మాజీ మంత్రి అఖిలప్రియ చున్నీ లాగడంపై టీడీపీ అధిష్టానం నియమించిన త్రిమెన్ కమిటీ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు… ఆ నివేదిక అఖిలప్రియకు షాక్ ఇచ్చేలా ఉంది. ఆ నివేదిక గురించి తెలుసుకునే ముందు… అసలేం జరిగిందో చర్చిద్దాం. నంద్యాలలో నారా లోకేశ్ అడుగు పెట్టగానే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
తనపై హత్యాయత్నానికి అఖిలప్రియ పాల్పడ్డారని ఏవీ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు పెట్టడంతో పాటు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తన చున్నీ పట్టుకుని లాగి, హత్య చేయడానికి ఏవీ ప్రయత్నించారని అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఇదిలా వుండగా నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
నంద్యాలలో అసలేం జరిగిందో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీనియర్ నేతలైన ఆర్ శ్రీనివాస్‌రెడ్డి (కడప), కాలువ శ్రీనివాస్ (అనంతపురం), మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి (చిత్తూరు)లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గత రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో విచారించింది. ఆ రోజు ఏవీ సుబ్బారెడ్డికి దాడికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీసింది. వాస్తవాలను తెలుసుకుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి కమిటీ నివేదిక సమర్పించినట్టు తెలిసింది. అఖిలప్రియ ఆరోపించినట్టు ఆమె చున్నీ లాగారనడంలో వాస్తవం లేదని కమిటీ తేల్చిసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే నారా లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేతపై సొంత పార్టీ నేతలే దాడికి పాల్పడడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏవైనా విభేదాలుంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడ్డం క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తుందని చంద్రబాబు, అచ్చెన్నాయుడు అంటున్నారు. మరోవైపు తప్పని తేలితే ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాల్సిందే అని ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకుడు, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.