విశాఖ దందా బ్యాచ్‌కు బ్యాండేనా

విశాఖ అందమైన నగరం.  ఎదురుగా సముద్రం ఉంది. అందులో తమింగళాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ విశాఖ నగరంలో మాత్రం పెద్ద ఎత్తున భూములను భోజనం చేసే తిమింగళాలు ఉన్నాయి. Advertisement ఒకరూ ఇద్దరూ…

విశాఖ అందమైన నగరం.  ఎదురుగా సముద్రం ఉంది. అందులో తమింగళాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ విశాఖ నగరంలో మాత్రం పెద్ద ఎత్తున భూములను భోజనం చేసే తిమింగళాలు ఉన్నాయి.

ఒకరూ ఇద్దరూ కాదు, పలుకుబడిని అడ్డం పెట్టుకుని పళ్లెంలో అన్నం నమిలేసినట్లుగా ఏకంగా నాలుగు వందల ఎకరాల భూమిని కాజేశారు. ఇది వైసీపీ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్ధ (సిట్) కనగొన్న గుట్టు.

దాదాపుగా ఏడాది కాలం పట్టింది ఈ భూములను కాజేసిన అనకొండ బండారం బయటపెట్టడానికి, గత ఏడాది అక్టోబర్‌లో రాష్ర్ట ప్రభుత్వం సిట్ పేరిట విశాఖలో భూ భాగోతంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించడానికి నియమించింది.

నిబద్ధత కలిగిన  విశ్రాంతి అధికారి విజయకుమార్ ని చైర్మన్‌గా మరో విశ్రాంతి అధికారిణి వైవీ అనురాధ, భాస్కరరావు సభ్యులుగా సిట్‌ను ఏర్పాటుచేసింది. ఈ సిట్ కరోనా వేళ కొన్ని నెలలు తప్ప గత ఏడాదిగా విశాఖలోనే మకాం వేసి భూ ఆక్రమణల లోతులను కనుగొంది. ఎవరెవరూ అక్రమాలకు పాల్పడ్డాన్నది కూడా పూర్తిగా బయటపెట్టింది.

చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని అధికార యంత్రాంగంతో కలసి చేసిన ఈ దందా వేల కోట్ల ప్రభుత్వ సంపదకు గండి కొట్టిందని కూడా గుర్తించింది. సిట్ విచారణలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. మరెన్నో విషయాలు విస్మయపరచాయి. ప్రభుత్వ భూములను 22 ఏ పేరిట ఉన్న నిషేధ భూములను, ఇతర అవసరాలకు అసైన్డ్ చేసిన భూములను, స్వాతంత్య్ర సమరయోధుల భూములను కూడా ఏ ఒక్కటీ వదలకుండా కబ్జా చేసేశారు.  ఇదంతా అయిదేళ్ల గత తెలుగుదేశం పరిపాలన సమయంలో జరిగిన దందాగా చెబుతున్నారు.

ఒక్క విశాఖ రెవిన్యూ డివిజన్ పరిథిలో మాత్రమే జరిపిన ఈ సిట్ విచారణలో నాలుగు వందల ఎకరాల భూములను కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు వారి సన్నిహితులు, పలుకుబడి కలిగిన పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. సిట్ విచారణాధికారుల ముందుకు దాదాపుగా పద్నాలుగు వందల ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సమగ్రంగా పరిశీలించిన మీదటనే కచ్చితమైన నివేదికను తయారుచేశారని తెలుస్తోంది. అదే విధంగా సిట్ విచారణలో రెవిన్యూ సిబ్బంది ప్రమేయం కూడా  కనుగొన్నారు.

రెవిన్యూ సిబ్బంది సహకారం లేకపోతే 22ఏ నిషేధిత భూములను కబ్జా చేయడం కుదరదని అంటున్నారు. అలాగే, చాలా సులువుగా కబ్జాదారులకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్లు కూడా లభించాయి. ఇదంతా తెర వెనక తతంగంగా జరిగిపోయింది. గతంలో చంద్రబాబు కూడా సిట్ విచారణకు ఆదేశించినా కూడా నివేదికను మాత్రం ఇప్పటికీ బయట పెట్టలేదు.

నాడు విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ విశాఖలో బహిరంగ సభ నిర్వహించి మరీ తాము అధికారంలోకి వస్తే పూర్తి దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు సిట్ విచారణ జరిపించారు. ఇందులో కబ్జాకు గురి అయిన అసైన్డ్ భూములు కానీ, స్వాతంత్య్ర సమరయోధుల భూములు కానీ, ప్రైవేటు స్దలాలు కానీ ఉంటే అసలైన వారికి ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో కబ్జాదారుల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. విశాఖ సిటీలో సెంట్ జాగా కబ్జాకు గురి అయినా తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేయడంతో దందా బ్యాచ్‌కు గుండె దడ పట్టుకుంది.

ఇక స్వపక్షంలోని వారైనా విపక్షంలో ఉన్న పెద్దలైనా కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని విజయసాయిరెడ్డి చెప్పడంతో వారూ వీరూ తేడా లేకుండా భూ బకాసురులు అంతా భయకంపితులు అవుతున్నారు. 

విశాఖను పాలనారాజధానిగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందు కబ్జాల కోటలను కూల్చేస్తున్నారు అంటున్నారు. విశాఖలో స్వేచ్చాయుత వాతావరణం కల్పించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశ్యంగా వైసీపీ నేతలు చెబుతున్నారు.

సిట్ తుది నివేదికను రాష్ర్ట ప్రభత్వానికి సమర్పించిన వెంటనే ఆపరేషన్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వారాంతాలలో విశాఖలోని కబ్జా భూములను అటు రెవిన్యూ అధికారులు, ఇటు జీవీఎంసీ అధికారులూ స్వాధీనం చేసుకంటున్నారు. అక్కడ వాటిని ప్రభుత్వ స్ధలాలుగా పేర్కొంటూ నోటీసు బోర్డులను ఏర్పాటుచేస్తున్నారు.

ఇదిలా ఉంటే సిట్ తుది నివేదికలో ఏముందో ఏ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అన్న చర్చ అయితే విశాఖలో ప్రస్తుతం సాగుతోంది. రాష్ర్ట ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా కబ్జాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకోవడంతో ఓ రకమైన గంభీర వాతావరణం విశాఖ రాజకీయాలలో కనిపిస్తోంది. ఇది తుపాను ముందర నిశ్శబ్దంగా పేర్కొంటున్నారు.

ఒక్కసారి సిట్ నివేదిక బట్టబయలు అయితే విశాఖలో రాజకీయ ప్రకంపనలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా యావత్తు రాష్ర్టమంతా చూసేలా విశాఖ రాజకీయం మారిపోతుందని కూడా చెబుతున్నారు. అసలే విశాఖ రాజధానిగా పేర్కొనడంతోనే గత ఏడాదిగా పెద్ద ఎత్తున రాజకీయంగా నలుగుతోంది.

ఇపుడు సరైన సమయంలో సిట్ నివేదికను బయట పెట్టడం ద్వారా ప్రభుత్వం కాగల కార్యం నెరవేరుస్తుందని అంటున్నారు. మరి ఆ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది కొత్త ఏడాదిలో తేటతెల్లం కావడం ఖాయంగా కనిపిస్తోంది.