స‌ర‌దా ఆస్ట్రేలియ‌న్.. షేన్ వార్న్

ముద్దు పేరు హాలీవుడ్. అనార్తొడాక్స్ బౌలింగ్ స్టైల్. వివాదాల‌ను వెంటేసుకు తిరిగే నైజం. బోల్డ్  ఆటిట్యూడ్.  స్పిన్న‌ర్లు కూడా దూకుడుగా ఉంటారు, ఉండొచ్చ‌ని క్రికెట్ ప్ర‌పంచానికి చాటి చెప్పిన వ్య‌క్తిత్వం. చుట్టుముట్టే లేడీ ఫ్యాన్స్…

ముద్దు పేరు హాలీవుడ్. అనార్తొడాక్స్ బౌలింగ్ స్టైల్. వివాదాల‌ను వెంటేసుకు తిరిగే నైజం. బోల్డ్  ఆటిట్యూడ్.  స్పిన్న‌ర్లు కూడా దూకుడుగా ఉంటారు, ఉండొచ్చ‌ని క్రికెట్ ప్ర‌పంచానికి చాటి చెప్పిన వ్య‌క్తిత్వం. చుట్టుముట్టే లేడీ ఫ్యాన్స్ ద‌గ్గ‌ర మొహ‌మాటాల్లేని ఆస్ట్రేలియ‌న్ సెక్స్ సింబ‌ల్! క్రికెట్ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన కెరీర్, క్రికెట్ లో ఆస్ట్రేలియ‌న్ జ‌ట్టు ఆధిప‌త్యంలో కీల‌క పాత్ర‌! బ‌హుశా వార్న్ గురించి చెప్ప‌డానికి ఇవేవీ చాల‌వు. ఇంత‌కు మించి.. వార్న్ గురించి చెబుతున్నారు అత‌డితో జ‌ట్టులో, ప్ర‌త్య‌ర్థులుగా ఆడిన క్రికెట‌ర్లు.

సిస‌లైన ఆస్ట్రేలియ‌న్ షేన్ వార్న్. అలాగ‌ని త‌మ జాతీయ జ‌ట్టు మీద వ్యాఖ్యాత‌గా దురాభిమానాన్ని ప్ర‌ద‌ర్శించే టైపు కూడా కాదు. బోర్డ‌ర్, గ‌వాస్క‌ర్ ట్రోఫీలో స్కై స్పోర్ట్స్ వ్యాఖ్య‌త‌గా వార్న్ కామెంట‌రీ చాలా హుందాగా ఉండేది. ఆట‌గాడిగా దూకుడైన ఆస్ట్రేలియ‌న్ గా అగుపించిన వార్న్ కామెంట‌రేట‌ర్ గా మాత్రం త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపిస్తూ వ‌చ్చాడు. 

ఎప్పుడూ ఫిట్ గా క‌నిపించే వాడు కాదు. కానీ 40 యేళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ఆడాడు. వ‌య‌సులో చిన్న వాళ్లైన గ‌ల్లీ కుర్రాళ్ల‌ను గైడ్ చేసుకుంటూ 2008లో ఐపీఎల్ తొలి ట్రోఫీని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు అందించ‌డం వార్న్ లోని గొప్ప నాయ‌క‌త్వ శైలిని ప‌రిచ‌యం చేసింది. 

ఎవ‌రో డ‌బ్బులిస్తామంటే పిచ్ రిపోర్టును జ‌ట్టులోని త‌న స‌హ‌చ‌రుడు మార్క్ వాతో క‌లిసి లీక్ చేసిన ఘ‌నుడు! అయినా వార్న్ ను ద్వేషించే వారు లేరు ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా!

స్టీవ్ వా,  పాంటింగ్, మార్క్ వా, మెక్ గ్రాత్, గిల్ క్రిస్ట్, బెవ‌న్, లాంగ‌ర్..  క్రికెట్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు స్వ‌ర్గ‌యుగ‌పు సూత్ర‌ధారులు. వార్న్ లేకుండా ఈ జాబితా పూర్త‌య్యే అవ‌కాశం లేదు.

వ‌ర్త‌మానంలో వ్యాఖ్యాతగా మ‌రెంతో వినోదాన్ని పంచాల్సిన షేన్ వార్న్ హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు.  కోవిడ్ ప‌రిస్థితుల త‌ర్వాత .. యాభైల‌లోనే గుండెపోటుతో మ‌ర‌ణించిన మ‌రో ప్ర‌ముఖుడు అనే విష‌యాన్ని కూడా వార్న్ విష‌యంలో ప్ర‌స్తావించుకోవాలి.