పాపం చిన్నబాబు: అంతా పెద్దమ్మ చలవ!

తండ్రిని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో ఉంచితే, చినబాబు నారా లోకేష్ మాత్రం కొన్ని వారాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో తిష్టవేసి కూర్చున్నారు. కేంద్రంలోని పెద్దలను కలిసి తండ్రిని, తనను బయటపడేయమని విజ్ఞప్తులు చేయడానికి…

తండ్రిని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో ఉంచితే, చినబాబు నారా లోకేష్ మాత్రం కొన్ని వారాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో తిష్టవేసి కూర్చున్నారు. కేంద్రంలోని పెద్దలను కలిసి తండ్రిని, తనను బయటపడేయమని విజ్ఞప్తులు చేయడానికి తన శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. 

కానీ ఆయన కార్యం నెరవేరలేదు. అపాయింట్మెంట్ దొరకలేదు. న్యాయవాదులతో మంతనాలు జరపడానికే ఢిల్లీలో ఉన్నానని బుకాయిస్తూ.. కేంద్ర పెద్దలను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. చివరికి ఇన్నర్ రింగురోడ్డు కేసులో.. తనను కూడా సిఐడి రెండు రోజులపాటు విచారించిన తర్వాత.. పెద్దమ్మ పురందేశ్వరిచలవతో, నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకబుచ్చుకోగలిగారు. ఆయనతో తమ కష్టాలను గురించి మొరపెట్టుకున్నారు.  కానీ, ఆయన తరఫునుంచి స్పష్టమైన హామీ గాని, సానుకూల స్పందన గాని వచ్చినట్లుగా కనిపించడం లేదు.

పచ్చ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు తప్ప.. మరొక పోరాడింపు వాక్యం పలకలేదు. ఇన్నాళ్ల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత అమిత్ షా ను కలవగలిగినప్పటికీ, లోకేష్ సాధించినది మాత్రం ఏమీ లేదు అని అభిప్రాయమే ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? మీపై ఎన్ని కేసులు పెట్టారు?అని కేంద్ర హోం మంత్రి ఆరా తీసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

సిఐడి అధికారులు తనను విచారించిన తీరు గురించి.. నారా లోకేష్ చాలా వెటకారంగా, గూగుల్లో సమాధానాలు దొరికే  ప్రశ్నలనే అధికారులు తనను అడిగారంటూ చెప్పుకొచ్చారు. అదే తీరుగా అమిత్ షా కూడా.. గూగుల్లో చిటికె వేస్తే  సమాధానాలు దొరికే  మొక్కుబడి ప్రశ్నలను లోకేష్ ను అడిగి.. పంపించి వేసినట్లుగా కనిపిస్తోంది.

అయితే ఈ పరిణామాలను లోతుగా గమనిస్తే.. చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సుముఖంగా లేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కేంద్రంలోని పెద్దలు ఎవ్వరూ ఈ అరెస్టు గురించి ఇప్పటిదాకా పెదవి విప్పి మాట్లాడలేదు. 

రాష్ట్ర బిజెపి సారథి స్థానంలో ఉన్న పురందేశ్వరి, రెండు మూడు రోజుల కిందటే అమిత్ షాను కలిసి నారా లోకేష్ కోసం భేటీని ఏర్పాటు చేశారు. ఆమె దయ లేకపోతే ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. కానీ తమ పార్టీ నాయకురాలుగా ఉంటూ, తమ పార్టీ విధివిధానాలను అనుసరించి వెళ్లకుండా.. తన మరిది చంద్రబాబు విముక్తి కోసం పురందేశ్వరి చేస్తున్న ప్రయత్నాలు.. భాజపాలో ఆమెకు చెడ్డపేరు తేకుండా ఉంటే చాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు.