ఢిల్లీలో అన్నాళ్లు కూర్చుంటే లోకేష్ కు అమిత్ షా ను కలవడం కుదరలేదు. అబ్బే.. లోకేష్ కు అలాంటి ఆలోచన లేదు. అస్సలు ప్రయత్నించలేదు అని మాత్రం అనొద్దు. అలాంటి ఆలోచన లేకుంటే ఇప్పుడు మాత్రం కలవరు కదా. పెద్దమ్మ పురందేశ్వరి సాయంతో అమిత్ షా అపాయింట్ మెంట్ సంపాదించింది కలవడం కోసమే కదా. అంటే అన్నాళ్లు ఢిల్లీలో వున్న కలవని అమిత్ షా, ఇప్పుడు అర్జెంట్ గా ఎందుకు కలిసారు.
ఇదంతా పెద్దమ్మ ప్రయత్న ఫలితమా? లేక లోకేష్ మీద అభిమానమా? అర్జంట్ గా కలిసారు అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే… రెండో రోజు విచారణకు హాజరయిన తరువాత హుటాహుటిన ఎవ్వరికీ తెలియకుండా ఢిల్లీ వెళ్లారు లోకేష్. అది ముందుగా అనుకున్న కార్యక్రమం అయి వుంటే అందరికీ తెలిసేది. అమిత్ షా ను కలవబోతున్నారన్న సంగతి అస్సలు బయటకు పొక్కలేదు. ఫొటో బయటకు వచ్చాక కూడా జనం అంత త్వరగా నమ్మలేదు.
సరే, ఇంతకీ అమిత్ షా ఇప్పుడు ఎందుకు కలిసారు. తెలుగుదేశం అను’కుల’పత్రికల్లో, డిజిటల్ మీడియాలో అయితే చాలా మ్యాటర్ వుంది.అమిత్ షా అన్నీ అడిగి తెలుసుకున్నారని, లోకేష్ అన్నీ వివరించారని, ఇలా చాలా అంటే చాలా. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏమిటంటే, చంద్రబాబును జైలులో పెట్టి ముఫై రోజుల దాటేసింది.
అమిత్ షా కేంద్ర హోమ్ మంత్రి. ఓ మాజీ సిఎమ్ ను, దేశంలోని కీలక రాజకీయనేతల్లో ఒకరి జైలులో పెట్టారు అంటే దాని పూర్వాపరాలు అన్నీ బ్రీఫింగ్ నోట్ కింద కేంద్ర హోమ్ మంత్రి టేబుల్ మీదకు వెళ్లకుండా వుండవు. ఆంధ్ర రాజకీయాలు అమిత్ షాకు తెలియనివి కావు. ఎన్టీఆర్ ను కలిసారు. రామోజీని కలిసారు. అమిత్ షా ప్లాన్ లు ఆయనకు వున్నాయి.
అందువల్ల కొత్తగా లోకేష్ బ్రీఫ్ చేసారు, అమిత్ షా ఆసక్తి కనబర్చారు లాంటి వార్తలు కాదు కీలకం. తెలంగాణ ఎన్నికలు కీలకం. ఆ ఎన్నికల్లో కీలకంగా వున్న సెటిలర్స్ ఓట్లు కీలకం. కేంద్రం జగన్ కు వెన్ను దన్నుగా వుందన్న వార్తలు వున్నాయి. అందువల్ల సెటిలర్స్ లో ప్రో వైకాపా ఓట్లు ఎలాగూ భాజపాకు రావడానికి కొంత అవకాశం వుంది. లేదూ అంటే వివిధ కులాల వారీగా చీలిపోయే అవకాశం వుంది.
కానీ తెలుగుదేశం ఓట్లు అలా కాదు. అవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనుక, కాంగ్రెస్ వెనుక వెళ్తున్నాయనే విశ్లేషణలు వున్నాయి. దాని వల్ల భాజపాకు, భారాసకు కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని నివారించాలి అంటే తెలుగుదేశాన్ని బుజ్జగించాలి. తెలుగుదేశం అను కుల సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ వైపు నుంచి భాజపా వైపు మళ్లాలి అంటే ఏదో చేయాలి. అదే లోకేష్ ను కబురుపెట్టి మరీ కలవడం అని అనుకోవచ్చు.
అంతే కాదు దీని వల్ల భాజపాకు రెండు లాభాలు. ఒకటి వైకాపా వెనుక భాజపా వుంది అనే అపప్రధ నుంచి తప్పించుకోవడం. రెండు భాజపా-తేదేపా దగ్గరవుతున్నాయనే ఫీల్ కలిగించడం. తత్ ఫలితంగా తెలంగాణలో ఎన్నో కొన్ని ఓట్లు అదనంగా సాధించగలగడం.
అమిత్ షాకు ఇదే కావాలి. ఏదో విధంగా కలవడం లోకేష్ కు కావాలి. అదే జరిగింది ఇప్పుడు. కానీ తెలుగుదేశం జనాలు కూడా తక్కువేమీ కాదు. భాజపా రాజకీయాలు చూస్తూనే వున్నారు. అందువల్ల అంత సులువుగా తెలంగాణలో భాజపా బుట్టలో పడతారా? అన్నది అనుమానమే.
అవును … ఇంతకీ.. ఆయన ఎక్కడున్నారు? అదే… తెలంగాణలో పోటీ చేసే స్థానాలు కూడా ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఎన్నికల నగారా మోగింది. మరి వారాహి బండిని బయటకు తీయాలి కదా. భాజపాతో కలిసో, కలవకుండానో, కొత్త మిత్రుడు తేదేపా అండతోనో బరిలోకి దిగాలి కదా.. ఏమైనట్లు? ఎక్కడున్నట్లు? ఇంత రంజైన రాజకీయం నడుస్తుంటే మౌనంగా, అజ్ఙాతంలో వుంటే ఎలా పవన్ కళ్యాణ్?