తెలంగాణలో హత్యా రాజకీయాలు మొదలవుతున్నాయా?

రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు ఎలా ఉన్నప్పటికీ.. ఒకరి వెనుక ఒకరు రాజకీయంగా గోతులు తవ్వడం, ఒకరి పతనానికి మరొకరు కుట్రలు చేయడం వరకు పరిమితం అవుతుంటారు. రాజకీయంగా పైచేయి సాధించడం కోసం,…

రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు ఎలా ఉన్నప్పటికీ.. ఒకరి వెనుక ఒకరు రాజకీయంగా గోతులు తవ్వడం, ఒకరి పతనానికి మరొకరు కుట్రలు చేయడం వరకు పరిమితం అవుతుంటారు. రాజకీయంగా పైచేయి సాధించడం కోసం, ప్రత్యర్థి నాయకులను హత్యలు చేయించడం అనేది వర్తమాన రాజకీయ ప్రపంచంలో కనిపించడం లేదు. చాలా చాలా కాలం కిందట ఇలాంటి రాజకీయ హత్యలు ఉండేవి కానీ, ఇటీవలికాలంలో ఆ ఊసు లేదు. కానీ ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలను గమనిస్తే.. హత్యా రాజకీయాలు మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నాయా అనే అభిప్రాయం కలుగుతుంది.  

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పథక రచన సాగడం, ఆ కేసులో అనుమానితుల్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోని సర్వెంట్ క్వార్టర్స్లో పోలీసులు అరెస్టు చేయడం.. ఆయన ఇంటి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం.. మరో మాజీ మంత్రి మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం.. ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు తెలంగాణలో హత్యా రాజకీయాలు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయా అనే అనుమానం కలుగుతోంది.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనమే. మంత్రిని చంపడానికి ఏకంగా 15 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చి.. ఒక గ్యాంగ్ నియమించారంటే.. దీని వెనుక ఏ స్థాయి పెద్దలు ఉంటారో అర్థం చేసుకోవచ్చు. హత్యకు ఒప్పుకున్న వారు.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి క్వార్టర్స్ లో ఆశ్రయం పొందినట్లుగా పోలీసులు వివరాలు రాబట్టారు. వారి విచారణలో జితేంర్ రెడ్డి డ్రైవర్, పీఏ లే వారికి షెల్టర్ ఏర్పాటు చేసినట్టు బయటకు వచ్చింది. ఆ స్థాయి నాయకుడికి తెలియకుండానే.. ఆయన వద్ద పనిచేసే డ్రైవర్, పీఏ ఇంతటి సాహసానికి ఒడిగడతారని, కిరాయి హంతకులకు షెల్టర్ ఇస్తారని నమ్మడం కష్టమే. 

సుపారీ హత్యకు ప్లాన్ చేశారని పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు గానీ.. ఖచ్చితంగా ఫలానావాళ్లు ఆ సుపారీ ఇచ్చినట్టుగా బయటపెట్టలేదు. ఈ కుట్రలో జితేందర్ రెడ్డి పాత్ర గురించి కూడా విచారణ జరుపుతామని మాత్రం అన్నారు. అదే సమయంలో.. నల్గొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి డికె అరుణ అనుచరుల మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం.

యాదృచ్ఛికం ఏంటంటే.. జితేందర్ రెడ్డి, అరుణ ఇద్దరు నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. తెలంగాణ రాజకీయాల కోణంలో చూసినప్పుడు.. ఈ ముగ్గురు నాయకులు కూడా ఒకే జిల్లాకు చెందిన వారు. రాజకీయ కారణాల దృష్ట్యా పోలీసులు అనుమానిస్తున్న ఇద్దరు నాయకులూ.. కేసీఆర్ ఉధృతిని తట్టుకోలేక బిజెపిలో ఆశ్రయం పొందుతున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది. 

సాధారణంగా.. చాలా హత్యల గురించి రాజకీయ హత్యలు అనే ప్రచారమే జరుగుతూ ఉంటుంది. కార్యకర్తల మద్య తగాదాల పర్యవసానంగా ఎక్కువ హత్యలు జరుగుతుంటాయి. వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారిగా.. వారి మధ్య విభేదాలు ఉండేప్పటికీ.. కేవలం రాజకీయ తగాదాలు మాత్రమే.. హత్య దాకా నడిపించే సందర్భాలు చాలా తక్కువ. ఈ రాజకీయ విభేదాలకు ఇతర వ్యక్తిగత కారణాలు కూడా తోడై హత్య దాకా వెళుతుంటాయి. రాజకీయ సంబంధాలు ఉన్నవారు చనిపోతే చాలు.. రాజకీయ హత్యగానే ప్రచారం జరుగుతుంటుంది. ఇదంతా ఒక ఎత్తు.. అయితే.. ఏకంగా మంత్రిని చంపించడానికి మాజీ మంత్రి, మాజీ ఎంపీ కుట్ర చేస్తున్నారంటూ గుసగుసలు గుప్పుమనడం మరో ఎత్తు. 

ఇటీవలి కాలంలో ఇంత పెద్ద సంచలనాత్మక హత్యకు కుట్ర జరగడం ఎన్నడూ చూడలేదు. గత కొన్ని సంవత్సరాలలో.. వివేకానందరెడ్డి హత్య పెద్ద సంచలనం కాగా, అది రాజకీయ కారణాలతో జరిగిందా? వ్యక్తిగత కారణాలతోనా? అనేది ఇంకా తేలడం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరగడం వెనుక అసలు కారణాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.

ఈ స్థాయి రాజకీయ హత్యలకు కుట్రరచన జరగడం అనేది.. తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని బాగా కలుషితం చేస్తుంది. జితేందర్ రెడ్డి గురించి పోలీసు అనుమానాలు వెలికి రాగానే.. కొందరు ఆయన నివాసం మీద దాడిచేసి .. కారు అద్దాలు పగులగొట్టి చిన్న బీభత్సం చేశారు. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరినొకరు ఎంత నీచంగా తిట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నప్పటికీ.. హత్యల దాకా వెళ్లడం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగలేదు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త సంస్కృతి మొదలవుతోందా? అనే భయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి.