రాజధానికి కేంద్రం నిధులు.. బంతి జగన్ కోర్టులోనే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనే అంగీకారాన్ని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించినట్లే. అమరావతిలో రాజధాని నిర్మాణానికి అవసరమైన లెక్కలను బడ్జెట్ లోకి తీసుకు వచ్చారు. సెక్రటేరియట్, ఉద్యోగుల క్వార్టర్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలాంటి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనే అంగీకారాన్ని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించినట్లే. అమరావతిలో రాజధాని నిర్మాణానికి అవసరమైన లెక్కలను బడ్జెట్ లోకి తీసుకు వచ్చారు. సెక్రటేరియట్, ఉద్యోగుల క్వార్టర్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలాంటి కొన్ని నిర్మాణాలు చేపట్టడానికి రెండున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని లెక్క కట్టారు.  

బడ్జెట్ లెక్క లోకి తీసుకురావడం అంటే.. ఆ మేరకు నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకున్నట్లే. ఈ మొత్తం నిర్మాణాలు కలిపి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించింది. రెండున్నర వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోల్చినప్పుడు, ఐదు లక్షల రూపాయల కేటాయింపు అనేది ముష్టి వేసినట్లు గా అనిపిస్తుంది కానీ..  ఇది అసహజం కాదని నిపుణులు అంటున్నారు. నామమాత్రంగా డబ్బులు ఇచ్చినప్పటికీ.. లెక్కల్లో పేర్కొన్న మేరకు నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లే అర్థం చేసుకోవాలని అంటున్నారు.

అమరావతి రాజధాని ఈ ప్రాంతంలో ఈ నిర్మాణాలు చురుగ్గా సాగడానికి, కేంద్రం నుంచి కనీసం రెండున్నర వేల కోట్ల రూపాయల నిధులను సత్వరం పొందడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉంది. సెక్రటేరియట్ గాని, కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న ఇతర భవనాలు గాని నిర్మించడానికి  రాష్ట్ర ప్రభుత్వం డి పి ఆర్ తయారుచేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా డిపిఆర్ లు పూర్తి చేసి కేంద్రానికి సబ్మిట్ చేస్తే అంత త్వరగా అక్కడి నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే  చాలా స్పష్టంగా ఇప్పుడు బంతి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టు లో ఉన్నట్టు లెక్క!

అమరావతిలో పూర్తిస్థాయి రాజధానిని నిర్మించడానికి ముఖ్యమంత్రి జగన్ అనుకూలంగా మారారా లేదా అనే విషయంలో ఎవరికి స్పష్టత లేదు! మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారుగానీ, ఆ ఆలోచన విరమించుకున్నట్లుగా ఎన్నడూ చెప్పలేదు!  ఏ క్షణంలోనైనా కోర్టు కేసుల తలనొప్పి ఉండే అవకాశం లేని రీతిలో మళ్లీ కొత్త గా మూడు రాజధానులు బిల్లు తయారుచేసి సభ ముందుకు తెస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అమరావతి ప్రాంతంలో సగం లో ఉన్న నిర్మాణాలు కొనసాగడానికి కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు, ఆ ప్రాంతాన్ని ఆయన పూర్తిస్థాయి రాజధానిగా ఆమోదిస్తున్నట్లు సంకేతం అనుకోవడానికి వీలు లేదు. 

కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అక్కడ సెక్రటేరియట్, మరికొన్ని నివాస భవనాలు, రాజధాని ప్రాంతంలో ఉండదగిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు.. ఇలాంటివన్నీ కూడా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంటోంది. జగన్ మూడు రాజధానులు ఆలోచన ఉన్నప్పటికీ..  కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిధులను చేజార్చుకోవడం సబబు కాదు. వీలైనంత తొందరగా డిపిఆర్ లు సమర్పించి, నిధులు రాబట్టి నిర్మాణాలు చేస్తే..  ప్రభుత్వానికి ఏదో ఒక అవసరానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. 

జగన్ అనుకుంటున్నట్లుగా కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలించినా సరే..  ఇక్కడి భవనాలు వృధాగా పోయే ప్రమాదం ఏమీ ఉండదు. ఇతర అవసరాలకు వాటిని వినియోగించుకోవచ్చు. కానీ అసలే ఆంధ్ర ప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఇప్పుడు కాకుండా, ఇంకొకసారి అయినా సరే నిధులు తెచ్చుకోగలం అని అనుకుంటే పొరబడినట్లే.  

ప్రత్యేక హోదా దగ్గరినుంచి అనేక రూపాలలో ఆంధ్ర ప్రదేశ్ ను వంచించిన కేంద్ర ప్రభుత్వం,  ముందు ముందు ఎన్ని రకాల మాయోపాయాలు చేస్తుందో ఎవరికీ తెలియదు. ‘ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి’ అనే సామెత చందంగా..  కేంద్రం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వాటిని రాబట్టుకోవాలి.. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే నష్టపోయేది రాష్ట్రమే!