కరోనా మానవాళిని ఇబ్బంది పెట్టడం ప్రారంభం అయినప్పుడు.. విదేశాల్లోని భారతీయులు బాగా ఇబ్బందులు పడ్డారు. అంతే కాదు.. కరోనాను దేశంలోకి దిగుమతి చేసింది కూడా వీరే! ఈ విషయంలో వారిని నిందించడానికి ఏమీ లేదు. విదేశీవాసం తప్పనిసరిగా మారింది. ఇది దేశానికి కొన్ని రకాలుగా మేలు చేస్తూ ఉంది.
విద్య, ఉపాధి కోసం లక్షల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉంటున్నారు. వీరి వల్ల దేశానికి కొంత మేలు జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఉపాధి మార్గాల్లో భాగంగా వేరే దేశాలకు వెళ్లిన వారు తమ కుటుంబాలకు పంపుతున్న డబ్బు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటోంది. ఈ తరహాలో స్వదేశాలకు డాలర్లను పంపుతున్న వాళ్లలో ప్రపంచంలోనే ముందు వరసలో ఉంటున్నారు ఇండియన్స్. చైనా వంటి భారీ మానవవనరులున్న దేశానికి ధీటుగా ఇండియన్స్ విదేశాల నుంచి స్వదేశానికి సంపదను పంపుతున్నారు. దీని వల్ల దేశంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది.
ఇక మేధో వలస మంచిది కాదనే వాదన ఉండనే ఉంది. అయితే సరైన అవకాశాలు లేనప్పుడు మేధస్సు ఖాళీగా ఉండటం కూడా మంచిది కాదు. ఏదోలా అది ఉపయోగపడుతూ ఉందని అనుకోవాలి. మేధస్సును వాడుకునే వనరులు భారతదేశంలో ఇప్పటికీ మెరుగు కానప్పుడు.. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారిని నిందించి ప్రయోజనం లేదు!
ఇక విదేశాలకు వెళ్లే వారిలో రెండో కేటగిరి విద్య కోసం. యూరప్ దేశాల్లోనూ, అమెరికాలోనూ చదువుకోసం బోలెడంత మంది భారత విద్యార్థులు వెళ్తూనే ఉన్నారు. ఇలాంటి వారు తరచూ వార్తల్లోకి వస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా. ఉక్రెయిన్ లో భారత వైద్య విద్యార్థుల గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నా, ఇంతకు మించి కూడా ఈ అంశం కొన్నేళ్లుగా ఆందోళన రేపుతూ ఉంది.
అమెరికాలో పెద్ద చదువుల కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థుల కష్టాల గురించి తరచూ వింటూనే ఉన్నాం. అక్కడ కొన్ని విద్యాసంస్థలు బోర్డు తిప్పేయడం, భారత విద్యార్థులు చదువుకోసం అంటూ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వారిని తిప్పి పంపేయడం.. వంటి అంశాలు వివిధ సందర్భాల్లో చర్చకు వచ్చాయి. అమెరికాలో విద్యను అభ్యసించే విద్యార్థులు అనునిత్యం అభద్రతాభావంలోనే కొట్టు మిట్టాడుతూ ఉంటున్నారు.
చదువు మధ్యలో ఏ సెలవులు ఉన్నప్పుడు స్వదేశానికి, సొంత వాళ్లను చూడటానికి వచ్చే అవకాశం ఉన్నా.. ఇక్కడకు వస్తే మళ్లీ అక్కడకు రానిస్తారో లేదో అనే ఆందోళన చెందే వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రత్యేకించి రెండేళ్లుగా కరోనా పరిస్థితుల్లో.. ఇండియాకు వస్తే మళ్లీ అమెరికాకు ఎంట్రీ ఉంటుందో లేదో అని అక్కడ చదువుకునే వారు ఆలోచిస్తూ ఉన్నారు. దీంతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అమెరికాను వారు దాటడం లేదు!
కరోనా సమయంలోనూ, ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితులు, ఇంకా ఆయా దేశాల్లో జరిగే జాతి వివక్ష దాడులు.. ఇవన్నీ కూడా విదేశీ వాసాన్ని ఆందోళనకరంగా మారుస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ నుంచి భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అనే ఆందోళన ఏర్పడుతోంది. దీని వల్ల జననీ జన్మభూమి స్వర్గాదపీ గరియసీ.. అనే సూక్తి గుర్తు రావొచ్చు.
అయితే విద్యా, ఉపాధి మార్గాలన్నింటినీ వదులుకుని స్వదేశంలోనే ఉండటం కూడా గొప్ప కాదు! ఏతావాతా ప్రపంచ పరిణామాలతో విదేశాల్లో ఆవాసం ఉంటున్న భారతీయులు మాత్రం తీవ్రమైన ఒత్తిళ్లనే ఎదుర్కొంటున్నారు.