ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ తదితర నినాదాలతో జనంలోకి తమ పార్టీ నేతలు వెళ్లేలా జగన్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడు అరెస్ట్, టీడీపీకి నాయకత్వ కొరత, పవన్‌కల్యాణ్ నిలకడలేని పంథాతో ఏపీలో ప్రతిపక్షాలపై ప్రజల్లో చెప్పుకో తగిన సానుకూలత లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షాలు సొమ్ము చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని, గతంలో వచ్చినన్ని సీట్లు రావనేది మెజార్టీ ప్రజాభిప్రాయం. ఇదే సందర్భంలో సీఎం జగన్‌పై సానుకూల, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులపై ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే భయం సీఎం జగన్‌ను సైతం వెంటాడుతోంది.
ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకుందాం. ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. కానీ నగరి నియోజకవర్గంలో రోజాపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుగా ఎగురవేశారు. రోజాను వ్యతిరేకిస్తున్న నాయకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి కావాల్సిన పనులను మరో పెద్దాయన కల్పించారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంతిమంగా పార్టీకి నష్టం కలిగిస్తోంది.
అలాగే సీఎం సొంత జిల్లా కడపకు వెళ్దాం. బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల్నే తీవ్రంగా అణచివేస్తున్న దయనీయ స్థితి. బద్వేలు నియోజకవర్గ వైసీపీ బాధ్యతల్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూస్తున్నారు. సొంత తమ్ముడిని, అలాగే తమ్ముడి బామ్మర్ది విశ్వనాథరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నాయకులిద్దరూ ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ప్రొద్దుటూరులో ఇక చెప్పాల్సిన పనే లేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రమేశ్ యాదవ్ అనే కౌన్సిలర్‌కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
తద్వారా యాదవులతో పాటు బీసీలను వైసీపీ వైపు తిప్పుకోవచ్చనేది జగన్ భావన. కానీ రమేశ్ యాదవ్‌ను ఎమ్మెల్యే వేధిస్తున్నారనే ప్రచారం బీసీల్లో వైసీపీపై వ్యతిరేకతకు కారణమైంది. దీంతో సీఎం వైఎస్ జగన్ ఆశయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేను తూట్లు పొడిచినట్టైంది. ప్రొద్దుటూరులో ఇంకా అనేక మంది సొంత పార్టీ నాయకులపై వేధింపులు కొనసాగు తున్నాయి. వీళ్లందరికీ జగన్‌పై అభిమానం ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి గెలుపొందారు. అయితే సొంత పార్టీ నేతలకు ఏమీ చేయకపోగా, ప్రజాదరణ కలిగిన స్థానిక నాయకులను విస్మరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కమలాపురం మున్సిపాలిటీలో బలమైన ముస్లిం నాయకులు వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీ కండువా కప్పుకున్నారు.
కడప విషయానికి వస్తే… డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబ సభ్యులు భూదందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణ వుంది. అలాగే ఒక మతానికి మాత్రమే డిప్యూటీ సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపం మిగిలిన మతాలు, సామాజిక వర్గాల్లో అసంతృప్తి వుంది. దీంతో జగన్‌పై అభిమానం వున్నా… స్థానిక లీడర్ వ్యవహార శైలితో వైసీపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి గూడు కట్టుకుంది.
కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ఒకరికి టికెట్ ఇస్తే, మరొకరు మద్దతు ఇవ్వని పరిస్థితి. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇరువర్గాలు పరస్పరం కొట్టుకుని, విభేదాలు రచ్చకెక్కాయి. అయినా ఇంత వరకూ చక్కదిద్దలేదు.
మంత్రి జయరాం, ఆయన కుటుంబ సభ్యులపై ఓ రేంజ్‌లో ఆరోపణలున్నాయి. కోడిపందేలు, ఇతరత్రా మట్కా, జూదం , భూదందా ఇలా అనేక ఆరోపణలు మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఉన్నాయి. ఈ ధోరణి ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీసింది. అనంతపురం జిల్లాకు వెళితే… రచ్చ మామూలుగా లేదు. హిందూపురం వైసీపీలో నెలకున్న విభేదాలను పరిష్కరించడం ఎవరి వల్లా కావడం లేదు. చివరికి హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త హత్య చౌళూరు రామకృష్ణారెడ్డిని సొంత పార్టీ నేతలే హత్య చేశారు.
హిందూపురంలో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను నియమించినప్పటికీ ప్రయోజనం లేకపోగా, పార్టీని మరింత భ్రష్టు పట్టించారు. హిందూపురం వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ తనకు టికెట్ ఇవ్వకపోతే, పార్టీ కోసం పని చేసే ప్రశ్నే లేదని ఆయన చాలా కాలంగా భీష్మించి కూచున్నారు. ప్రస్తుతం అక్కడ మహిళా నాయకురాలు దీపికను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈమె కూడా ఇతరుల్ని కలుపుకుని పోలేదనే విమర్శలున్నాయి.
ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఇంటిపోరు తప్పడం లేదు. సొంత తమ్ముడైన మధుసూదన్‌రెడ్డికి అన్నకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే కారణంతో ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విశ్వేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా సొంతపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుటుంబ సభ్యులు పని చేస్తున్నా…అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలే పార్టీ బలహీనంగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు మరింత నష్టం తీసుకురానున్నాయి.
కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అభ్యర్థిని మారిస్తే తప్ప వైసీపీకి మునుపటి రోజులు రావని చెబుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆర్డీవో కిరణ్ వర్సెస్ వైసీపీ అనే రేంజ్‌లో వ్యవహారం సాగుతోంది. గూడూరు ఆర్డీవో వైసీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో తానే ఎమ్మెల్యే అయినట్టు, పార్టీ నేతలపై పెత్తనం చేస్తున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్, వైసీపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో దాదాపు 50 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. ఇలాంటి చోట వైసీపీ నేతల మధ్య విభేదాలు పార్టీని బలహీనపరిచాయి. గూడూరు ఆర్డీవోకు టికెట్ ఇస్తే, ఓడిస్తామని వైసీపీ నేతలే బహిరంగంగా హెచ్చరించడం గమనార్హం.
ఇదే రీతిలో సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల తిరుపతిలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా, ఆయన ఎదుటే ఎమ్మెల్యేలపై నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వర్గాలుగా వైసీపీ విడిపోయింది. ఇద్దరూ బావాబామ్మర్దులు కావడం గమనార్హం. పైగా సీఎం వైఎస్ జగన్‌కు సమీప బంధువులు కూడా. తనపై జగన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని ఆ మధ్య మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నదమ్ముల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. బహిరంగంగానే కరణం వెంకటేశ్ తీవ్రస్థాయిలో ఆమంచి బ్రదర్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
మంత్రి వేణుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వనని, పార్టీ కంటే కేడర్‌ను కాపాడుకోవడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి సుభాష్‌చంద్రబోస్ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ఆయన ప్రస్తుతానికి మౌనం పాటించారు. టీడీపీ, జనసేన కలయికతో తూర్పు, పశ్చమగోదావరి జిల్లాల్లో వైసీపీ ఎదురీదుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పార్టీలో విభేదాలు వైసీపీకి మరింత నష్టం కలిగిస్తాయనే ఆందోళన శ్రేణుల్లో వుంది.
ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతోనే వైసీపీకి నష్టం కలిగిస్తుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. సీఎం జగన్ అంటే తమకు అభిమానమే అని, కానీ తమ ఎమ్మెల్యేలతోనే సమస్య అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగా వుంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అతిపెద్ద సవాల్. పార్టీలోని విభేదాలను సర్ది చెప్పి, అందరూ గెలుపు కోసం పని చేసేలా చేయించడంలోనే సక్సెస్ వుంటుంది. ఇదే జగన్‌కు అతిపెద్ద సవాల్.
సీఎం జగన్ నిర్మొహమాటి. పార్టీకి నష్టం కలిగిస్తారని ఆయన భావిస్తే ఎవరినైనా పక్కన పెట్టడానికి వెనుకాడరు. అలాగే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి ఆయన అంగీకరించరు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. బాబు జైలు నుంచి ఎప్పుడొస్తారో తెలియని అయోమయం ఆ పార్టీలో నెలకుంది. ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలచుకోవాలంటే వైసీపీలో విభేదాలను అంతా పక్కన పెట్టాల్సి వుంది.
గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ ప్రజాప్రతినిధులపై భూఆక్రమణలు, రకరకాల వసూళ్ల ఆరోపణలున్నాయి. వీటిని అధిగమించి పార్టీ అధికారంలోకి రావాలంటే, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడం, మంచి వ్యక్తులను తెరపైకి తేవడం ఒక్కటే మార్గం. ఆ పని జగన్ చేసేదాన్ని బట్టి మరోసారి అధికారం ఆధారపడి వుంటుంది.