విఖ్యాత క్రికెటర్, ఆస్ట్రేలియన్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. థాయ్ లాండ్ లోని తన విల్లాలో వార్న్ మరణించినట్టుగా ఆస్ట్రేలియన్ మీడియా రిపోర్ట్ చేసింది. యాభై రెండేళ్ల వయసున్న వార్న్ హఠాన్మరణంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతోంది. వార్న్ మరణం తమను షాక్ కు గురి చేసింది అంతర్జాతీయ ప్రముఖ క్రికెటర్లు స్పందిస్తున్నారు.
ఆటతోనే గాక.. తన జీవన శైలితో కూడా వార్న్ క్రికెట్ ప్రేమికుల దృష్టిలో ప్రత్యేకంగా నిలిచాడు. ఈ విలాస పురుషుడిని కొన్ని వివాదాలు కూడా వెంటాడాయి. టెస్టు క్రికెట్ లో అద్భుతాలు చేసిన స్పిన్నర్ వార్న్. శ్రీలంక స్పిన్నర్, టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లను సాధించిన మురళీధరన్ తో పోటీపడ్డ బౌలర్ వార్న్. తన కెరీర్ లో కీలకమైన ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కాకపోయి ఉంటే.. బహుశా మురళీకి మరింత దగ్గరగా ఉండేది వార్న్ తీసిన వికెట్ల నంబర్.
ఆటతో పాటు దూకుడైన తీరు విషయంలో కూడా రాజీ పడకుండా కెరీర్ సాగించాడు వార్న్. ఆస్ట్రేలియన్ దేశవాళీ పోటీల సందర్భాల్లో జాతీయ జట్టులో తమ సహచరులు అయిన ఆటగాళ్లతో గొడవ పడటానికి కూడా వెనుకాడే టైపు కాదు.
ఒక వార్న్ పై ఇరవై యేళ్ల కిందట కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలూ వచ్చాయి. వక్షోజాలు చూపించాలంటూ వార్న్ తనపై ఒత్తిడి తెచ్చాడంటూ అప్పట్లో ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆరోపించింది. అలాంటి కేసులన్నీ దూది పింజల్లా తేలిపోయినా.. వార్న్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడటంటూ ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి, గౌరవంగా వీడ్కోలు పలికాడు.
2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ను విజేతగా నిలపడం వార్న్ కెరీర్ లో మరో అద్భుతమైన ఫీట్. ఆ సీజన్లో ఏ మాత్రం అంచనాల్లేకుండా రాజస్తాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. అనామక క్రికెటర్లతో ఐపీఎల్ ట్రోఫీని ఆర్ఆర్ జట్టు గెలవడం సంచలనం రేపింది. కొన్నేళ్ల పాటు ఐపీఎల్ కెరీర్ ను కొనసాగించిన వార్న్ .. ఆ తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు.