తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శత్రువు , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) అగ్రస్థానం కల్పించారు. తన కుమారుడు వేమూరి ఆదిత్య హైదరాబాద్‌లో నూతనంగా నెలకొల్పిన ‘క్రిక్‌ఫ్యూజ్’అవుట్లెట్ ప్రారంభానికి రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఆర్కే అనుకుని వుంటే తెలంగాణ ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించడం పెద్ద పనేం కాదు.
కానీ టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్‌రెడ్డిని ఆహ్వానించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కాస్త కోపం తెప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని చెబుతుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ మధ్య అలాంటి స్నేహపూర్వక సంబంధాలు లేవు. టీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డిని ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూస్తుంటారు.
అలాంటి రేవంత్‌రెడ్డిని పనిగట్టుకుని తన కుమారుడి షాప్ ప్రారంభానికి ఆర్కే ప్రారంభం సహజంగానే టీఆర్ఎస్ పెద్దలకు ఒకింత కోపం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికల సందర్భంలో కేటీఆర్‌పై ఆంధ్రజ్యోతి ఇష్టానుసారం కథనాలు రాసిందని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు ఏబీఎన్‌ను తెలంగాణలో నిషేధించారు.
అనంతర కాలంలో పరస్పరం సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ సర్కార్‌తో ఆర్కేకి చెప్పుకోతగ్గ స్నేహం లేదు. అలాగని శత్రుత్వం కూడా లేదు. అయితే రేవంత్‌రెడ్డిని ప్రోత్సహించే మీడియా సంస్థలంటే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ, పార్టీ పెద్దలకు కోపం. తెలంగాణలో ఒక్క ఆర్కే మాత్రమే రేవంత్‌రెడ్డిని ప్రోత్సహిస్తుంటారు.
గతంలో ఓటుకో నోటు కేసులో రేవంత్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన రేవంత్ ఇంటికెళ్లి ఆర్కే ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఆర్కేని కలిసి రేవంత్ ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి ఓ మీడియా సంస్థ అధిపతి మద్దతు ఉందనేందుకు తాజా కలయికే నిదర్శనం.