పవన్ మార్కెట్ విలువ ఎంత.. తేల్చే టైమ్ వచ్చింది

పవన్ కల్యాణ్ మార్కెట్ రేంజ్ ఎంత? అతడి సినిమాలకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి? పవన్ తో భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం ఎంత బడ్జెట్ పెట్టొచ్చు? అతడికి రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో…

పవన్ కల్యాణ్ మార్కెట్ రేంజ్ ఎంత? అతడి సినిమాలకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి? పవన్ తో భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం ఎంత బడ్జెట్ పెట్టొచ్చు? అతడికి రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఇవ్వొచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రెండు రోజుల్లో తేలిపోతుంది. అవును.. భీమ్లానాయక్ బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే విషయంపై ఈరోజు, రేపటిలోగా ఓ స్పష్టత వస్తుంది. దీని బట్టి పవన్ రాబోయే సినిమాల బడ్జెట్, అతడి రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది.

విడుదలైన మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు భీమ్లానాయక్ బాగానే ఆడింది. ఆ తర్వాత సడెన్ గా వసూళ్లలో డౌన్ ఫాల్ మొదలైంది. రిపీట్ అడియన్స్ లేకపోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఓవైపు కలెక్షన్ తగ్గినప్పటికీ, మరోవైపు ఇంకో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో ఇన్నాళ్లూ సేఫ్ గా భీమ్లా బాక్సాఫీస్ బండి నడిచింది. కానీ వచ్చే వారం పరిస్థితి అలా లేదు.

మిగిలింది ఈ వారాంతం మాత్రమే

11న రాధేశ్యామ్ వస్తోంది. సో.. పవన్ కు ఉన్నది ఈ వీకెండ్ మాత్రమే. ఈరోజు, రేపు వచ్చే వసూళ్లతోనే ఈ సినిమా గట్టెక్కాల్సి ఉంటుంది. అటు చూస్తే ఓవర్సీస్ తప్ప ఏ ఒక్క ఏరియాలో ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ సాధించలేదు. లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే అదే పదివేలు అనుకునే పరిస్థితికి వచ్చారు బయ్యర్లు.

ఉదాహరణకు నైజాంనే తీసుకుంటే.. నిన్నటివరకు భీమ్లానాయక్ కు 33 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ (జీఎస్టీలతో కలిపి) వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కోటిన్నరకు పైగా వసూళ్లు రావాలి. అది కూడా ఈ 2 రోజుల్లో. అటు సీడెడ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు, రేపు హౌజ్ ఫుల్స్ నడిచినా కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వైజాగ్ లో కూడా అంతే. గుంటూరు, కృష్ణ, ఈస్ట్ లో కనీసం కోటి రూపాయలైనా రావాలి. సోమవారం నుంచి ఎలాగూ బాక్సాఫీస్ డల్ అవుతుంది కాబట్టి, ఈ రెండు రోజుల కలెక్షన్లే గట్టి అనుకోవాలి.

రాబోయే సినిమాలపై ప్రభావం..

భీమ్లానాయక్ వసూళ్లతో పవన్ కల్యాణ్ రాబోయే సినిమాలపై ఓ స్పష్టత వస్తుంది. పవన్ సినిమాకు ఏ రేంజ్ లో ఖర్చు పెట్టాలి, ఎంత పెడితే ఎంత వస్తుందనే అంచనా తెలుస్తుంది. అందుకే ఈ రెండు రోజుల వసూళ్లపై పవన్ నిర్మాతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

చూస్తుంటే, ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టేలా కనిపించడం లేదు. ఉన్నంతలో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే, ఓవర్సీస్ లో ఈ సినిమా లాభాల్లోకి రావడమే. ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే పవన్ సినిమాల బడ్జెట్లు నిర్ణయిస్తారు.

ఇకపై అడిగినంత ఇచ్చే పరిస్థితి ఉండదు..

మరోవైపు భీమ్లానాయక్ వసూళ్లు పవన్ రెమ్యూనరేషన్ పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో లాభాలు రానప్పుడు నిర్మాతలెందుకు డబ్బులిస్తారనేది ఇక్కడ పాయింట్. పవన్ కు క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ఆ క్రేజ్ కు విలువ ఎంతనేది ఈ 2-3 రోజుల్లో తేలిపోతుంది కాబట్టి దాన్ని బట్టే పవన్ కు పారితోషికం ఉంటుంది.

వకీల్ సాబ్ సినిమాకు పవన్ 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. తాజాగా వచ్చిన భీమ్లాకు ఇంకాస్త ఎక్కువ తీసుకున్నాడట. ఇక హరీశ్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకు 60 కోట్లు ఇచ్చారని టాక్. మధ్యలో దూరిన వినోదాయ సితమ్ సినిమాకు ఇంకాస్త ఎక్కువే ముట్టజెబుతున్నారట. పవన్ కు ఇస్తున్న డబ్బులకు, పెట్టిన పెట్టుబడికి, వస్తున్న రాబడికి అక్కడికక్కడ సరిపోతున్నప్పుడు ఇక ఆయనతో సినిమాలు తీసి ఉపయోగం ఏంటి?

సో.. భీమ్లానాయక్ కు వచ్చే వసూళ్ల బట్టి పవన్ రెమ్యూనరేషన్ అయినా తగ్గుతుంది లేదా ప్రొడక్షన్ కాస్ట్ అయినా కట్ అవుతుంది. వీటిలో ఏదో ఒకటి గ్యారెంటీ. ఆ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ 2 రోజుల్లో తేలిపోతుంది.