రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదనే సామెత చందాన… చంద్రబాబుకు అధికారం పోయినా, శని మాత్రం వదల్లేదు. మళ్లీ గరుడ పురాణాలు తెరపైకి వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు రక్తి కట్టించని, ప్రజానీకాన్ని ఆకట్టుకోని కథతోనే మళ్లీ ఎన్నికల సినిమాను తెరపైకి తేవడానికి నటుడు శివాజీని ముందుకు తేవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2024 ఎన్నికల నేపథ్యంలో గరుడ పురాణం-2 స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు శివాజీ తాజా సంచలన కామెంట్స్ నిదర్శనం.
ఇదే శివాజీ గతంలో జనసేనాని పవన్‌కల్యాణ్, బీజేపీ, వైసీపీకి లేనిపోని అక్రమ సంబంధాలన్నీ అంటకట్టి, టీడీపీకి లబ్ధి చేకూర్చాలని డ్రామాకు తెరలేపారు. అమరావతి రాజధాని అద్భుతాలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై అహోఓహో అంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని శివాజీ చేసిన విన్యాసాలు సర్కస్‌ను తలపించాయి.
రీల్ లైఫ్‌లో కంటే రియల్ లైఫ్‌లోనే శివాజీ అద్భుతంగా నటిస్తారనే పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుపై జనాల్లో వ్యతిరేకతకు మించి, అసహ్యం కలిగేలా శివాజీ లాంటి వాళ్లంతా తమ వెకిలి చేష్టలతో శక్తివంచన లేకుండా కృషి చేశారనే విమర్శలు లేకపోలేదు.
చంద్రబాబుకు అధికారం దూరమైన తర్వాత బీజేపీకి దగ్గరవ్వాలని శివాజీ చూశారు. ఎందుకనో ఆ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ రియల్ లైఫ్‌లో నటనకు శ్రీకారం చుట్టారు.
వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని శివాజీ సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా నయం జగనే టీడీపీలో చేరతారని శివాజీ ప్రకటించలేదనే వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో శివాజీ కామెంట్స్‌పై పేలుతున్నాయి.
అమరావతి రైతుల దీక్షా శిబిరాల్లో పర్యటించి వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జగన్ సినిమా మొత్తం అయిపోయిందని, ఇక మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా ఈ సారి వైసీపీ నేతలు గెలిచే పరిస్థితి లేదని శివాజీ చౌదరి జోస్యం చెప్పడం విశేషం.
గతంలో చంద్రబాబు ఓటమికి కారకుల్లో ఒకడైన శివాజీ, ఈ దఫా కూడా ఆ పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.