రాకీ భాయ్ ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన పంచ్ పవర్ ను కొద్దిగా రుచి చూపించబోతున్నాడు. అవును.. కేజీఎఫ్ 2 సినిమాకు సంబంధించి ఈనెల 27న ట్రయిలర్ రాబోతోంది. అందులో రాకీ భాయ్ గా యష్ విశ్వరూపాన్ని కొద్దిగా చూపించబోతున్నారు.
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతోంది. అంతకంటే ముందే ట్రయిలర్ తో అంచనాలు పెంచబోతోంది యూనిట్. సినిమాలో కేజీఎఫ్ కుంభస్థలాన్ని కొట్టిన రాకీ భాయ్.. ఆ తర్వాత కింగ్ గా ఎలా మారాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన రాజకీయ, మాఫియా అడ్డంకులేంటి? వాటిని రాకీ భాయ్ ఎలా అధిగమించాడనే విషయాల్ని పార్ట్-2లో చూపించబోతున్నారు.
ఇండియన్ హిస్టరీలో హీరోయిజంను పీక్ స్టేజ్ లో చూపించిన సినిమాగా కేజీఎఫ్ చరిత్ర సృష్టించింది. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ సమపాళ్లలో సింక్ అయితే ఎలా ఉంటుందో కేజీఎఫ్ రుచిచూపించింది. ఇప్పుడు అవే ఎలిమెంట్స్ ను పార్ట్-2లో కూడా రిపీట్ చేయబోతున్నారు.
ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్టవ్వడం, పాన్ ఇండియా అప్పీల్ రావడంతో పార్ట్-2 లో సంజయ్ దత్, రవీనా లాంటి బాలీవుడ్ స్టార్స్ ను తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన కేజీఎఫ్ 2 సినిమా ఈనెల 27 నుంచే ట్రయిలర్ తో తన ప్రతాపం చూపించబోతోందన్నమాట.