మోదీ-జగన్ ల బంధం: గతం, వర్తమానం, భవిష్యత్తు

నరేంద్ర మోదీ కి చంద్రబాబంటే పడదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యాన్ని తెదేపా మీడియా తన నోటితో చెప్పే ధైర్యం లేక, మనసు రాక ఎప్పటికప్పుడు భాజపా పెద్దలు తమ వెంటే ఉన్నారన్న,…

నరేంద్ర మోదీ కి చంద్రబాబంటే పడదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యాన్ని తెదేపా మీడియా తన నోటితో చెప్పే ధైర్యం లేక, మనసు రాక ఎప్పటికప్పుడు భాజపా పెద్దలు తమ వెంటే ఉన్నారన్న, ఉంటారన్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. 

కేంద్ర భాజపా ఆలోచన ఆంధ్రప్రదేశ్ లో తెదేపాని సమూలంగా అంతం చెయ్యాలనే అని రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్న అంశం.

ఎందుకంత కోపం?.. ఒక రాష్ట్రానికి చెందిన పార్టీపై కేంద్ర భాజపా అధినేతకి ఎందుకుంటుంది అంత వైరం? 

చాలామంది చెప్పే విషయం 2019 ఎన్నికలకి ఆర్నెల్ల ముందు చంద్రబాబు భాజపాతో తెగతెంపులు చేసుకుని బయటకు వెళ్లడం మోదీని బాధించింది అంటారు.

నిజానికి ఆ చర్య మోదీని పెద్దగా బాధించలేదు. పొత్తులకి, విడిపోవడాలకి అంతలా చలించిపోయే గుండె కాదు మోదీది.

మరేం జరిగింది? అలా బయటికొచ్చిన తర్వాత చంద్రబాబు మాటలు, చేతలు మోదీని పర్సనల్ గా హర్ట్ చేశాయి. 

నరేంద్రమోదీ ప్రధానంగా విలువనిచ్చే సున్నితమైన అంశాలు రెండు- ఒకటి తన నిజాయితీ, రెండు తన కుటుంబం.

మోదీ వ్యక్తిగతంగా లంచగొండి కాదు.

దేశ ఆర్ధికోన్నతికి కావాల్సిన పన్నులు గట్రా జనం మీద వేసినా అదంతా ఆయన స్వార్థానికి చేస్తున్నాడని మాత్రం ఇంతవరకు దేశంలో ఎవ్వరూ అనలేదు. అనడానికి ఆధారాలు కూడా కనపడవు.

ఎందుకంటే అసలాయనకు సంతానం లేదు. కనుక లక్షల కోట్లు కూడబెడుతున్నాడు అనుకోవడంలో అర్ధం లేదు.

పైగా ఆయన కుటుంబంలోని సోదరులంతా అత్యంత సాదాసీదాజీవితాలు గడుపుతున్నట్టుగానే కనిపిస్తారు. కనుక మోదీ నిజాయితీ పరుడని నూటికి 99% మంది నమ్ముతారు. 

అలాంటి నరేంద్ర మోదీ మీద రాఫెల్ కుంభకోణాన్ని అంటగట్టే ప్రయత్నం చేసాడు చంద్రబాబు. జాతీయ మీడియాలో మైక్ పట్టుకుని మోదీపై లంచగొండి బురద జల్లే ప్రయత్నం చేసాడు. అయితే మోదీ ఉన్న ఎత్తుకి చంద్రబాబు విసిరిన బురద చేరలేదు. కానీ అప్పటివరకు తనతో నవ్వుతూ, స్నేహం నటిస్తూ ఉన్న ఒక మర్యాదస్తుడనుకున్న సీనియర్ నాయకుడు ఇలాంటి చర్యకి పాల్పడతాడనుకోలేదు. 

ఆ చికాకులో ఉండగానే చంద్రబాబు మరొక ఒళ్లుమండే పని చెయ్యబోయాడు.

అదేంటంటే ఎక్కడో మీడియాకి కనిపించకుండా జీవిస్తున్న మోదీ భార్యగారి ఇంటర్వ్యూ సంపాదించే ప్రయత్నం చేసాడు. మోదీ వ్యక్తిగత జీవితం, విడాకులెందుకయ్యాయి అనే అంశం మీద ఆమె చేత మాట్లాడించి మోదీని జాతీయ స్థాయిలో బద్నాం చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ పనిని చేయడానికి వర్ల రామయ్యని నియమించాడు. మొత్తానికి నేషనల్ సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయత్నాన్ని ఆపి విషయాన్ని మోదీకి చేరవేసారు. 

విడాకులిచ్చేసిన మాజీ భార్యే కదా, తేలిగ్గానే ఆమెను రీచ్ అవొచ్చు అనుకున్నాడు చంద్రబాబు. కానీ, యావత్ మొదీ పరివారంపైన ఎన్.ఎస్.జి వాళ్ల రక్షణ కవచం వాళ్లకి తెలియకుండానే ఉండడం వల్ల కావాలనుకున్న ఇంటర్వ్యూని పొందలేకపోయాడు చంద్రబాబు.

ఈ అంశం మోదీకి చాలా గట్టిగా తగిలింది. 

1996లో బాబు పొడిచిన వెన్నుపోటుకి ఎన్.టి.ఆర్ ఎంత ఖంగు తిన్నాడో గానీ, అంత కంటే ఎక్కువగానే బాబు నక్క జిత్తుల తనాన్ని ప్రత్యక్షంగా చూసి నెవ్వెరబోయాడు మోదీ.

నిజానికి 2019 ఎన్నికలకి ఆర్నెల్ల ముందు చంద్రబాబు భాజపా నుంచి బయటకు రావడానికి కారణం ఏ ప్రత్యేకహోదానో, స్పెషల్ ప్యాకేజీనో అని బయటికి చెప్పుకున్నారు కానీ, అసలు విషయం అది కాదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా ఉన్నందున ఆ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా ఓడిపోతుందని చంద్రబాబుకి ఆంతరంగిక విశ్లేషకులు చెప్పి ఊదరగొట్టారట. అది నమ్మి భాజపా కాకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది కనుక ఆ పార్టీతో చెట్టాపట్టాలేసాడు. 

ఇంతకీ 2019 ఎన్నికల్లో భాజపా అదిరిపోయే మెజారిటీతో నెగ్గింది.

ఆంధ్ర ప్రదేశ్ లో గూబ పగిలే మెజారిటీతో వైకాపా నెగ్గింది.

అంతే చంద్రబాబుకి బ్యాడ్ టైం స్టార్టయ్యింది.

చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరిపి జగన్ని 16 నెలలు జైల్లో పెట్టించిన సంగతి, తన ఆర్ధిక మూలాలన్నీ దెబ్బగొట్టి రాజకీయంగా చంపేయాలని గతంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడలు..అన్నీ మోదీకి విపులంగా తెలిసాయి.

ముఖ్యమంత్రైన జగన్ మోహన్ రెడ్డి కేంద్ర భాజపాతో విధేయుడిగానే ఉన్నాడు. ఆ విధేయతకి కారణం కేసుల భయమని తెదేపా మీడియా రాసుకుంటుంది కానీ, ఆ భయమే ఉన్నవాడైతే అసలు అప్పట్లో సోనియాగాంధీతో యుద్ధానికే దిగేవాడు కాదు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతుంది.

అదలా ఉంచితే, జగన్ కి మోదీ పట్ల గౌరవం దేనికంటే ఏ పొత్తులు, పులిహార్లు లేకుండా తనలాగానే పోరాడి నిలబడ్డ వ్యక్తి కనుక.

ఎప్పుడడిగినా అపాయింట్మెంట్ ఇస్తూ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇస్తున్నాడు కనుక.

అలాగే మోదీకి జగన్ పట్ల అభిమానం దేనికంటే జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టడు కనుక.

తన శత్రువు చంద్రబాబు జగన్ కి కూడా శత్రువే అన్న నిజం తెలుసు కనుక.

ఇప్పటి వరకు గతం, వర్తమానం చెప్పుకున్నాం.

ఇప్పుడు భవిష్యత్తుని విశ్లేషించుకుందాం.

ఆంధ్రలో తేదేపాని నామరూపాలు లేకుండా చేయడానికి మోదీకి, జగన్ కి కారణాలున్నాయి. కానీ అలా చేసి భాజపా రాజకీయంగా ఏం సాధిద్దామనుకుంటోంది? 

ఏ ఎండకాగొడుగు పట్టడమే కాకుండా, నమ్మించి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుని, అతని పార్టీని నమ్మడం అనవసరమని తేలిపోయింది భాజపాకి.

పైగా చంద్రబాబుకి జాతీయ రాజకీయలపై ఆశ ఉంది. అలాంటి వాడిని సమూలంగా రాజకీయ పతనం చేసెయ్యాలి తప్ప కొన ఊపిరి కూడా మిగల్చకూడదన్నది భాజపా ఆలోచన.

మరి తేదేపాని చంపేస్తే ఏమౌతుంది?

సింపుల్. తెదేపాలో ఉన్న నాయకులంతా భాజపాలోకే వస్తారు. ఎందుకంటే వాళ్లల్లో ఎక్కువమందికి వైకాపాలో చేరే మనసు రాదు.

అలా భాజపా రాష్ట్రంలో పాత నాయకులతో కొత్త ఊపిరి పోసుకుంటుంది. వాళ్లల్లో కూడా ఉంచాల్సిన వాళ్లని ఉంచడం, స్క్రాపుని లేపేయడం తర్వాత విషయం.

ఇలా నిర్మితమైన పార్టీతో జగన్ ని ఢీకొని అతన్ని రాజకీయ సమాధి చేసేస్తుంది భాజపా అని అనుకుంటున్నారు చాలామంది.

అది కాదు జరగబోయేది.

అదే జరిగితే బాబుకి, మోదీకి తేడా ఏముంటుంది?

అదే నిజమనుకుంటే మోదీ-జగన్ల బంధం ఎందుకు కొనసాగుతుంది?

ఇక్కడే మనం ఒక్కసారి ఒరిస్సా వైపు చూడాలి. అక్కడ సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రి సీటులో ఉన్న నవీన్ పట్నాయక్ ఉన్నాడు.

ఆయనది సొంత పార్టీ- బీజూ జనతా దళ్.

నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టడు- జగన్ మోహన్ రెడ్డిలాగానే.

ఎప్పటికీ ప్రజాసంక్షేమం పైనే దృష్టి- జగన్ మోహన్ రెడ్డిలాగానే.

మోదీతో స్నేహం- జగన్ మోహన్ రెడ్డిలాగానే. 

గత 23 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రస్తుత కేంద్ర భాజపాకి విధేయుడు. ఆయన వయసు ఇప్పుడు 77. ఆరోగ్యం పర్వాలేదు కానీ వృద్ధాప్య సమస్యలున్నాయి. ఆయన తర్వాత తన పార్టీ సారధులెవరో తెలియదు. అలాంటి సమయంలో ఒరిస్సా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా భాజపానే ఉంది. 

ఇంచుమించు అలాంటి బంధమే భాజపాకి, వైకాపాకి ఉండబోతోంది. 

మనిషికి చావు తప్పదన్నట్టు ఎంతటి పార్టీకైనా ప్రభుత్వవ్యతిరేకత తప్పదు. అది ఐదేళ్ళకా, పదేళ్లగా, పదిహేనేళ్లకా అన్నది వేరే విషయం. అలాంటి వ్యతిరేకత వచ్చి ప్రభుత్వం మారాల్సొచ్చినప్పుడు, అయితే నీ పార్టీ..లేకపోతే నా పార్టీ! అంతే తప్ప మూడో వాడు వద్దు, అనేది భాజపా ఆలోచన. ఆ ధోరణిలో ముందుకు సాగే ప్రణాళికలు వేసుకుంది భాజపా. 

ప్రజాస్వామ్యంలో ఓటర్లు నిర్ణయాన్ని ముందుగా ఎవ్వరూ ఊహించలేరు. ఏ ఎన్నికల్లో ఎవర్ని నిలబెడతారో ఎవర్ని పడగొడతారో తెలీదు. అయినప్పటికీ ఎవరి ప్రయత్నం వారిది. ఈ ప్రయత్నం భాజపాది. 

– శ్రీనివాసమూర్తి