నరేంద్రమోడీని గద్దె దించాలనే ఎజెండా ఎంతమందికైనా ఉండవచ్చు గానీ.. అందుకోసం చేస్తున్న ప్రయత్నాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కే కాస్త సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తోంది.
మోడీని గద్దె దించడానికి కాంగ్రెస్ సారథ్యంలోని రెండో కూటమి మాత్రమే ఐక్యంగా పోరాడాలని, మూడో కూటమి ఉండరాదనే ఎజెండాతో దేశమంతా తిరుగుతూ పాటుపడుతున్న నితీశ్.. ఆ విషయంలో సఫలం అవుతున్నారు. మామూలు పరిస్థితుల్లో కాంగ్రెస్ గొడుగు కిందకు రావడానికి అంత సుముఖంగా ఉండని పార్టీలను కూడా.. ఆయన దారిలోకి తెస్తున్నారు. మొత్తానికి నితీశ్ మంత్రాంగం మంచి ఫలితాలనే ఇస్తోందని.. కాంగ్రెస్ జాతీయ రాజకీయ పరిణామాలను గమనిస్తున్న కార్యకర్తలలో ఆశలు రేగుతున్నాయి.
కాంగ్రెసు పార్టీ సింగిల్ గా ఎంత బలోపేతం అవుతున్నదో అప్పుడే తేల్చిచెప్పలేం గానీ.. మోడీ విపక్ష కూటమి మాత్రం ఐక్యగానం ఆలపిస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోడీని గద్దెదించాలని కలగొంటున్న వారిలో కేసీఆర్ మినహా మిగిలిన అందరూ కూడా కాంగ్రెస్ గొడుగు కిందకు వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కష్టం అని చెప్పాలి.
మోడీ వ్యతిరేక కూటమికి తామే సారథ్యం వహించాలనే కల విపక్ష నాయకుల్లో చాలా మందికి ఉండేది. అలాటి కోరికే విపక్షాల అనైక్యతకు కూడా కారణం. కేసీఆర్ విషయంలో కూడా తాను ప్రధాని కావాలని ఆయన కోరుకుంటుండడం వల్లనే ఆయన తరచూ ద్వితీయ అనేది వదిలేసి, తృతీయ కూటమి మాటెత్తుతుంటారు.
ఆ సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష కూటమి మోడీ సర్కారును ఎదుర్కోవాలనే వాదనను నితీశ్ కుమార్ ముందుకు తీసుకువెళ్తున్నారు. తరచూ కాంగ్రెస్ నాయకులు, ఇతర విపక్షాలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ కూడా కాస్త మెత్తబడ్డారు.
ప్రధాని రేసులో కేజ్రీవాల్ కూడా ఉన్న నేపథ్యంలో ఆయనతో నితీశ్ రాయబారం తాజాగా ఫలితమిస్తున్నట్టుంది. ఢిల్లీ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం వేలు పెట్టడం, కేజ్రీవాల్ కాంగ్రెస్ కు దగ్గర కావడానికి దారితీస్తోంది. కేంద్ర ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ కు మద్దతు ఇచ్చింది. నితీశ్ కుమార్ , కేజ్రీవాల్ తో భేటీ అయిన తర్వాతనే ఈ పరిణామంచోటు చేసుకోవడం విశేషం.
నితీశ్ అందరినీ ఒక్కతాటిపైకి తేగలుగుతున్నారు. కేసీఆర్ తప్ప.. మోడీని వ్యతిరేకిస్తున్న విపక్ష నాయకులందరూ కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి సానుకూలంగానే మారుతున్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై పోరాటం విషయంలో కేసీఆర్ ఒంటరి అవుతారేమో అని కూడా అనిపిస్తోంది. మొత్తానికి నితీశ్ మడమతిప్పని, అలుపెరగని ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి.