భారత ప్రభుత్వం భారీ మొత్తం వెచ్చించి నూతనంగా నిర్మించిన పార్లమెంటరీ భవన ప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్ వారి నిర్ణయంపై తప్పుపట్టారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
'పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం లాంటిదని.. అది దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుందని.. అది దేశ ప్రజలకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు చెందనది అని ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజస్వామ్య స్పూర్తి కాదని.. అన్ని రాజకీయ పార్టీలు విభేదాలన్నింటినీ పక్కన పెట్టి.. పార్లమెంటరీ భవన ప్రవేశ కార్యక్రమాన్నికి రావాలని కోరారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని' సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కాగా కొత్త పార్లమెంట్ భవన ప్రవేశ కార్యక్రమంలో రిబ్బన్ కటింగ్ కూడా మోడీనే చేస్తూ ఉండటం. రాష్ట్రపతి ముర్ముకు ఈ అవకాశం ఇవ్వకుండా.. రిబ్బన్ కటింగ్ కూడా తనే చేయాలని మోడీ అనుకోవడం ప్రజాస్వామ్య పద్ధతికే అవమానం అని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రపతిని కూడా కాదని మోడీ అంతా తాను అయ్యే ప్రయత్నం చేస్తున్న ఈ ఈవెంట్ ను తాము బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీలు ప్రకటించాయి.
దేశంలో ఇతర పార్టీలు ఎలా ఉన్న బీజేపీ పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టిన, ఏ నిర్ణయం తీసుకున్న వారు అడిగిన, అడగకపోయిన వైసీపీ, టీడీపీలు పోటీపడి మరి వారికి మద్దతు ప్రకటిస్తుండటం అందరికి తెలిసిందే. అలాంటిది పార్లమెంట్ ఈవెంట్ కు ఇరు పార్టీలు హాజరు అవ్వడం పెద్ద విషయం కాదు. కాకపోతే పక్క పార్టీలకు సలహాలు ఇవ్వడమే విచిత్రంగా ఉంది.