అమ‌రావ‌తి తీర్పు.. టీడీపీకి శ‌రాఘాతం!

కోర్టులో జ‌గ‌న్ కు మ‌రోసారి ఎదురుదెబ్బ‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కోర్టు మొట్టికాయ‌లు.. ఈ మాట‌లు కొత్త‌వి కావు. అమ‌రావ‌తి విష‌యంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీ హై కోర్టులో మ‌రోసారి చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే.…

కోర్టులో జ‌గ‌న్ కు మ‌రోసారి ఎదురుదెబ్బ‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కోర్టు మొట్టికాయ‌లు.. ఈ మాట‌లు కొత్త‌వి కావు. అమ‌రావ‌తి విష‌యంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీ హై కోర్టులో మ‌రోసారి చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే. తాము మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని వెన‌క్కు తీసుకున్న‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇది వ‌ర‌కే అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించింది. 

అయిన‌ప్ప‌టికీ ఈ కేసుల విచార‌ణ‌ను న్యాయ‌స్థానం కొన‌సాగించి, అమ‌రావ‌తిలో, అమ‌రావ‌తిలో మాత్ర‌మే రాజ‌ధానిని నిర్మించ‌డం ఏపీ ప్ర‌భుత్వ బాధ్య‌త అని స్ప‌ష్టం చేసింది. ఈ తీర్పు విష‌యంలో కోర్టు ప‌రిగ‌ణించిన అంశాలు, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అంశాల‌ను ప‌క్క‌న పెడితే. కోర్టు తీర్పు య‌థాత‌థంగా అమ‌లైతే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి రాజ‌కీయంగా శ‌రాఘాతంగా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు.

హైద‌రాబాద్ అనుభ‌వం దృష్ట్యా ఏపీ నెత్తిన అమ‌రావ‌తి గుదిబండ‌ను మోస‌య‌డానికి ప్ర‌జ‌లెవ‌రూ సిద్ధంగా లేరు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జానీకం అమ‌రావ‌తిని అభివృద్ధి ప‌రిచి మ‌రోసారి మోస‌పోవ‌డానికి సిద్ధంగా లేరు. ఇదంతా తెలిసి కూడా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రూపంలో ఏపీ నెత్తిన గుదిబండ‌ను మోపారు. ఆ భారాన్ని ఎంతో కొంత వ‌దిలించుకుంటూ.. మూడు ప్రాంతాల‌కూ స‌మ‌న్యాయం జ‌రిగే ఫార్ములాను జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. కోర్టు పోరాటంలో అయినా, అమ‌రావ‌తి ఉద్య‌మంలో అయినా తెలుగుదేశం పార్టీ పాత్ర ఏ స్థాయిలో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అమ‌రావ‌తి కోసం చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా రోడ్డెక్కారు. విరాళాలు సేక‌రించారు. జోలె ప‌ట్టి అడుక్కున్నారు. చంద్ర‌బాబు ఏం చేసినా అది అమ‌రావ‌తి కోస‌మే అన్న‌ట్టుగా కొన్నాళ్లు పాటు ర‌చ్చ జ‌రిగింది. ఆ త‌ర్వాత అమ‌రావ‌తి ఉద్య‌మం నుంచి చంద్ర‌బాబు నాయుడు క్ర‌మంగా త‌ప్పుకున్నారు. దాని వెనుక ప‌ని చేసిందంతా రాజ‌కీయ వ్యూహమే అని చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అమరావ‌తికి తెలుగుదేశం పార్టీ అతి ప్రాధాన్య‌త వ‌ల్ల రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో టీడీపీ కి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. అమ‌రావ‌తి కోసం అంటూ చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల‌సీమ‌కు వెళ్లి జోలె ప‌ట్టినా, అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారుల‌తో తిరుప‌తిలో టీడీపీ స‌భ‌ను నిర్వ‌హింప‌జేసినా… ఆ పార్టీకి రాజ‌కీయంగా ఆ ప్రాంతాల్లో వ్య‌తిరేక‌తే త‌ప్ప మ‌రో ప్ర‌యోజ‌నం లేదు.

హైద‌రాబాద్ విష‌యంలో సీమాంధ్ర ప్ర‌జ‌ల అనుభ‌వం ప‌చ్చిగా ఉంది. ద‌శాబ్దాల పాటు హైద‌రాబాద్ అభ్యున్న‌తిలో సీమాంధ్ర ప్ర‌జ‌ల క‌ష్టం ఎంతో ఉంది. ఇప్పుడు అది కాస్తా తెలంగాణ ప‌రం అయ్యే స‌రికి.. ఏపీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి త‌మ‌కంటూ ఒక న‌గ‌రం అంటూ చెప్పుకోవ‌డానికి లేకుండా పోయింది. హైద‌రాబాద్ అంతా తెలంగాణ క‌ష్టం అన్న‌ట్టుగా అక్క‌డి ప్ర‌భుత్వం ఇప్పుడు క‌ల‌రింగ్ ఇస్తోంది. హైద‌రాబాద్ ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా చెప్పుకుంటూ.. ప‌క్క రాష్ట్రాల‌ను కూడా తొక్కేయ‌డంలో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వెళ్తోంది.

హైద‌రాబాద్ అభివృద్ధి కావ‌డం తెలంగాణ‌కు మాత్ర‌మే వ‌రంగా మారింది. అంత‌కు మించి.. హైద‌రాబాద్ , బెంగ‌ళూరు, చెన్నై వంటి న‌గ‌రాల మ‌ధ్య‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వాటి కార‌ణంగా మ‌రో న‌గ‌రం అభివృద్ధి చెందే అవ‌కాశాలు కూడా అంతంత మాత్ర‌మే. ఇలాంటి నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో అంతా ప్ర‌జాధనంతో మాత్ర‌మే అభివృద్ధి జ‌ర‌గాలి. అన్న ప్ర‌సాన నుంచి అవ‌కాయ దాకా అంతా ప్ర‌జ‌ధనంతో జ‌ర‌గాలి.

అమ‌రావ‌తి అభివృద్ధి అక్క‌డి వారికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మే. మ‌రి రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ధ‌న‌, శ్ర‌మ‌ల‌తో అమ‌రావ‌తి అభివృద్ధి చెందితే? అమ‌రావ‌తికి భూములిచ్చిన వారు కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్త‌డం మిన‌హా.. సీమ‌కు కానీ, ఉత్త‌రాంధ్ర‌కు కానీ ఒరిగేదేమిటి?  అమ‌రావ‌తి అనే గుదిబండ‌ను శాశ్వ‌తంగా ఈ ప్రాంతాలు మోయాల్సి ఉంటుంది. ఈ విష‌యాలేమీ ఆ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌న‌వి కావు.

మూడు ప్రాంతాల అభివృద్ధికీ జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌ను ఇస్తే, త‌మ హ‌యాంలో అమ‌రావ‌తి అనే బండ‌ను రాష్ట్రం మీద వేసిన తెలుగుదేశం పార్టీ, అందుకు ఫ‌లితంగా 23 సీట్ల‌కు ప‌రిమితం అయినా, అమ‌రావ‌తి పోరాటాన్ని అందుకుంది. అన్ని అస్త్ర‌శ‌స్త్రాల‌నూ సంధించి అమ‌రావ‌తి బండ‌ను రాష్ట్రం నెత్తి మీద నుంచి దించే అవ‌కాశం లేకుండా చేసింది.

ఇప్పుడేమో అమ‌రావ‌తి పోరాట‌కారుల విజ‌యం అని, తెలుగుదేశం పార్టీ విజ‌య‌మ‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ అని తెలుగుదేశం, దాని అనుకూల మీడియా రెచ్చిపోతూ ఉంది. తాము జ‌గ‌న్ మీద విజ‌యం సాధించిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీకి, ప‌చ్చ మీడియాకూ అనిపించ‌వ‌చ్చు గాక‌. అయితే .. ఈ విజ‌యానందంలో తాము ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఓడిపోతున్నామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. అమ‌రావ‌తి సెంటిమెంటు ప్ర‌జ‌ల్లో అణుమాత్ర‌మైనా లేద‌ని ఇప్ప‌టికే అనేక ద‌ఫాలుగా రుజువు అయ్యింది.

తాము ఓడిపోతే అమ‌రావ‌తి ఎక్క‌డిక్క‌డ ఆగిపోతుందంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌చారం చేసుకున్నారు. అమ‌రావ‌తి ని అలా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉప‌యోగించుకున్నారు. గ్రాఫిక్స్ వేసి, సీజీ టెక్నాల‌జీతో అమ‌రావ‌తిని అస్త్రంగా వాడుకున్నారు. అయితే ప్ర‌జ‌లు వాటిని ప‌ట్టించుకోలేదు. సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లే కాదు.. ఆఖ‌రికి అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల కూడా ఆ సెంటిమెంటు ప‌ని చేయ‌లేదు.

అమ‌రావ‌తికి అతి స‌మీపంలో చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ బాబు పోటీ చేసి చిత్త‌య్యారు. అదీ అమ‌రావ‌తి సెంటిమెంటుకు ద‌క్కిన విలువ‌. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లు తీసుకు వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌, గుంటూరు మున్సిపాలిటీల్లో చిత్త‌వ్వ‌డం ద్వారా తెలుగుదేశం పార్టీకి అమ‌రావ‌తి విలువ అర్థం అయ్యింది. 

అమ‌రావ‌తిని కాపాడుకోవాలంటే గుంటూరు, విజ‌య‌వాడ‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటూ మున్సిపాలిటీ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ల‌లో టీడీపీని గెలిపించ‌క‌పోతే అమ‌రావ‌తిపై హ‌క్కులు రాసిచ్చిన‌ట్టే అంటూ రిఫ‌రండం త‌ర‌హాలో అప్పుడు చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రిగింది. చంద్ర‌బాబు ఇచ్చిన రిఫ‌రండం పిలుపు మేర‌కే అప్పుడు ఎన్నిక‌లు జ‌రిగాయానుకుంటే.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అమ‌రావ‌తి సెంటిమెంటు శూన్యం అని రుజువు అయ్యింది.

అయినా టీడీపీ చ‌ల్లార‌లేదు. చివ‌ర‌కు టీడీపీ ఆశించిన‌ట్టుగా అమ‌రావ‌తి కి అనుగుణంగా తీర్పు వ‌చ్చింది. మ‌రి ఈ తీర్పు ప‌ట్ల టీడీపీ,అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారులు, ప‌చ్చ మీడియా ఊగిపోతూ ఉండ‌వ‌చ్చు గాక‌. ఇదే తీర్పు వ‌ల్ల రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి రాజ‌కీయ స‌మాధి సిద్ధం అయిన‌ట్టే. త‌ను మూడు ప్రాంతాల అభ్యున్న‌తికీ ప్ర‌య‌త్నిస్తే.. టీడీపీ త‌న్న అస్త్ర‌శ‌స్త్రాల‌న్నింటినీ ఉప‌యోగించుకుని అడ్డుపుల్ల వేసింద‌ని జ‌గ‌న్ వేరే ప్ర‌చారం చేయ‌న‌క్క‌ర్లేదు. సీన్ మొత్తం ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా అర్థం అవుతూ ఉంది.

అమ‌రావ‌తి కి అనుగుణంగా గ‌ళం విప్పిన టీడీపీ నేత‌లు ఆ త‌ర్వాత కిమ్మ‌న‌డం లేదు. జ‌రిగే న‌ష్టం వారికి కూడా అర్థం అయ్యింది. ఇప్పుడే కాదు, వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత అయినా.. జ‌గ‌న్ గెలిస్తే మూడు ప్రాంతాల అభివృద్ధికీ ప్రాధాన్యం ఉంటుంది, తెలుగుదేశం అంటే.. అది అమ‌రావ‌తి పార్టీ మాత్ర‌మే అనే సెన్స్  ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. కోర్టు తీర్పు త‌ర్వాత కూడా ఈ అంశంపై ప్ర‌జ‌ల్లోకి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వానికి రాజ‌ధాని విష‌యంలో చ‌ట్టం చేసే స్వ‌తంత్రం ఉంది. ఆ మేర‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తికి అసెంబ్లీలో ప‌ట్టం క‌ట్టింది. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు ఎలాగూ ఉన్నాయి. మ‌రి అదే ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రాజ‌ధాని విష‌యంలో నిర్ణ‌యాన్ని గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మీక్షించే హ‌క్కు ఉండ‌దా? అనే అంశం కూడా ఇప్పుడు చ‌ర్చ‌లోకి వెళ్లింది. 

ఈ  అంశంపై చ‌ర్చ‌లు తెలుగుదేశం పార్టీకి శ్రేయ‌స్క‌ర‌మైన‌వి అయితే కాదు. కోర్టు తీర్పు జ‌గ‌న్ కు ఎదురుదెబ్బ అని ప‌చ్చ‌మీడియా చంక‌లు గుద్దుకుంటూ ఉండ‌వ‌చ్చు గాక‌. అయితే ప్ర‌స్తుత ప‌రిణామాలు తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో ఎదురుదెబ్బ‌ల‌వుతాయ‌నేది ప్ర‌జా తీర్పు వ‌స్తే కానీ వారికి అర్థం కాక‌పోవ‌చ్చు!