ఆరు నెలల్లోగా అమరావతి పరిధిలో భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని మూడు నెలల్లోగా మౌలిక సదుపాయాలను కల్పించి మంచి వారి వాటా స్థలాలను ఇచ్చిన రైతులకు అప్పగించాలని తీర్పు ఇచ్చింది అయితే ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ములు ఎక్కడున్నాయి.
కోర్టు ఆదేశాలను వారు ఎలా పూర్తి చేయగలరు. కోర్టు ఆదేశాలు అమలుకాకపోయిన పక్షంలో ఏమవుతుంది? నెలనెలా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిదులు దేవులాడుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆదేశించిన వెంటనే, వందలు.. వేల కోట్లు ఖర్చు పెట్టి.. మౌలిక సదుపాయాల కల్పన వ్యవహారం మొత్తం పూర్తి చేయగలుగుతుందా? సాధ్యమేనా? అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న సందేహం.
హైకోర్టు తమ తీర్పు సందర్భంగా.. ప్రభుత్వం తన వద్ద డబ్బుల్లేవు అని చెబితే కుదరదని కూడా హెచ్చరించింది. అంటే ఇండైరక్టుగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాల్సిందేనని చెప్పడం అన్నమాట. వేల కోట్ల రూపాయల నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెడుతున్నారు కదా.. ఈ పనులకు మాత్రం నిధులు లేవు అంటే కుదరదు అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
అయితే ప్రభుత్వం వద్ద నిజంగానే డబ్బుల్లేకుండాపోయిన పరిస్థితిలో.. ఆ విషయాన్నే వారు కోర్టుకు నివేదిస్తే ఏం చేస్తారు. కోర్టు పట్టుబట్టినా సరే.. ఇప్పుడు డబ్బుల్లేవు గానీ.. డబ్బు రాగానే వసతులు కల్పిస్తాం అని ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే ఇక కోర్టు ఏం మాట్లాడగలుగుతుందది. అలాంటి ఒప్పుకోలు ద్వారా.. కోర్టు ఆదేశాలను అమల్లో పెట్టడం అనే పనిని.. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం వాయిదా వేసుకుంటూ పోవడానికి కూడా ఆస్కారం చిక్కింది.
సంక్షేమ పథకాలకు మాత్రం ఉన్నాయి కదా అని కోర్టు వ్యాఖ్యానించిన మాట నిజమే కావొచ్చు. కానీ.. సంక్షేమపథకాలు అనేవి.. ప్రభుత్వానికి ముందుగానే అంచనా తెలిసే స్పష్టమైన పద్దు. కానీ.. ఇప్పుడు హైకోర్టు ఆదేశం ద్వారా వచ్చిన ఖర్చు అనుకోకుండా వచ్చి మీద పడింది.. దీనికి డబ్బు సిద్ధంగా లేదు.. అని ప్రభుత్వం చెప్పడానికి అవకాశం ఉంది.
సంక్షేమ పథకాలకు ముందుగానే కేటాయించాం గనుక.. ‘పేద ప్రజలైన లబ్ధిదారులకు పంచిపెట్టడానికి ఇప్పుడు కూడా మావద్ద సరిపడా డబ్బులున్నాయి. కానీ.. రాజానాని మౌలిక వసతుల కల్పనకోసం డబ్బులేవు’ అని ప్రభుత్వం చెప్పినా కూడా హైకోర్టు చేయగలిగిందేమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రజలకు పంచిపెట్టడాన్ని ఆపేసి ఆ డబ్బుతో అమరావతిలో పనులు చేయాలని హైకోర్టు చెప్పడం కుదరదు. దాంతో వారి పాత్ర పరిమితం అవుతుంది.
పైగా కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అవి విరుద్ధంగా ఉంటే.. వాటిని తక్షణం అమలులోకి తీసుకురాకుండా.. కాలయాపన చేయడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. అలా చేయడం వలన చీఫ్ సెక్రటరీ మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు అవుతుంది.
అలాంటి కేసుల మీ కూడా విచారణ జరుగుతుందే తప్ప.. న్యాయస్థానం ఎప్పటికీ ఆదేశాలను ఆచరణలో పెట్టే వ్యవస్థ కాజాలదు కదా.. అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి అఫిడవిట్ సమర్పించే సమయానికి ప్రభుత్వం అందులో ఏయే వివరాలు పేర్కొంటుందో.. ఏయే మడతపేచీలు పెడుతుందో చూడాలి.