ఏపీకి ప్రత్యేక హోదా. ఇది అరిగిపోయిన రికార్డు లాంటి డిమాండ్. ఒక విధంగా జనాలలో నీరసమే కాదు నిర్వేదం కూడా వస్తోంది. ప్రత్యేక హోదా అన్న మాట ఏపీ జనాల చెవుల పడి ఇప్పటికి ఎనిమిదేళ్ళు గడచింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ అయితే హోదా ముగిసిన అధ్యాయం అని పక్కన పెట్టేసింది.
అయితే ఇది డిమాండ్ చేసి ఏపీ అభివృద్ధికి సాధించాల్సిన అంశమని అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు అన్నది నిష్టుర సత్యం. ఇక ఎన్నికల వేళ కానీ ప్రత్యర్ధులను ఇరుకున పెట్టేందుకు కానీ ప్రత్యేక హోదాను ముందుకు తెస్తూ ఉంటారు అని కూడా విమర్శగా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు సాధించే విషయమై విశాఖలో రౌండ్ టేబిల్ సమావేశం ఏర్పాటు చేశారు. హోదా సాధన సమితి ఆద్వర్యాన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబిల్ సమావేశం ద్వారా మరో మారు ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రగిలించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక చూస్తే ఏపీలో హోదా ఉద్యమం ఇప్పటికి చాలా సార్లు జరిగింది. బంద్ లు కూడా చేశారు. మరి ఇపుడు మళ్లీ దీని మీద కార్యాచరణకు రెడీ అవుతున్నారు. ఈ రోజుకు అయినా ఇది హక్కుగా రాష్ట్రానికి సాధించే విధంగా పోరాట పంధా ఉంటే ఫరవాలేదు, అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమో, మరో దాని కోసమో హోదాను ముందుకు తెస్తే మాత్రం హోదా అన్నది ఎవరికి సంజీవిని అన్నది జనాలకు ఇంకా బాగా అర్ధమైపోతుంది.
ఏది ఏమైనా హోదా రావాలంటే కేంద్రాన్ని నిలదీయాలి. టార్గెట్ కూడా సరిగ్గా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలి అన్నదే జనం మనోగతం.