ట్రబుల్ షూటర్ అవుతారా? ట్రబుల్ ఫేస్ చేస్తారా?

తెలంగాణ కాంగ్రెసుకు తమ పార్టీలో ఉండే ముఠా తగాదాలు, వర్గ రాజకీయాల మీద అపారమైన నమ్మకం. అందుకే.. పార్టీ అధిపతి రాహుల్ గాంధీ కూడా సన్నాహక సమావేశంలోనే.. ముఠా తగాదాలను వీడి ముందుకు నడవకుంటే…

తెలంగాణ కాంగ్రెసుకు తమ పార్టీలో ఉండే ముఠా తగాదాలు, వర్గ రాజకీయాల మీద అపారమైన నమ్మకం. అందుకే.. పార్టీ అధిపతి రాహుల్ గాంధీ కూడా సన్నాహక సమావేశంలోనే.. ముఠా తగాదాలను వీడి ముందుకు నడవకుంటే కఠిన చర్యలు ఉంటాయని చాలా ఘాటుగానే హెచ్చరించారు. 

ఇప్పుడు అభ్యర్థుల జాబితా తుదిరూపం సంతరించుకుంటున్న సమయంలో కూడా ఆ పార్టీ నాయకుల్లో పెచ్చరిల్లగల అసంతృప్తుల భయమే ఎక్కువగా కనిపిస్తోంది. టికెట్ల ప్రకటన తర్వాత.. అసంతృప్తితో వేగిపోయే నాయకులను బుజ్జగించే ట్రబుల్ షూటర్ పని కోసం ప్రత్యేకంగా ఒక ఫోర్ మెన్ కమిటీని ఏర్పాటుచేశారు.

ఈ ట్రబుల్ షూటింగ్ కమిటీలో జానారెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉంటారు. నిజం చెప్పాలంటే.. పార్టీలో ఎంతో సీనియర్ నాయకుల్లో ఒకరైన జానారెడ్డికి పార్టీ అప్పగించిన అత్యంత కీలక బాధ్యత ఇది. ఆ మేరకు ఆయన కూడా గాంధీ భవన్లో ఓ సమావేశం పెట్టుకుని.. అసంతృప్తులు ఉండగల నియోజకవర్గాల గుర్తించే కసరత్తు చేశారు కూడా.

అయితే ఇక్కడ పార్టీలో చర్చనీయాంశంగా ఉన్న అంశం ఏంటంటే.. జానారెడ్డి పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు, పెద్దమనిషి అనడంలో సందేహం లేదు. కానీ.. అసంతృప్తితో రగిలే వారు.. ఆయన మాటలకు చెవిఒగ్గుతారా? అనేదే ప్రశ్న. జానారెడ్డి అనుభవజ్ఞుడే గానీ.. ఆవేశంలో రగులుతున్న వారిని ఒప్పించగల మాట చాతుర్యం ఆయన వద్ద ఉన్నదా అనేది అందరికీ సందేహం.

సాధారణంగా అసంతృప్తులను మీకు ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తాం అనే మాటలతో బుజ్జగించాల్సి ఉంటుంది. అన్యధా వారిని బుజ్జగించడం అసాధ్యం. అలాంటప్పుడు.. పార్టీలో విపరీతమైన ప్రభావశీలి అయిన నాయకుడు అయి ఉంటే.. తాను ఇచ్చిన హామీకి కట్టుబడేలా అధిష్ఠానాన్ని ఒప్పించి పదవులు ఇప్పిస్తాడు అని నమ్మకం కలిగించగల నాయకుడు చెబితేనే అసంతృప్తులు వింటారు. 

కర్ర విరగకుండా పాము చావకుండా.. పైపై మాటలు చెబితే ప్రయోజనం ఉండదు. అందుకే బుజ్జగింపుల కీలక బాధ్యతను నెత్తినేసుకున్న జానారెడ్డి.. ట్రబుల్ షూటర్ అనిపించుకుంటారా? ట్రబుల్స్ కొనితెచ్చుకుంటారా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.