హైదరాబాద్ లో ‘శ్రద్ధా వాకర్’ తరహా మర్డర్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆమెను హత్య చేసి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలు చేసి, వివిధ ప్రదేశాల్లో పడేసిన దారుణమైన ఘటన అది. ఆ…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆమెను హత్య చేసి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలు చేసి, వివిధ ప్రదేశాల్లో పడేసిన దారుణమైన ఘటన అది. ఆ తర్వాత ఆ తరహాలో దేశంలో మరిన్ని మర్డర్లు జరిగాయి. ఇప్పుడు ఇదే తరహా మర్డర్ హైదరాబాద్ లో కూడా జరిగింది.

6 రోజుల కిందట మలక్ పేట సమీపంలోని తీగలగూడలో ఓ మహిళ తల పోలీసులకు లభ్యమైంది. కవర్ లో చుట్టిన తల మాత్రమే దొరికింది. మొండం ఎక్కడుందనేది అంతుచిక్కలేదు. ఇప్పుడీ కేసును హైదరాబాద్ పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు. ఘటన జరిగిన తీరు చూసి పోలీసులే షాకయ్యారు.

ఇంతకీ ఆ తల ఎవరిది..?

ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేసే అనురాధది ఆ తల. ఆమె నర్సుగా పనిచేస్తున్నప్పటికీ, స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఆమె దగ్గర 18 లక్షలు అప్పు తీసుకున్నాడు చంద్రమౌళి. ఈ వ్యక్తి ఇంట్లోనే అనూరాధ అద్దెకు ఉంటోంది.

ఆన్ లైన్ ట్రేడింగ్ లో అప్పుల పాలయ్యాడు చంద్రమౌళి. దీంతో అనురాధ దగ్గర వడ్డీకి 18 లక్షలు తీసుకున్నారు. తన డబ్బు ఇవ్వమని అనురాధ ఎప్పటికప్పుడు చంద్రమౌళిపై ఒత్తిడి తీసుకొచ్చేది. ఈ క్రమంలో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

చైతన్యపురిలో ఉండే చంద్రమౌళి నివాసానికి అనూరాధ వచ్చింది. తన ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు చంద్రమౌళి. ఆ తర్వాత మటన్ కత్తితో ఆమె తలను వేరుచేశాడు. ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మూసీ నదిలో పడేశాడు. ఇతర శరీర భాగాల్ని 2 బకెట్లలో వేసి, తన ఇంట్లోనే ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.

ఎలా బయటపడింది..?

గుర్తుతెలియన మహిళ తల మాత్రమే లభ్యం అవ్వడంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడం కష్టంగా మారింది. అయితే మృతురాలి ముఖాన్ని ఆమె సోదరి, భర్త గుర్తించారు. వాళ్లు ఇచ్చిన సమాచారం పోలీసులకు బాగా పనికొచ్చింది. ఆ సమాచారంతోనే చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారు. అదే టైమ్ లో అతడి ఇంట్లో ఫ్రిడ్జ్ లో శరీర భాగాల్ని గుర్తించారు.

చంద్రమౌళితో సీన్ రీ-కనస్ట్రక్షన్ చేశారు పోలీసులు. అప్పుగా ఇచ్చిన డబ్బును ఎగ్గొట్టడం కోసమే, అనూరాధను హత్య చేశానని చంద్రమౌళి అంగీకరించాడు. నగరంలో ఈ ఘటన కలకలం రేపుతోంది.