విశాఖ బీచ్ లో రాత్రి పది గంటలు దాటితే ఏమవుతుంది. అంతా నిశ్శబ్దం అవుతుంది. అయి తీరాలి. ఇది పోలీసు వారి రూల్. విశాఖ బీచ్ అంటే ఎనీ టైం కమింగ్ అన్నట్లుగా వచ్చేస్తున్నారు. అర్ధ రాత్రి గొడవలు, ఆ మీదట హత్యల దాకా వ్యవహారం వెళ్తోంది.
దీన్ని కంట్రోల్ చేయడానికి విశాఖ పోలీసులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. అర్ధ రాత్రి దాకా బీచ్ రోడ్డు పొడవునా ఉండే షాప్స్ దుకాణాలకు పది గంటలకే మూత వేయమని ఆదేశించారు. పది తరువాత చీమ చుటుక్కుమనరాదు. ఆ తరువాత సాగర కెరటాలు తమ గోడు తామే వినేటంతగా సైలెన్స్ ఉండాల్సిందే. ఎటూ బీచ్ పెట్రోలింగ్ పటిష్టం చేస్తున్నారు. బీచ్ రోడ్డులో సీసీ కెమెరాలను పకడ్బంధీగా ఉండేలా సెట్ చేసి పెడుతున్నారు.
దీని వల్ల బీచ్ ని ఆహ్లాదకరంగా కాకుండా ఆందోళనకరంగా మారుస్తూ తెల్లారితే శవాలు కనిపించేలా బీభత్స రసాన్ని పండించేవారికి తమదైన తీరులో విశాఖ పోలీసులు చెక్ చెప్పబోతున్నారు. సమస్త పాపాలను కడిగేసుకుందామని ఆత్మ హత్యల కోసం హత్యల కోసం బీచ్ ని వాడుకుందామనుకునే వారి ఆటలను పోలీసులు ఇలా కఠిన చర్యలతో కట్ చేయబోతున్నారు. విశాఖ బీచ్ ఉన్నది పర్యాటకుల కోసం, విహారార్ధుల కోసం. చక్కని ప్రశాంతత కోసం అని పోలీసులు అంటున్నారు.
గత కొంతకాలంగా చూస్తే అవాంచనీయ సంఘటనలు రాత్రి వేళల్లో బీచ్ చుట్టూ సాగుతున్న నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ బీచ్ లో పోలీసులు పెట్టిన ఈ కొత్త ఆంక్షలు ఇపుడు సంచలనంగా మారుతున్నాయి. రాత్రి పన్నెండు గడచినా బీచ్ లో షాపుల వద్ద సందడి చేస్తూ తిరిగే వారు విసుక్కుంటున్నారు. పోలీసులు మాత్రం ఇలాగే చేయాలి లేకపోతే పెరుగుతున్న క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయలేమని అంటున్నారు. సో విశాఖ బీచ్ రాత్రి పది తరువాత ఫుల్ సైలెన్స్ అన్న మాట.