లెక్కాపత్రం లేదు: కోట్లలో డబ్బు.. కిలోల్లో బంగారం

ఇలా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో లేదో అలా డబ్బు, బంగారం పట్టుబడుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటుచేసి మరీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో లెక్కలేనంత కోట్లలో డబ్బు,…

ఇలా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో లేదో అలా డబ్బు, బంగారం పట్టుబడుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటుచేసి మరీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో లెక్కలేనంత కోట్లలో డబ్బు, కిలోల్లో బంగారం బయటపడడం గమనార్హం. ఎన్నికల వేళ, ఎలాంటి లెక్కలు-పత్రాలు లేకుండా వీటిని తరలిస్తూ దొరికిపోతున్నారు.

గడిచిన 3 రోజుల్లో హైదరాబాద్ పోలీసులు, 5.1 కోట్ల రూపాయల నగదు, 4.2 కోట్ల రూపాయల విలువ చేసే 7.7 కిలోల బంగారం, 8 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 11.7 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులకు సంబంధించి సదరు వాహనదారులు ఎలాంటి పత్రాలు చూపించలేకపోయారని వెల్లడించారు. ఇక మద్యం సంగతి సరేసరి, ఇప్పటివరకు 3 రోజుల్లో 110 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, అవినీతిరహితంగా చేయాలని చూస్తున్నారు పోలీసులు. అందుకే కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే తన పవర్ కు పనిచెప్పారు. నగరం నలుదిక్కులా చెక్ పోస్టులు ఏర్పాటుచేసి, అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ క్రమంలో బంగారం, డబ్బుతో పాటు.. గంజాయి, అక్రమంగా తరలిస్తున్న బియ్యం కూడా పట్టుబడడం విశేషం. పత్రాల్లేకుండా తరలిస్తున్న 23 ఖరీదైన మొబైల్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు పోలీసులు. అధికారికంగా లైసెన్స్ కలిగిన తుపాకీలన్నింటినీ, తాత్కాలికంగా సరెండర్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ తుపాకుల్ని తిరిగి యజమానులకు అందిస్తారు. అంతేకాదు, ఎలక్షన్లు ముగిసేవరకు కొత్త గన్ లైసెన్సులు కూడా జారీచేయకూడదని నిర్ణయించారు.