మేనిఫెస్టో వంటకంలో ఏదైనా కలిపేద్దాం!

తెలంగాణ ఎన్నికలకు నగారా మోగింది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పటికే తమ మేనిఫెస్టో ప్రతిని సిద్ధం చేసుకుంది. ఈనెల 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభను భారాస నిర్వహించబోతోంది. ఇదే…

తెలంగాణ ఎన్నికలకు నగారా మోగింది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పటికే తమ మేనిఫెస్టో ప్రతిని సిద్ధం చేసుకుంది. ఈనెల 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభను భారాస నిర్వహించబోతోంది. ఇదే సభలో పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఇంకా అందులో పొందుపరచాల్సిన అంశాలను ఫైనలైజ్ చేసే దశలోనే ఉంది. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసుకు ఎవరు వచ్చి, ఏం అడిగినా సరే.. ఆ విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా ఉంది.

ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను అనుసరించి రాష్ట్రంలోని చేతి వృత్తిదారులకు ఉచిత కరెంటు, వక్క బోర్డు ఆస్తులను జ్యుడీషియల్ పరిధిలోకి తెచ్చే హామీలను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తుంది. ఎంఐఎం తో స్నేహబంధం ఉండడం కారణంగా,ముస్లిం సామాజిక వర్గంలో ఓట్లను కోల్పోయే పరిస్థితి  తలెత్తకుండా.. మైనారిటీల నుంచి వెల్లువెత్తుతున్న ఎన్నికలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలనేది పార్టీ వ్యూహం. 

రాష్ట్రంలో వక్ఫ్ భూములు 75 వేల ఎకరాలు ఉండగా, 68 వేల ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయ్యాయని ఆ వర్గం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మిగిలిన భూములనైనా కాపాడాలంటే జ్యుడీషియల్ పరిధిలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన పట్ల మేనిఫెస్టో కమిటీ సుముఖంగానే ఉంది.

వివిధ కులాలకు చెందిన సంఘాలు, వికలాంగులు తదితర వర్గాల నుంచి కూడా మేనిఫెస్టో కమిటీకి అనేక వినతులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో బారాస పాలనలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎస్పిఎస్సి ని  సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ కూడా విద్యార్థి వర్గాల నుంచి వినిపిస్తోంది.

కేవలం ఇవి మాత్రమే కాకుండా  రాష్ట్రంలో ఏ వర్గాల నుంచి ఎలాంటి విజ్ఞప్తి వచ్చిన సరే.. ఏ కొంచెం సబబుగా అనిపించినా సరే.. దానిని మేనిఫెస్టోలో పొందుపరచాలని.. అన్ని వర్గాలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన సాగాలని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వంలోని మేనిఫెస్టో కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో జంబో మేనిఫెస్టో గా తయారు చేయకుండా.. నిర్మాణాత్మకమైన అంశాలతోనే మేనిఫెస్టోను నింపితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.