విఖ్యాత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ప్రస్తుత టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు జడేజా.
ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ అంత మెరుగ్గా రాణించకపోయినా పంత్ ఆడిన చక్కటి ఇన్నింగ్స్ కు తోడు, జడేజా భారీ ఇన్నింగ్స్ తో టీమిండియా స్కోర్ బోర్డుపై మెరుగైన నంబర్ ను నమోదు చేసింది.
574/8 తో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను డిక్లేర్డ్ చేసింది టీమిండియా. 228 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు జడేజా. ఈ వ్యక్తిగత భారీ స్కోరుతో జడేజా కపిల్ రికార్డును సవరించాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇప్పుడు జడేజా పేరిట నమోదైంది.
గతంలో కపిల్ దేవ్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 163 పరుగులు సాధించాడు. ఆ రికార్డును జడేజా సవరించాడు. గత కొన్నేళ్ల ప్రదర్శనతో రవీంద్రజడేజా ఆల్ రౌండర్ అనే పదానికి సిసలైన నిర్వచనాన్ని ఇస్తూ వస్తున్నాడు. కెరీర్ లో యాభై ఎనిమిదో టెస్టుతో కపిల్ రికార్డును జడేజా సవరించడం గమనార్హం.