కాషాయ నేతకు తత్వం బోధపడిందా…?

రాజకీయాలు అంటే ఆశలు అవకాశాల మధ్య ఊగిసలాట. ఈ రెండింటినీ సరిచూసుకుంటూ సరిగ్గా అంచనా వేసుకున్నా ఎక్కడో  దెబ్బ పడిపోతుంది. రాజకీయాల్లో ప్రతీ అడుగూ ఆచీ తూచీ వేయాలి. ప్రతీ మాటా జాగ్రత్తగా వాడాలి.…

రాజకీయాలు అంటే ఆశలు అవకాశాల మధ్య ఊగిసలాట. ఈ రెండింటినీ సరిచూసుకుంటూ సరిగ్గా అంచనా వేసుకున్నా ఎక్కడో  దెబ్బ పడిపోతుంది. రాజకీయాల్లో ప్రతీ అడుగూ ఆచీ తూచీ వేయాలి. ప్రతీ మాటా జాగ్రత్తగా వాడాలి. కాంట్రాక్ట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెద్దల దయతో ఎమ్మెల్యే టికెట్ సంపాదించి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయిపోయారు విష్ణు కుమార్ రాజు. ఆయనది గోదావరి జిల్లా.

విశాఖ రాజకీయంగా ఆదరించింది. బీజేపీ అక్కున చేర్చుకుంది. తొలిసారి ఎమ్మెల్యే అని చూడకుండా ఫ్లోర్ లీడర్ ని చేసింది. పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టింది. 2019లో బీజేపీ టీడీపీ పొత్తు విడిపోయింది. అప్పట్లోనే రాజు గారు పార్టీ మారుతారు అని ప్రచారం జరిగింది. విశాఖ ఉత్తరం నుంచి టీడీపీకి వైసీపీకి క్యాండిడేట్లు ఫిక్స్ కావడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేశారంటారు.

ఇపుడు 2024 ఎన్నికలు ముందున్నాయి. రాజు గారు టీడీపీని చంద్రబాబుని పొగుడుతూ వచ్చారు. పొత్తులు ఉండాలని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు. దానికి పార్టీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. దీంతో ఆయన పార్టీ మారుతారు అని ప్రచారం ఊపందుకుంది. అది జరిగేదేమో కానీ టీడీపీలో ప్లేస్ లేదు, మాజీ మంత్రి గంటా మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

రాజకీయంగా కొంత మార్పు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తులకు బీజేపీ సుముఖంగా ఉందని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో తాను పార్టీ మారబోతున్నట్లుగా వచ్చిన వార్తల మీద క్లారిటీ ఇచ్చారు. అంతా మీడియా సృష్టి అని వారి మీదకె నెపం నెట్టేశారు. బీజేపీలో ఉంటాను అని ఒట్టేశారు. వైసీపీని సోము వీర్రాజు జీవీఎల్ లాంటి వారే బాగా విమర్శిస్తున్నారు కాబట్టి రాజు గారూ గొంతు పెంచారు.

పొత్తులు ఉంటే ఉత్తరం సీటుని ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేసి అయినా ఇస్తారని రాజు గారు ఆశతో ఉన్నారని అంటున్నారు. ఆ మధ్యదాకా  మీడియా ముందుకు వచ్చి ఫైర్ బ్రాండ్ ట్యాగ్ కోసం పోటీ పడిన పెద్దాయన ఇపుడు తత్వం బోధపడినట్లుగా ఆచీ తూచీ మాట్లాడుతున్నారని అంటున్నారు. కమలం పార్టీలో ఉంటేనే ఏదైనా కలసి వస్తుందన్న సత్యం వంటబట్టిందని అంటున్నారు.