా వికేంద్రీకరణనే సూచించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసులో స్థిరమైన, బలమైన ఆలోచన ఏదో ఉండడం వల్లే మంత్రి బొత్సతో పాటు ఇతర మంత్రులు కూడా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని గట్టిగా చెబుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు కాదంటున్నా, ప్రభుత్వం మూడు రాజధానుల వైపే అడుగులు వేయాలని అనుకోవడం పలు అనుమానాలు కలిగిస్తోంది.