ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. తీరా తన నియోజకవర్గానికి పాదయాత్ర వచ్చే సరికి అఖిలప్రియ లేకపోవడం చర్చనీయాంశమైంది. శనివారం రాత్రి లోకేశ్ పాదయాత్ర బనగానపల్లెలో పూర్తి చేసుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు పరిధిలో లోకేశ్ పాదయాత్ర అడుగిడింది.
దొర్నిపాడు శివారు పరిధిలో రాత్రి బస చేశారు. అయితే పాదయాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా భూమా అఖిలప్రియ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వుండింది. కానీ కోరి సమస్యలు తెచ్చుకోవడంతో పాదయాత్ర సమయానికి ఆమె జైల్లో వుండాల్సి వచ్చింది. నంద్యాలలో లోకేశ్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో సొంత పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ నేతృత్వంలో హత్యాయత్నం చేశారంటూ అఖిలప్రియపై కేసు నమోదైంది.
ఏవీ ఫిర్యాదు మేరకు అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారించేందుకు పోలీసులు కస్టడీ అడిగారని తెలిసింది. దీంతో అఖిలప్రియకు మరికొంత కాలం బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఈ లోపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర పూర్తి కానుంది. అఖిలప్రియ లేని కారణంగా ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తాత్కాలికంగా పార్టీ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. పాదయాత్రకు జన సమీకరణ కూడా అతనే చూసుకుంటారని చెబుతున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను లోకేశ్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయాలని కొన్ని రోజులుగా లోకేశ్‌పై అఖిలప్రియ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అయితే ఆళ్లగడ్డ టికెట్ విషయంలో పెద్దాయన (చంద్రబాబు) చూసుకుంటున్నారని, ఏదైనా ఆయనతో మాట్లాడుకోవాలని అఖిలప్రియకు లోకేశ్ సూచించినట్టు సమాచారం.
అఖిలప్రియపై చంద్రబాబు సానుకూలంగా లేరని, ఇందుకు నంద్యాల ఘటన మరింత వ్యతిరేకత పెంచిందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్రపై ఆసక్తి నెలకుంది.