సినీ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు , ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుపై నాయి బ్రాహ్మణులు మండిపడుతున్నారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన తమ కులాన్ని తండ్రీతనయుడు తక్కువ చేసి మాట్లాడ్తారా? అంటూ వారు నిలదీస్తున్నారు. ఈ మేరకు వాళ్లిద్దరిపై చర్య తీసుకోవాలని కోరుతూ నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి ఆ సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను ఇటీవల రూ.5 లక్షల విలువైన వస్తువులను దొంగతనం చేశాడని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను దొంగగా చిత్రీకరించడంతో పాటు కులం పేరుతో మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు దూషించారని నాగశ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాగశ్రీనుకు ఆయన సామాజిక వర్గం అండగా నిలిచింది.
ఈ నేపథ్యంలో మంచు మోహన్‌బాబు, విష్ణులపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. నాగశ్రీను తోపాటు బీసీలందరికీ మంచు కుటుంబం క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా కులాల పేరుతో దాడులు జరుగుతుండటం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరి తమకు కూడా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.