ఓవైపు రెండో రకం కరోనా విజృంభిస్తున్న వేళ, కొవిడ్ టీకాకు భారత ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి ఇంకా లభించలేదన్న వార్తలతో వాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
కానీ కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. డ్రై-రన్ పేరుతో అవగాహన కార్యక్రమాలను చేపడుతూ వాక్సినేషన్ పై కొత్త ఆశలు రేకెత్తించింది. అదే ఊపులో టీకా వేయడానికి అవసరమైన మెటీరియల్ ని కూడా రాష్ట్రాలకు పంపిస్తోంది.
కొవిడ్ వ్యాక్సినేషన్ కు అవసరమైన సామగ్రి.. ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. 43 లక్షల డిస్పోజబుల్ సిరంజీలు పంపిస్తామని ఏపీకి హామీ ఇచ్చిన కేంద్రం, తొలి విడతలో భాగంగా 34లక్షల సిరంజీలను పంపించింది. వ్యాక్సినేషన్ కు అవసరమైన 0.5 మిల్లీలీటర్ల సామర్థ్యం ఉన్న సిరంజీలను పంపించింది.
టీకా నిల్వ కోసం ఉపయోగించే పెద్ద పెద్ద ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు కూడా ఏపీకి చేరాయి. మొత్తం 36 రిఫ్రిజిరేటర్లను కృష్ణా జిల్లా గన్నవరంలోని వ్యాక్సిన్లు భద్రపరిచే ప్రధాన కేంద్రానికి చేర్చారు. రేపటి నుంచి వీటిని ఇతర కేంద్రాలకు తరలిస్తారు.
డ్రై-రన్ కి ఏర్పాట్లు పూర్తి..
రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో కొవిడ్ వాక్సినేషన్ కి సంబంధించి డ్రై-రన్ నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని 5 కేంద్రాలను దీని కోసం ఏర్పాటు చేశారు.
ఈ ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ట్రైల్ రన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డ్రై రన్ లో వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా టీకా పంపిణీకి సన్నద్ధం అవుతారు అధికారులు.
కొవిడ్ వ్యాక్సిన్ కి అత్యంత భారీ భద్రత..
టీకా వస్తే దానికి అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. టీకా నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానించడం, ప్రతి కేంద్రంలో పోలీస్ బందోబస్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గర్భిణులు, చిన్నారులకు టీకా వేసేందుకు 51 వాహనాలు సిద్ధం చేశారు. ఇందులో టీకా నిల్వచేసే సామగ్రితో పాటు.. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయి. ప్రతి వాహనంతో ఓ పోలీస్ బందోబస్తుగా వెళ్తారు. దీన్నిబట్టి టీకాని ఎంత భద్రంగా పంపిణీ చేస్తారనే విషయం అర్థమవుతోంది.
ప్రస్తుతం కేంద్రం జోరు చూస్తుంటే జనవరిలో అనుమతులిచ్చేసి, టీకా పంపిణీకి కూడా ఏర్పాట్లు మొదలు పెడుతుందని తెలుస్తోంది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది కాబట్టే.. ఏపీలో టీకా పంపిణీ ఇతర రాష్ట్రాలలో కంటే మరింత మెరుగ్గా, సజావుగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.