రాజధానిలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయంగా అక్కడ శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుత స్కెచ్ వేశారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 51,392 నిరుపేద కుటుంబాలకు శుక్రవారం సీఎం జగన్ నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీకి రావాలని లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించడం విశేషం. అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే కలను సాకారమవుతున్న వేళ ఎప్పుడెప్పుడు వస్తుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఒక్కో కుటుంబంలో కనీసం మూడు ఓట్ల చొప్పున లెక్క కట్టినా 1.50 లక్షల ఓట్లు వైసీపీకి దక్కుతాయి. ఇది టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు వేస్తున్న లెక్క.
టీడీపీ హయాంలో రాజధాని అమరావతి అంటే సంపన్నులకు సంబంధించిన వ్యవహారంగా వుండేది. కానీ వైఎస్ జగన్ హయాంలో అది పేదల నివాసయోగ్యంగా తయారు చేయడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు నివాస స్థలాలు ఇవ్వకూడదని, ప్రభుత్వ దూకుడును అడ్డుకునేందుకు అనేక శక్తులు సుప్రీంకోర్టు వరకూ పోరాటం చేశాయి. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి పేదల ఆకాంక్షే గెలిచింది. కల సాకారం కావడానికి మరో 24 గంటల సమయం మాత్రమే వుంది.
పేదలంతా అక్కడ చేరితే ఇక టీడీపీ రాజధాని ప్రాంతంలో గెలుపును మరిచిపోవాల్సిందే. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీపై భారీ ఎఫెక్ట్ పడనుంది. తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ నివాస స్థలాలు దక్కకూడదనే ప్రతిపక్షాల ప్రయత్నాల్ని పేదలు ఎప్పటికీ మరిచిపోరు, క్షమించరు. ఇదే టీడీపీని భయపెడుతోంది. కనీస సౌకర్యమైన గూడు కల్పించేందుకు దుష్టశక్తులపై జగన్ పోరాటాన్ని పేదలు శాశ్వతంగా గుర్తించుకుంటారు. ఇది వైసీపీకి రాజకీయంగా చాలా ఉపయోగపడుతుంది.
రాజధానిలో పేదలతో పాటు రాజకీయంగా వైసీపీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.