మంగళగిరికి నారా లోకేశ్ గుడ్ బై చెప్పనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలే మంగళగిరి మొదటి నుంచి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం కాదు. అలాంటి చోట 2019లో లోకేశ్ ప్రయోగాత్మకంగా పోటీ చేశారు. ఓటమిని మూట కట్టుకున్నారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే తలంపుతో మళ్లీ అక్కడి నుంచే 2024లో పోటీ చేయాలనే పట్టుదల కనబరిచారు. మంగళగిరిలో నిలిచి గెలిచి టీడీపీకి గిఫ్ట్‌గా ఇస్తానని లోకేశ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఏకంగా 51 వేలకు పైగా పేద కుటుంబాలకు అక్కడ నివాస స్థలాలను జగన్ ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేసింది. దీంతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి పూర్తి సానుకూల వైఖరి ఏర్పడింది. ఇంత కాలం అమరావతి నుంచి రాజధాని తీసుకెళ్లిన వైసీపీపై వ్యతిరేకత బలంగా వుందని, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సునాయాసం అని అంచనా వేసిన వారి లెక్కల్ని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు.
దీంతో మంగళగిరిలో పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని, పంతాలు, పట్టింపులకు పోయి శాశ్వితంగా రాజకీయ సమాధి కట్టుకోలేనని లోకేశ్ అంటున్నట్టు సమాచారం. చంద్రబాబు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లోకేశ్‌ను మంగళగిరిలో నిలిపేందుకు ఇష్టపడడం లేదని విశ్వసనీయ సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకుంటున్నారు.
ఈ పరంపరలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడన లేదా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజక వర్గాల్లో నిలిస్తే ఎలా వుంటుందని తర్జనభర్జన పడుతున్నారని తెలిసింది. ఆ రెండు చోట్ల ప్రస్తుతం వైసీపీ నేతలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పెడన నుంచి గెలుపొందిన జోగి రమేశ్ ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రి కూడా. పెదకూరపాడు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నంబూరి శంకర్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన ఆర్థికంగా కూడా బలవంతుడు.
పెదకూరపాడు నుంచి 2009, 2014లో టీడీపీ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ గెలుపొందారు. 2019లో ఓటమి రుచి చూశారు. ప్రస్తుతం అక్కడి టికెట్‌కు డిమాండ్ బాగుంది. శ్రీధర్‌తో పాటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, అలాగే కొత్తగా పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ కూడా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలుగా ఈ రెండింటిని చంద్రబాబు తన కుమారుడి కోసం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదే సందర్భంలో లోకేశ్ రెండోసారి ఓడిపోవాలని సొంత పార్టీలోని సీనియర్ నాయకులు కూడా కోరుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెడుతున్నారనే ఆగ్రహం వారిలో వుంది. లోకేశ్ మంగళగిరికి మాత్రం మంగళం పలకనున్నారనేది వాస్తవం. ఇక ఎక్కడ పోటీ చేస్తారనేది తర్వాత అంశం. ప్రస్తుతానికైతే పెడన, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సర్వే జరుగుతోంది.