వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎపిసోడ్ కు సంబందించి పచ్చపత్రికల్లో డైలీ సీరియల్ ఇంకా నడుస్తూనే ఉంది. ప్రతిరోజూ వాంగ్మూలాల పేరిట కొంరు వెల్లడించిన వివరాలు అంటూ.. నానా రకాల సమాచారాన్ని ఈ పచ్చ పత్రికలు బయటపెడుతున్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడని, ఆయనే తెరవెనుక ఉండి ఈ హత్య చేయించాడని, ఇప్పుడు నిందితుల్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడని నానా అవాకులు చెవాకులు.. పలువురు వ్యక్తులు సీబీఐతో చెప్పినట్లుగా పచ్చమీడియా కథనాలను వండి వార్చేస్తోంది. ‘సీబీఐ కు ఇచ్చిన వాంగ్మూలాలు’ అంటూ వారు చెబుతున్న కబుర్లన్నీ నిజమేనా? అనే సందేదహాలు ప్రజల్లో చాలా మందికి ఉన్నాయి.
అయితే ఈ వాంగ్మూలాల విషయంలో.. స్వయంగా వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఒక కీలకమైన రహస్యాన్ని తాజాగా బయటపెట్టారు. సీబీఐ కేసు విచారణ చేపట్టడానికి పూర్వం.. తాను పోలీసు అధికారులకు తనకు తెలిసిన వివరాలు వెల్లడించినప్పుడు.. తాను చెప్పిన వివరాలు వేరు అని, వారు వాంగ్మూలలను తమకు తోచిన రీతిలో సృష్టించారని ఆయన సీబీఐ అదికారులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే.. పోలీసులు ఆయన వారితో చెప్పిన విషయాలను పక్కన పెట్టి, తమకు తోచిన వివరాలు రాసుకున్నారన్నమాట.
నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ విషయం బయటపెట్టిన తర్వాత.. ప్రజల ఎదుట కమ్మిన మాయపొరలు తొలగిపోతున్నాయి. ఇన్నాళ్లుగా పచ్చ పత్రికలు ప్రచురిస్తున్న డైలీ సీరియల్ లోని వాంగ్మూలాలు కూడా ఇ..లా..గే.. సృష్టింపబడి ఉండవచ్చు కదా అనిపిస్తోంది.
సీబీఐకు చెప్పిన వాంగ్మూలాలు అంటూ పచ్చపత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. పులివెందులకు చెందిన సామాన్య వ్యక్తుల వాంగ్మూలాల పేరుతో కూడా.. చాలా సీరియస్ ఆరోపణలను ఆయా పత్రికలు ప్రచురించాయి. కొన్ని వార్తా కథనాల విషయంలో.. ఆయా వ్యక్తులు గొల్లుమన్నారు కూడా! అసలు సీబీఐతో తాము చెప్పిన విషయాలు వేరు అని, వాంగ్మూలంలో చెప్పాం అంటూ పత్రికల్లో వచ్చిన సంగతులు వేరు అని వారు గగ్గోలు పెట్టారు.
వారి గగ్గోలు వ్యవహారాలను, ఇవాళ ఏపీ పోలీసుల మీద ఆరోపిస్తూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలాల సృష్టిపై చెప్పిన వివరాలను పోల్చి చూసినప్పుడు.. నర్రెడ్డి చెప్పిన తరహాలోనే సీబీఐ అధికారులు కూడా వాంగ్మూలాలను సృష్టించి ఉండవచ్చు కదా అనే అభిప్రాయం ఏర్పడుతోంది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 161 ప్రకారం పోలీసులు ఒక నేరానికి సంబంధించిన అన్ని రకాల వ్యక్తులను కూడా విచారించి ప్రాథమికంగా వివరాలను నమోదు చేస్తారు. తాము ఆయా వివరాలను సేకరించినట్లుగా కోర్టుకు నివేదిస్తారు. అంతే తప్ప .. అవేమీ ఫైనల్ విషయాలు కావు. సెక్షన్ 161 కింద నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టులో మళ్లీ ఆ వ్యక్తులు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కోర్టు వరకు వచ్చినతర్వాత, ఆ వివరాలు తాము చెప్పినవి కాదని వారు తోసిపుచ్చడానికి కూడా అవకాశం ఉంటుందది. (ఇప్పుడు నర్రెడ్డి ఏపీ పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలాల గురించి చెప్పినట్టుగా)!
అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 161(3) ప్రకారం.. పోలీసులు తాము సేకరించే వివరాలను ఆడియో, వీడియో ఫార్మాట్లలో రికార్డు చేయడానికి కూడా వెసులుబాటు ఉంది.
ఏపీ పోలీసులు అయినా, సీబీఐ వారు అయినా ఇంత కీలకమైన వివేకా హత్య కేసులో నమోదు చేసే వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ చేయిస్తే తప్ప వాటిని నమ్మలేం.
ఇలాంటి రికార్డింగ్.. చాలా ఆధునిక సాంకేతికత ఎంతో చవగ్గా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో రికార్డింగ్ చేయకుండా.. కేవలం వివరాలు అడిగి, వారు చెప్పిన వాటిని కాగితం మీద రాసి ఉంచినా, రాసిన తర్వాత సంతకాలు తీసుకుని అక్కడికే పరిమితం చేసినా.. వారి చిత్తశుద్ధిని నమ్మలేం. వీడియో రికార్డింగులు కూడా ఉన్న వాంగ్మూలాలు తప్ప.. మరేవీ కూడా ‘సృష్టించబడలేదు’ అని చెప్పలేం!
కాబట్టి.. వైసీపీ నాయకులు మీద బురద చల్లే యజ్ఞంలో ఇలాంటి వాంగ్మూలాల డైలీ సీరియల్ ను ప్రచురించడం ద్వారా.. పచ్చ పత్రికలు ఎంతగానైనా ముచ్చట తీర్చుకోవచ్చు గానీ.. వాటి సత్యసంధత ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. మరో కోణం లోంచి చూసినప్పుడు.. అవి నిజమై ఉండాలనేది కూడా పచ్చ పత్రికల కోరిక కాకపోవచ్చు. తాము బురద చల్లడం వల్ల వారి పరువు పోతే చాలు.. వారు నేరస్తులు కాకపోయినా ఈ పచ్చ మీడియా హేపీనే!