Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాజమౌళి సినిమాతో మహేష్ కి ఎంత సుఖమో

రాజమౌళి సినిమాతో మహేష్ కి ఎంత సుఖమో

మహేష్ బాబు కి మిల్క్ బాయ్ అని పేరు. నిజంగానే ఎండ తగిలితే కందిపోయేటంత చర్మసౌందర్యం అతనిది. ఆ ప్రత్యేకతని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి కాకముందు, కెరీర్ తొలినాళ్లల్లో సగటు యువహీరోలాగ ఒళ్లొంచి ఫైట్లు గట్రా చేసినా క్రమంగా అవి తగ్గిస్తూ వచ్చి ఇప్పుడు ఎక్కువగా అలవకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాడన్నది ఇండష్ట్రీ టాక్. 

ఆ మధ్యన "మహర్షి" షూటింగ్ టైములో గేదెలతో ఒక సీన్ చేయాల్సి వచ్చింది. మహేష్ మండుటెండలో ఆ సీన్ చేయనన్నాడని ఏసీ ఫ్లోరులో సెట్టు వేయించి, గేదెల్ని కూడా అందులోకి తోలుకెళ్ళి పని మునించాల్సొచ్చింది యూనిట్ కి. 

ఈ మధ్యన త్రివిక్రం సినిమా మొదలైనప్పుడు తొలుత ఫైట్ మాష్టర్లు తనని కష్టపెట్టారని మార్చిపారేసి తన బాడీకి, బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఫైట్స్ కంపోజ్ చేసే వాళ్లని పెట్టుకున్నాడు మహేష్. అలా సాధ్యమైనంత వరకు సుఖాన్ని కోరుకునే హీరో మరి. 

ఇప్పుడీ సూపర్ స్టార్ రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. అతనితో సినిమా అంటే మామూలుగా ఉండదని అందరికీ తెలుసు. 

"బాహుబలి" టైములో ఫిజిక్ మెయింటేన్ చెయ్యాలన్న డిమాండుకి, నానా రకాల ప్రొటీన్ డైట్ ప్లాన్స్, జిం వర్కౌట్స్ చేసి రాణా కిడ్నీలు పాడుచేసుకున్నాడు.  ప్రభాస్ మోకాళ్ల నొప్పులతో బాధపడ్డాడు. రాజమౌళి షూటింగులంటే అదొక ఆర్మీ క్యాంపు లాంటిదంటారు చాలామంది. 

"ఆర్ ఆర్ ఆర్" విషయంలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ కూడా చాలా కష్టపడ్డారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ల ధాటికి, రోప్ వర్క్ దెబ్బకి ఇద్దరికీ చాలానాళ్లు నడుం నొప్పులు వేధించాయని చెప్పుకున్నారు. అయితే రాణా, ప్రభాస్ స్థాయిలో వీళ్ల శరీరాలు దెబ్బ తినలేదు. కాస్త నిలదొక్కుకోగలిగారు. 

మరి ఈ నేపథ్యంలో ఎండకెన్నెరగని సుకుమారుడు మహేష్ బాబు రాజమౌళి మిలిటరీ క్యాంపుని ఎలా తట్టుకోగలడనేది చాలామంది వర్రీ. నలుగురు హీరోలు తన కళ్ల ముందే శరీరాల్ని బాధపెట్టుకుని నటించినప్పుడు అసలు రాజమౌళి సినిమా ఆఫర్ ని ఎలా ఒప్పుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. పైగా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయట.  

ఇక్కడొక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. 

నిజానిజాలు అధికారికంగా తెలియకపోయినా ఒకటి మాత్రం బలంగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో. అదేంటంటే రాజమౌళి తీయబోయే మహేష్ చిత్రమంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎక్కువగా జరుగుతుందట. అంటే ఏమిటా అనుకోవచ్చు. 

మనం "అవతార్" చూసాం. అందులో ఒకసారి క్యారెక్టర్ ఇమేజ్ సృష్టి జరిగిపోయాక మోషన్ కాప్చర్లో ఎవరు నటించినా ఒకటే. అయితే అవి యానిమేషన్ తరహా ఇమేజులు, ఇప్పుడు రాజమౌళి అమలుపరుస్తున్నది యథాతధమైన మహేష్ బాబు ఇమేజ్ ను అని చెబుతున్నారు. ఏది నిజంగా మహేష్ బాబు నటించిన సీనో, ఏది మోషన్ క్యాప్చరో తెలియని స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. అంటే మహేష్ బాబుని 360 డిగ్రీస్ లో ప్రతి యాంగిల్లోంచి ఇమేజింగ్ చేసేస్తారు. అవసరమైన క్లోజప్పులు గట్రా అతని మీద షూట్ చేస్తారు. లాంగ్ షాట్స్, ఎడ్వెంచర్ సీన్స్, ఫైట్లు అన్నీ మోషన్ క్యాప్చర్లే. మహేష్ ది ఎంత సుఖమయ జీవితమో చూడండి! ఇది నిజం కావాలనే కోరుకుందాం. ఎందుకంటే రాజమౌళి ఇలాంటి ఫీట్స్ చేస్తేనే మరో మెట్టెక్కుతాడు. 

మరీ అంత రియలిస్టిక్ గా మోషన్ క్యాప్చర్ సీన్లు తీయడం అసాధ్యమని వాదించేవాళ్లు ఉండొచ్చు. వారికి యూట్యూబులో ఉన్న ఒక వీడియో సజెస్ట్ చేస్తున్నాను. "Audrey Hepburn Galaxy Ad" అని టైప్ చేసి చూడండి. ఆ ఆడ్రీ హెప్ బర్న్ అనే నటి 1929లో పుట్టి 1993 లో 63 ఏళ్ల వయసులో పోయింది. ఆవిడని పెట్టి ఈ గెలాక్సీ యాడ్ ని సుమారుగా 2012 ప్రాంతంలో షూట్ చేసారు..అది కూడా 1953 నాటి హెప్ బర్న్ రూపంతో. ఇందులో వింతేమీ లేదు. సి.జి.ఐ లో ఇదొక ప్రయోగం అంతే. ఎంత కన్విన్సింగ్ గా ఉంటుందో చూడండి. 

ఎప్పుడో దశాబ్దం క్రితమే అంత రియలిస్టిక్ గా ఒక యాడ్ షూట్ చేసినప్పుడు, ఇప్పుడు 2023-24లో రాజమౌళి అంతకన్నా రియలిస్టిక్ గా సినిమా తీయలేడా! 

ఇదే నిజమైతే మహేష్ బాబు అదృష్టవంతుడని చెప్పాలి. షూటింగ్ కి వెళ్లే పని దినాలు తక్కువ, ఒంటి శ్రమ తక్కువ, ఆదాయం మాత్రం చాలా ఎక్కువ.

అయితే తాను పెద్దగా పనిచేయని ఈ సినిమా ముగిసే వరకు మరొక సినిమా షూటింగ్ చేయకూడదు అనేలాంటి బలమైన అగ్రీమెంట్స్ ఉంటాయి. కనుక రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు మహేష్ కి లాంగ్ పెయిడ్ వెకేషన్ ఉండొచ్చేమో. 

ఇవన్నీ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కబుర్లు. ఇందులో నిజమెంత, సగం నిజమెంత అనేది కాలమే చెప్పాలి. కానీ ఊహించుకోవడానికి మాత్రం చాలా గొప్పగా ఉంది. ఇదే నిజమైతే ఈ ఒక్క పాయింటుతో రాజమౌళి-మహేష్ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుంది. పనిలో పనిగా చనిపోయిన శ్రీదేవిని 1989 లుక్కులోనూ, సావిత్రిని 1957నాటి కలర్ లుక్కుతోనూ, లేదా మరొక అలనాటి నటినో నటినో మళ్లీ పుట్టించి ఈ సినిమాలో జీవింపజేస్తే ఇక రాజమౌళి పేరు సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుంది. అలాంటి మార్కెటింగ్ కి పనికొచ్చే పనేమైనా సీజీ సాయంతో రాజమౌళి చెస్తాడేమో చూద్దాం. 

శ్రీనివాసమూర్తి(USA)

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా