సంక్షేమ‌మే జ‌గ‌న్‌ను పాతాళానికి…!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌రోసారి త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. రాజ‌కీయంగా బైరెడ్డిని వైసీపీ పాతాళానికి నెట్టేసింది. మ‌రోవైపు బైరెడ్డి సోద‌రుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌రోసారి త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. రాజ‌కీయంగా బైరెడ్డిని వైసీపీ పాతాళానికి నెట్టేసింది. మ‌రోవైపు బైరెడ్డి సోద‌రుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని జ‌గ‌న్ వెన్నుతట్టి ప్రోత్స‌హిస్తున్నారు. 

కొన్ని నెల‌ల క్రితం బైరెడ్డికి కీల‌క‌మైన శాప్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి, త‌న‌ను న‌మ్ముకున్నందుకు త‌గిన న్యాయం చేశారు. బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రాజ‌కీయానికి త‌మ్ముని కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి రూపంలో జ‌గ‌న్ చెక్ పెట్ట‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేకున్నారు.

టీడీపీ నుంచి బ‌య‌టికొచ్చిన బైరెడ్డి, ఆ త‌ర్వాత రాయ‌ల‌సీమ ఉద్య‌మం పేరుతో కొన్నాళ్లు కాలం గ‌డిపారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అక్క‌డ కూడా వ‌ర్కౌట్ కాక‌పోవ‌డంతో బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం బైరెడ్డి, ఆయ‌న కుమార్తె శ‌బ‌రి బీజేపీలో కొన‌సాగుతున్నారు. త‌మ‌ను రాజ‌కీయంగా చావుదెబ్బ తీసిన జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి బైరెడ్డి వేచి చూస్తున్నారు.

జిల్లాల పునర్వ్య‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో ఆయ‌న జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రజా నిరసన దీక్ష చేశారు. డోన్, ఆదోనిని జిల్లాలుగా చేయాలని, నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలని ఆయ‌న డిమాండ్ చేశారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలన్నారు. మూడు రాజధానుల తీర్పు మాదిరిగానే జిల్లాల విభజన కూడా జగన్‌కు షాక్ తగులుతుందని ఆయ‌న అన్నారు.

సంక్షేమ పథకాలే జగన్‌ను పాతాళానికి తీసుకెళ్తాయని బైరెడ్డి శాపం పెట్ట‌డం గ‌మ‌నార్హం.  వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, కేవలం గడ్డ మాత్రమే మిగిలిందని ఆయ‌న విమ‌ర్శించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం కూడా బైరెడ్డి దృష్టిలో త‌ప్పైంది. పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డాన్ని బైరెడ్డి జీర్ణించుకోలేకున్నార‌నేందుకు ఆయ‌న విమర్శ‌లే నిద‌ర్శ‌నం. 

ఎంత‌సేపూ పేద‌ల‌కు జ‌గ‌న్ దోచి పెడుతున్నార‌ని ఏడ్పే త‌ప్ప‌, కేంద్రం నుంచి ఏదైనా న్యాయ చేస్తామ‌ని ధ్యాస బీజేపీ నేత‌ల్లో కొర‌వ‌డ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.