పెదకాపు అనే సినిమా వచ్చింది. టీజర్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ట్రయిలర్ కూడా బాగానే వుందనిపించుకుంది. కానీ ఓపెనింగ్ కు టికెట్ తెగలేదు. విడుదలయిన తరువాత సంగతి.. బాగుందా. .బాగాలేదా అన్న పాయింట్.
ముందుగా అసలు ఆ టీజర్ కు, ఆ ట్రయిలర్ కు, బ్యానర్, డైరక్టర్ పేర్లు ఏవీ ప్లస్ కాలేదా? ఇదే ఇప్పుడు సినిమా నిర్మాత పోస్ట్ మార్టమ్ చేసుకుంటున్నారు. దానికి ఎక్కువ ఫీడ్ బ్యాక్ పాయింట్ ఒక్కటేనంట.
పెదకాపు అనే టైటిల్ సినిమాకు భయంకరంగా మైనస్ అయింది అన్నదే. పెదకాపు అంటే కాపు సామాజిక వర్గ సినిమా కాదు, ప్రతి కులంలోనూ పెదకాపు ఒకరు వుంటారనే డైరక్టర్ భావన జనాల్లోకి వెళ్లలేదు. శ్రీకాంత్ అడ్డాల ను, టైటిల్ ను కలిపి చూసారు. ఇదేదో కాపు సామాజిక వర్గ నేపథ్య సినిమా అనుకున్నారు. అందుకే ఓపెనింగ్ తెగలేదు. తరువాత ఎలాగూ సినిమా బాగా లేదనే టాక్ వెళ్లిపోయింది. దాంతో జనం సినిమాకు దూరంగా జరిగిపోయారు అన్నది పోస్ట్ మార్టంలో తేలిన విషయం తెలుస్తోంది.
నిజానికి జస్టిస్ చౌదరి, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి టైటిళ్లతో సినిమాలు వచ్చినా జనం ఆదరించారు. కానీ కాపు అనే పేరుతో వస్తే మాత్రం జనం పక్కన పెట్టారు ఓపెనింగ్ ఇవ్వకుండా. అంటే ఇది రాజకీయంగా కాపుల విషయంలో వున్న సమస్యగా చూడాలా? లేక మరే విధంగా చూడాల్సి వుంటుంది అన్నది పాయింట్. ఏమైతేనేం పాపం, నిర్మాత మాత్రం తీవ్రంగా నష్టపోయారు ఈ టైటిల్ కారణంగా.