Advertisement

Advertisement


Home > Politics - National

వాట్సాప్ మోసాలు.. నిపుణులు చెబుతున్న 5 జాగ్రత్తలు

వాట్సాప్ మోసాలు.. నిపుణులు చెబుతున్న 5 జాగ్రత్తలు

కొన్ని రోజులుగా వాట్సాప్ లో అవాంఛిత కాల్స్ ఎక్కువయ్యాయి. దాదాపు వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వాట్సాప్ లో మెసేజీలు కూడా వస్తున్నాయి. ఇలాంటి లింక్స్ క్లిక్ చేసిన చాలామంది తమ డబ్బు పోగొట్టుకుంటున్నారు.

నిన్నటికినిన్న ఢిల్లీకి చెందిన ఓ మహిళా డాక్టర్, 4 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పోగొట్టుకుంది. వాట్సాప్ లో గుర్తుతెలియని లింక్ ఓపెన్ చేసిన పాపానికి ఓ వ్యక్తి 22 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్ లో ఉద్యోగం కోసం ఆఫర్ లెటర్ అందుకున్న ఓ యువతి, 30 లక్షలకు పైగా పోగొట్టుకుంది. ఇలా చెప్పుకుంటూపోతే వాట్సాప్ ఆధారంగా జరుగుతున్నఆన్ లైన్ మోసాలకు లెక్కలేదు.

అందుకే వాట్సాప్ వినియోగదారుల కోసం నిపుణులు కొన్ని సూచనలు చెబుతున్నారు. సైబర్ నేరాల నుంచి బయటపడేందుకు, వినియోగదారులంతా వాట్సాప్ లో 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు త్వరగా మన వాట్సాప్ ఎకౌంట్స్ లోకి చొరబడలేరు.

ఇక నిపుణులు చెబుతున్న మరో చిట్కా.. బ్లాక్ అండ్ రిపోర్ట్. గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వస్తే, వెంటనే సదరు నంబర్ ను బ్లాక్ చేసి, అదే టైమ్ లో రిపోర్ట్ అనే ఆప్షన్ కూడా కొట్టాలంటున్నారు సైబర్ నిపుణులు. మరీ ముఖ్యంగా విదేశాలకు చెందిన నంబర్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఉద్యోగాలంటూ వాట్సాప్ లో ఎవరైనా సంప్రదిస్తే.. ముందుగా కంపెనీతో నిర్థారణ చేసుకున్న తర్వాతే అలాంటి మెసేజీలకు స్పందించాలని చెబుతున్నారు.

ఇక మూడో ముఖ్యవిషయం ఏంటంటే.. వాట్సాప్ లో వచ్చే ప్రతి లింక్ ను క్లిక్ చేయకూడదు. అనుమానం వచ్చిన లింక్ ను వెంటనే డిలీట్ చేయాలి. చాలా లింక్స్.. మనల్ని రెచ్చగొట్టేలా, మరికొన్ని లింక్స్ ఊరించేలా ఉంటాయి. వీటిలో కొన్ని అశ్లీల ఫొటోల లింక్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాటిపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు.

వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఫొటోస్, స్టేటస్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రొఫైల్, స్టేటస్ లో సెన్సిటివ్ సమాచారాన్ని వెల్లడించకూడదు. చివరికి మన ఊరి పేరు, అడ్రెస్ లాంటివి కూడా అందులో చెప్పకూడదు. ఫ్యామిలీ ఫొటోలు పోస్ట్ చేయడం కూడా సరైన చర్య కాదంటున్నారు నిపుణులు

వాట్సాప్ ను లింక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైంది. డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు చాలామంది. దీనికి సంబంధించి వాట్సాప్ లో లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు తెలియని డివైజ్ ఏదైనా లింక్ అయినట్టు మీకు అనుమానం వస్తే, వెంటనే అన్ని లింక్డ్ డివైజెస్ నుంచి లాగౌట్ అవ్వాలి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాట్సాప్ ఆధారిక సైబర్ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. వీటితో పాటు వాట్సాప్ లో ఏమైనా బెదిరింపు కాల్స్, కస్టమ్స్ అధికారులమంటూ ఏవైనా కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?