గతంలో గరుడ పురాణం పేరుతో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో ఓ సిరీస్ నడిపారు నటుడు శివాజీ. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెరమరుగయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఆయన కనపడ్డం మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు శివాజీ తెరపైకి వచ్చారు. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కాగా లెక్క ఉన్నట్టు అంకెలతో సహా చెప్పారు. వైసీపీలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ తో ఉన్నారని చెప్పారు శివాజీ. అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదనుకోండి.
అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందడం గ్రామంలో రైతులు నిర్వహించిన విజయోత్సవ సభలో నటుడు శివాజీ పాల్గొన్నారు. అమరావతి కోసం మహిళా రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు శివాజీ. పారిశ్రామికవేత్తలే రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, వారు రాజకీయాలకు దూరంగా ఉంటే దేశానికి ఎలాంటి సమస్యలు రావన్నారు.
ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు శివాజీ. విశాఖ ఉక్కు, అమరావతి, ప్రత్యేక హోదా పరిస్థితి ఏమైందని సీఎంను ప్రజలు ప్రశ్నించాలన్నారు.
జగన్ టార్గెట్ అదే..
2024 నాటికి సీఎం జగన్ మూడు రాజధానులంటూ ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు నటుడు శివాజీ. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. ఓటుకి 50వేల రూపాయలు ఇచ్చినా.. ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. అప్పట్లో శివాజీ చెప్పిన గరుడ పురాణం నిజమవ్వలేదు. ఈసారి చెబుతున్న భవిష్య పురాణం ఏమౌతుందో చూడాలి.