ఉత్తరాంధ్రాపై క్షక్ష.. వివక్ష…

ఉత్తరాంధ్రా పై కక్ష కట్టారు. వివక్ష చూపారు. అత్యంత వెనకబడిన ప్రాంతానికి ఏమీ కాకుండా చేయాలని చూశారు. ఇది చంద్రబాబు చేస్తున్న కుట్ర అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమరనాధ్ నిప్పులు…

ఉత్తరాంధ్రా పై కక్ష కట్టారు. వివక్ష చూపారు. అత్యంత వెనకబడిన ప్రాంతానికి ఏమీ కాకుండా చేయాలని చూశారు. ఇది చంద్రబాబు చేస్తున్న కుట్ర అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమరనాధ్ నిప్పులు చెరిగారు. విశాఖకు రాజధానిని రానీయకుండా చంద్రబాబు అన్ని దారులూ వెతుకుతున్నారని ఆయన విమర్శించారు.

విశాఖపట్నాన్ని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఏ రోజు అయినా అభివృద్ధి చేశావా బాబూ అంటూ ఆయన నిలదీశారు. విశాఖకు అభివృద్ధి అన్నది వైఎస్సార్ హయాంలోనే జరిగిందని, జగన్ సీఎం అయ్యాక వెనకబడిన ప్రాంతానికి రాజధానిని తీసుకురావాలనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక వైఎస్సార్ కుటుంబం కంటే విశాఖకు తాను ఎక్కువ చేశాను అని చంద్రబాబు నిరూపించగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని గుడివాడ సవాల్ చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది జగన్ అని ఆయన కొనియాడారు.

కోర్టు తీర్పులను తాము గౌరవిస్తామని, అదే సమయంలో మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ విధానం మారదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక హైకోర్టు తీర్పు తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన అంటూ రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

అయితే మూడు రాజధానుల మీద కోర్టులో కేసులు వేసి ఉత్తరాంధ్రా రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేసిన చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని గుడివాడ ఫైర్ అయ్యారు. మొత్తానికి చంద్రబాబు వల్లనే అంతా జరిగిందని వైసీపీ నేత అంటున్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్రాకు జరగాల్సిన న్యాయం విషయంలో తాము పోరాడుతామని ఆయన స్పష్టం చేస్తున్నారు.