వారిద్దరూ ప్రతినిత్యం ఒకరినొకరు తిట్టిపోసుకునే, నిందారోపణలతో చెలరేగిపోతూ ఉండే ప్రత్యర్థి పార్టీల నాయకులు!. కానీ, వ్యవహార సరళి విషయానికి వస్తే ఇద్దరూ ఒకే తాను ముక్కలు. ఒకే తరహాలో ప్రవర్తిస్తుంటారు. ఒకే తరహా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒకే స్థాయి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తమ రాజకీయ వైరిపక్షాల పట్ల ఒకే తరహా నిర్లక్ష్యాన్ని, లెక్కలేనితనాన్ని చూపిస్తూఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రధాని నరేంద్రమోడీ అయితే, రెండో వారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
ఇద్దరికీ ఇప్పుడు ఒకేతరహా అవకాశం వచ్చింది. తమ తమ ప్రభుత్వాల ఏలుబడిలో.. చారిత్రాత్మకమైన కట్టడాలను నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ పేరిట సరికొత్త సచివాలయాన్ని చాలా ఘనంగా నిర్మించింది. అదే నరేంద్రమోడీ సర్కారు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనాన్ని కవర్ చేసేస్తూ.. సరికొత్త అత్యాధునికమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించింది.
భారాస, భాజపా పార్టీలు ఈ నిర్మాణాలను తమ తమ ఖాతాల్లో వేసుకుంటాయనడంలో సందేహం లేదు. తమ ఘనత కింద ప్రచారం చేసుకుంటాయి. అదెలా ఉన్నా వీటిని ప్రారంభించే విషయంలోనే ఇద్దరు నాయకుల వైఖరి ఇంచుమించు ఒకేతీరుగా ఉంది.
తెలంగాణలో సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఆ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నరు తమిళిసైని కనీసం ఆహ్వానించలేదు. ఆ వేడుకలో ప్రతిపక్షాల భాగస్వామ్యం కూడా లేదు. ఎంచక్కా తాను ఆ భవనం ప్రారంభించారు. గవర్నరు తమిళిసై పాపం.. నాకు ఆహ్వానం కూడా అందలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
యథా కేసీఆర్.. తథా మోడీ అన్నట్టుగా ప్రస్తుతం నరేంద్రమోడీ కూడా అదేమాదిరిగా చేస్తున్నారు. రాష్ట్రపతికి ఆహ్వానం లేకుండానే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరగబోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి చర్య ద్వారా ద్రౌపది ముర్మును మాత్రమే కాకుండా.. గిరిజనులందరినీ కూడా ప్రధాని అవమానిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా, ప్రధాని ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తామని విపక్షాలు అంటున్నాయి. అయినా ప్రధాని ఖాతరుచేసే పరిస్థితి లేదు.
ఎవ్వరేమైనా అనుకోవచ్చు గాక, తమ ఇష్ట ప్రకారం మాత్రమే చెలరేగుతామని ప్రపంచానికి చాటిచెప్పడంలో కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకే తాను ముక్కలని నిరూపించుకుంటున్నారు.