బ్రేకింగ్ న్యూస్ కోసం ఆవురావుర‌మ‌ని…!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌న్న ప్రచారంతో మీడియా అప్ర‌మ‌త్త‌మైంది. సీబీఐ నోటీసులు తీసుకునేందుకు క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి నిరాక‌రించ‌డం, అనంత‌రం క‌డ‌ప కోర్టు ద్వారా వాటిని పంపేందుకు…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌న్న ప్రచారంతో మీడియా అప్ర‌మ‌త్త‌మైంది. సీబీఐ నోటీసులు తీసుకునేందుకు క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి నిరాక‌రించ‌డం, అనంత‌రం క‌డ‌ప కోర్టు ద్వారా వాటిని పంపేందుకు విచార‌ణ సంస్థ స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

ఇదే సంద‌ర్భంలో కోర్టు దిశానిర్దేశం మేర‌కు కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖుల అరెస్ట్ వార్త‌ను బ్రేక్ చేసేందుకు వివిధ మీడియా సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. 

ఇందులో భాగంగా క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటి స‌మీపంలో మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌తినిధులు కాపు కాచుకుని ఉంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పెద్ద సంఖ్య‌లో మీడియా ప్ర‌తినిధులు పులివెందుల‌లో తిష్ట వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇదిలా వుండ‌గా క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి మాత్రం రోజువారీ త‌న షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటుండ‌డం విశేషం. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లేల‌-తొండూరు గ్రామాల మ‌ధ్య‌లో రూ.40 కోట్ల‌తో చేప‌ట్టిన బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ క‌ళాశాల‌, షాదీఖానా నిర్మాణాల‌కు ఆయ‌న శుక్ర‌వారం భూమి పూజ చేశారు. 

అలాగే పులివెందుల‌లో కొంద‌రిని ప‌రామ‌ర్శించ‌డం, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న బిజీ అయ్యారు. కానీ మీడియా ప్ర‌తినిధులు మాత్రం బ్రేకింగ్ న్యూస్ కోసం పులివెందుల‌లో ఆవురావుర‌మ‌ని ఎదురు చూస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.